మనం గెలుస్తున్నాం. గతం కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. అనే సీఎం జగన్‌ మాటలు దేనికి సంకేతం. అనేక సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఎటూ తేల్చని విధంగా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. గెలుపు ఓటములపై ఆయా పార్టీల్లో ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం కాస్త జంకుగానే ఉంది పార్టీల నేతలకు. ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం విజయవాడలోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి మనం గెలుస్తున్నాం. గత ఎన్నికల్లో 151 సీట్లు వస్తే ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు వస్తున్నాయని వారితో అనటం సర్వత్రా చర్చకు దారితీసింది.

ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ దేశంలోనే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌ కంటే ఎక్కువ శాతం నమోదైంది. పోలింగ్‌ ఎక్కువ జరగటం ఎవరికి సంకేతమనేదానిపై చర్చ మొదలైంది. ఎవరికి వారు మాకు లాభమంటే కాదు మాకు లాభమని చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి అధికారం వచ్చినా పాలనకు అవసరమైన సీట్లు వస్తాయి తప్ప గతంలో మాదిరి భారీ స్థాయిలో ఒకరికి సీట్లు వచ్చే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు 65శాతం పోలింగ్‌ జరిగితే, ఆ తరువాత మరో ఐదు శాతం సాయంత్రం వరకు పోల్‌ జరిగింది. ఆరు గంటల తరువాత జరిగిన పోలింగ్‌ దాదాపు 12 శాతం ఉంది. అంటే ఏ ఒక్క దశలోనూ పోలింగ్‌ శాతం పడిపోలేదు. వరుసగా ఓటర్లు వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి, మరికొందరు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారు. వీరిలో ఇరు పార్టీల వారికి ఓట్లు వేసిన వారు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లంతా తమకు అనుకూలంగా ఓట్లు వేశారని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటోంది. మా వల్ల సాయం పొందిన ప్రతి కుటుంబం మాకు ఓటు వేసిందని వైఎస్సార్‌సీపీ వారు అంటున్నారు.
వైఎస్సార్‌సీపీకి నిర్మాణ లోపం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి పదేళ్లు దాటినా ఇప్పటి వరకు సరైన నిర్మాణం లేదు. గ్రామ స్థాయిలో పకడ్బంధీగా కమిటీల ఏర్పాటు జరగలేదు. ఎమ్మెల్యేల ద్వారా తూతూ మంత్రంగా కమిటీలు వేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందనే సంకేతం జనంలోకి వెళితే కార్యకర్తలు కూడా నిరాశతో వెనుకడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వారిని కాపాడుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదని ఐప్యాక్‌ కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని అక్కడి నుంచి క్యాడర్‌కు ధైర్యాన్నిచ్చే సందేశం సీఎం ఇచ్చినట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.
జనం మధ్య చెప్పొచ్చు.. కానీ..
ముఖ్యమంత్రి చెప్పదలుచుకున్న అంశాన్ని మీడియాతో చెప్పొచ్చు. సీఎం జగన్‌కు ఏపీ మీడియా అంటేనే గిట్టడం లేదు. అసలు తెలుగు మీడియా అంటేనే గిట్టని పరిస్థితులు ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో ఏనాడూ సెక్రటేరియట్‌లో కానీ, క్యాంపు కార్యాలయంలో కానీ విలేకరుల సమావేశం పెట్టిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి టీమ్‌ మీడియా ద్వారా మాత్రమే ప్రకటనలు విడుదల చేశారు. పైగా తాను ఎంపిక చేసుకున్న నేషనల్‌ మీడియాకు మాత్రం కొన్ని సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఏపీలో అదీ జరగలేదు. ఇటీవల ఇంటర్వ్యూలు ఇచ్చిన తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అటు మీడియా సమక్షంలో కానీ, లేదా రాష్ట్రంలో పోటీచేసిన అభ్యర్థులందరినీ పిలిపించి భారీ సమావేశం ఏర్పాటు చేసి చెప్పొచ్చు. కానీ ఐప్యాక్‌ను మాత్రమే ఎందుకు నమ్ముకున్నారనేది చర్చగా మారింది. పైగా వారికి కోట్లకు కోట్లు ప్యాకేజీలు ఇచ్చి సర్వేలు, అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వారి రిపోర్టును పరిగణలోకి తీసుకున్నారు. కనీసం వంద మంది కూడా లేని ఐప్యాక్‌ టీమ్‌ సభ్యుల ఆఫీస్‌కు వెళ్లి ప్రజలకు ఏమని సందేశం ఇచ్చారనే దానిపై కూడా చర్చ సాగుతోంది.
ఓటమి జరిగితే క్యాడర్‌ నిలుస్తుందా?
ప్రస్తుతం పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో చాలా మందికి ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తిస్థాయి నమ్మకం లేదు. కేవలం డబ్బు బలంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరు ఓడితే వెంటనే వారు చేసుకునే వ్యాపారాల్లో నిమగ్నమవుతారు. అంతేకాని ఆ నియోజకవర్గంలోనే వుంటూ ఫుల్‌టైం పార్టీ పనిచేసే వారు తక్కువేనని చెప్పాలి. అలా జరిగితే ఆ నియోజకవర్గాల్లో పార్టీ డీలాపడిపోయే అవకాశం ఉంది. పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తామని చెబుదామంటే అందుకు ముఖ్యమంత్రి నుంచి హామీనే ఉండటం లేదు. అందువల్ల ఎవ్వరు కూడా పార్టీనే సర్వం అనుకునే స్థితిలో లేరు.
ఒకే జనరేషన్‌ అంటూ..
ఒకే జనరేషన్‌ నుంచి ఒకే ఇంట్లో వారు పభుత్వ పదవుల్లో ఉండటం ఇష్టం లేదు. అందుకే నా చెల్లికి పదవి ఇవ్వలేకపోయాను. నేను ఎంపీగానో, రాజ్యసభ సభ్యురాలుగానో ఇవ్వొచ్చు. అలా వద్దనుకున్నందునే నా చెల్లి దూరమైందని ఇటీవల ఒక ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు పలువురిని ఆశ్చర్య పరిచాయి. రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఉన్నా ఒకే జనరేషన్‌ పేరుతో పక్కన పెట్టిన సీఎం జగన్‌ పార్టీలో పనిచేసే ప్రతినిధులకు ఏమని సందేశం ఇచ్చినట్లు. అందుకే పార్టీ అంటే రక్తతర్పణ చేసేందుకు ఏ ఎమ్మెల్యే సిద్ధంగా లేరనేది స్పష్టమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి జాలీగా తిరిగేందుకు పనికొస్తుంది తప్ప సేవ చేసేందుకు కాదని ఎవరిని అడిగినా చెబుతారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు డబ్బులు నేరుగా ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి ప్రజావసరాల పనులు చేయిద్దామన్నా నిధులు లేవు. కనీసం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఒక చిన్న చప్టా కట్టించేందుకు కూడా చేతకాని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని భుజాలపైన వేసుకుని ఎవరు నడిపిస్తారనేది ప్రశ్నార్థకం.
Next Story