విజయసాయిరెడ్డిని ఇరుకున పెట్టేందుకు టీడీపీ కూటమి రంగంలోకి దిగినట్లు ఏపీలో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజీనామా కు నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.


ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి విజయసాయిరెడ్డి వారి కుటుంబానికి నమ్మిన బంటు. ఆ విషయం ఆయన రాజీనామా చేస్తున్న సందర్భంగా ట్విటర్ వేదికగా చెప్పటం విశేషం. మూడు తరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతిలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతో తనకు పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయని, చంద్రబాబు కుటుంబంతో ఎటువంటి విభేదాలు లేవన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. ఇకపై రాజకీయాల్లో ఉండదలుచుకో లేదని, వ్యవసాయంపై దృష్టి పెడతానని ప్రకటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి, రాజ్య సభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా ఉన్నారు. ఇంకా మూడేళ్ల కాలం పదవి ఉండగానే రాజకీయాల నుంచి తప్పుకోవడం ఆసక్తిని గొలిపే అంశమైంది. మోదీ, అమిత్ షా లను పొగిడారు. ఇందంతా రాజకీయాల్లో జరిగేదేనని కొట్టి పారేయలేము. ఎందుకంటే ఆడిట్ లో చేయి తిరిగిన విజయసాయిరెడ్డి వైఎస్సార్ ఫ్యామిలీలో ఒక సభ్యుడిగా ఉంటూ వచ్చారు. వారి ఆస్తులకు సంబంధించిన అన్ని ఆడిట్స్ ఆయనే చేస్తూ వచ్చారు. జగన్ ఆస్తులకు, ఆయన పెట్టిన కంపెనీలకు సంబంధించిన ఆడిట్స్ కూడా విజయసాయిరెడ్డినే చేస్తూ వచ్చారు. అందుకే వైఎస్ పార్టీ పెట్టగానే విజయసాయి రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్తులకు సంబంధించిన కేసుల్లో పలు కేసులు పడటం జరిగిందే. అయినా జగన్ వెనుక ఉన్నాను కాబట్టి నాకేమీ కాదనే ధీమాలోనే ఉన్నారు.

పక్కాగా ఇరుక్కున్నది కాకినాడ పోర్టు ఆస్తుల కొనుగోలు వ్యవహారం లోనే అనేది పలువురు చెబుతున్న మాట. అందులో నిజం ఎంతో తెలియదు గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు పై రంగంలోకి దిగి విచారించిన సందర్భంలో ఆడిట్ చేసిన సంస్థ విజయసాయిరెడ్డికి సంబంధించిన వాళ్లదేనని, ఆయన చెప్పినట్లు ఆడిట్ చేశారనే సాక్ష్యాలు ఈడీ రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో పక్కాగా విజయసాయిరెడ్డి ఇరుక్కున్నారని, ఇందులో జగన్ ప్రమేయం లేనందున తాను తప్పించుకునే అవకాశం లేదనే ఆలోచనకు విజయసాయిరెడ్డి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

కాకినాడ పోర్టు కు సంబంధించి అరబిందో కంపెనీ కేవీ రావు నుంచి సగం వాటాను లాక్కున్నదనే వాదన బయటకు రావడంతో కేవీ రావు విజయవాడలో సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఈడీ టేకప్ చేసి విచారించి విజయసాయిరెడ్డి ఇరుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలకు తెలియజేసింది. దీంతో ఆయనను త్వరలోనే అరెస్ట్ చేయాలనే ఆలోచనకు కేంద్రం వచ్చినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ కేసులో కేవీ రావు వాటాలు ఆయనకు తిరిటి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినా కేసు మాత్రం అలాగే ఉంది. ఈ వ్యవహారంలో చట్టం తనపని తాను చేసిందని అడుగులు వేసే ఆలోచనలో ఈడీ ఉన్నారని తెలుసుకున్న విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా ఉంది.

ఇవన్నీ తెలుసుకున్న విజయసాయిరెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల వద్ద హామీ తసుకుని వైఎస్సార్సీపీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ పై ఉన్న కేసుల్లో ఎటువంటి భయం లేదని, ఈ చిన్న కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళితే ఇబ్బందులు తప్పవనే ఆలోచనకు విజయసాయి వచ్చారని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వైఎస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాలు కూడా తన రాజీనామాలో ఒక పార్టుగా చెప్పుకోవచ్చు. అన్నా చెల్లెలు మధ్య గొడవలు ప్రారంభం కావడం, అవి రాజకీయ విమర్శలకు దారి తీయడం, కుమార్తె వైపు విజయమ్మ నిలబడటంతో అన్నీ ఒకసారి ఆలోచించిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉంటూ జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. మరో కేంద్రంలోని వైపు కూటమి నుంచి కూడా వైఎస్సార్ సీపీకి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి.

ఇవ్నీ ఒక్కటై జగన్ బెయిల్ రద్దుచేసి జైలుకు పంపిస్తే రెండేళ్లు శిక్షపడేలా చేసి పోటీకి అనర్హుడిని చేస్తే జీవితాంతం తాను బాధపడాల్సి ఉంటుందని, అందుకే కేంద్ర కూటమి ఆడిన నాటకంలో విజయసాయి పావుగా మారాడని, త్వరలోనే జగన్ కేసుల్లో అప్రువర్ గా మారతాడనే ప్రచారం కూడా రాజకీయ పార్టీల్లో మందలైంది.

Next Story