జగన్ హిందీపై చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారా?
x

జగన్ హిందీపై చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారా?

మీడియా చేసే కొన్న ట్రిక్కులు నాయకుల్ని ఇబ్బంది పెట్టే దశకు తీసుకువస్తున్నాయా? ఇందులో నిజమెంత? అబద్ధం ఎంత?


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆయన మాటలున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఆ వీడియోలు డీప్ ఫేక్ అని కొందరు, కాదు నిజమైనవే అని ఇంకొందరు అంటున్నారు. అసలేం జరిగిందీ, ఎందుకు వివాదం అయ్యాయి అనేది ఓసారి చూద్దాం..
జగన్ మోహన్ రెడ్డి జూలై 16న సుదీర్ఘ మీడియో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జాతీయ మీడియా ఛానళ్ల ప్రతినిధులు కొందరు ఆయన్ను ప్రత్యేకంగా ఓ ప్రశ్న అడిగారు.
ఆ ప్రశ్న ఏంటంటే.., “హిందీని జాతీయ భాషగా ప్రమోట్ చేస్తారా?” అనేది. దీనికి జగన్ స్పందిస్తూ, “దీంట్లో ఏమి ప్రమోట్ చేయడం ఏముందీ? ఇది స్పష్టంగా జాతీయ భాషే కదా,” అని చెప్పినట్టు వినిపిస్తుంది. ఆ వీడియో బాగా వైరల్ అయింది.
దీంతో ఇది డీప్‌ఫేక్ అని కొంతమంది వాదించడం మొదలు పెట్టారు. జగన్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నది వారి వాదన.
ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు కొందరు- మూలాల్లోకి వెళ్లారు. వాళ్ల విశ్లేషణల ప్రకారం, ఈ వీడియో వాస్తవమేనని తేలింది. అయితే ఈ వీడియోను వైరల్ చేసిన వాళ్లు కిందిది మీదికి, మీదికి కిందికి తెచ్చి తమకు ఏది కావాలో దాన్నే వైరల్ చేశారు.
AI ఆధారిత వీడియో విశ్లేషణ టూల్ - Hive Moderationతో ఈ వీడియోను పరిశీలించారు. దానిలో ఏ విధమైన మార్పులు, డీప్‌ఫేక్ లక్షణాలు లేవని తేల్చారు.
వీడియోలో, ఆడియోలో ఏఐ జోక్యం అసలు లేదని నిర్ధారణ అయింది.
అలాగే, క్లిప్‌లో కనిపించే RTV News లోగో ఆధారంగా గూగుల్‌లో చేసిన శోధనలో, జూలై 16, 2025న RTV News విడుదల చేసిన పూర్తి వీడియోను గుర్తించగలిగారు.
ఆ వీడియోలో జగన్ భాషా విధానంపై స్పష్టతనిచ్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, హిందీని ఒక భాషగా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
విద్యా మాధ్యమం మాత్రం ఇంగ్లీష్ కావాలని స్పష్టంగా చెప్పారు.
“ఈ దేశం ముందుకు వెళ్లాలంటే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఇంగ్లీషులో నైపుణ్యం కలిగి ఉండాలి,” అని జగన్ పేర్కొన్నారు.
వీడియో చివర్లో, విలేఖరి హిందీని జాతీయ భాషగా గుర్తించాల్సిన అవసరం ఉందా? అని మళ్లీ అడిగినప్పుడు, “ఇందులో కొత్తగా చెప్పాల్సిందేముందీ? అది స్పష్టంగా జాతీయ భాషే కదా,” అంటూ స్పందించారు. ఇది క్లిప్‌గా కత్తిరించి వైరల్ చేశారు.
వైరల్ అయిన వీడియో అసలైనవేనని, డీప్‌ఫేక్ కాదని నిర్ధారణ అయింది.
జగన్ హిందీని జాతీయ భాషగా పేర్కొన్న మాటలు ఆయన పూర్తి వ్యాఖ్యలలో భాగంగా వచ్చినవే. అయితే, ఆయన విద్యా మాధ్యమంగా ఇంగ్లీషును ప్రాధాన్యతనిస్తూ, భాషల ఎంపికను విద్యార్థుల ఇష్టానికి వదిలేయాలన్న దృక్పథాన్ని తెలియజేశారు.
మీడియాలో ఎవరికి కావాల్సిన వాటిని కట్ చేసి వైరల్ చేసుకోవడం వల్ల చిక్కు ఇది. హిందీ భాషా ఛానళ్లు తమకు కావాల్సిన వాటిని తీసుకుని మిగతా వాటిని వదిలేయడం వల్ల అసలు వక్తల్ని ఇబ్బంది పెట్టే పరిస్ధితికి తీసుకువచ్చారు.
హిందీని జగన్ ప్రమోట్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా చేస్తే దక్షిణాది వాళ్లు ఆయన్ను వ్యతిరేకిస్తారన్న ఉద్దేశం కూడా బహుశా ఇందులో ఉండి ఉండవచ్చు.
ఏమైనా, మీడియా వార్తలకు విశ్వసనీయత ఉండాలంటే ముందు వెనకా కూడా చూపించడం అవసరం. లేకుంటే అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుందని సీనియర్ జర్నలిస్టు జి.ఆంజనేయలు చెప్పారు.
Read More
Next Story