జగన్, పట్నాయక్ మధ్య ఎంత తేడా!
ఏపీలో జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఇద్దరూ ఓటమి పాలైనవారే. అయితే ఇద్దరి 'రాజకీయం' లోనూ ఎంతో వ్యత్యాసం ఉంది. రాజకీయం చేయడం వేరు.. రాజకీయం తెలియడం వేరు.
ఏపీలో జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఇద్దరూ ఓటమి పాలైనవారే. అయితే ఇద్దరి 'రాజకీయం' లోనూ ఎంతో వ్యత్యాసం ఉంది. రాజకీయం చేయడం వేరు.. రాజకీయం తెలియడం వేరు. చాలామంది రాజకీయం చేస్తున్నామనుకుంటారు కానీ రాజకీయాల్లోని లోటుపాట్లు తెలియవు. రాజకీయం తెలియడమంటే రాజనీతిజ్ఞతను వంట పట్టించుకోవడం. శత్రుత్వం లోపల ఉన్నా బయటకు కనబడనివ్వకూడదు. ఈ సూత్రం బాగా తెలిసిన ఇప్పటి నేతల్లో పట్నాయక్‌నే తొలుత చెప్పాలి. బుధవారం ఉదయం విజయవాడలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే, సాయంత్రం భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి ప్రమాణం చేశారు.
అయితే అంతవరకు మామూలే. ఒడిశాలో ఓడిపోయిన బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మాఝి ప్రమాణ కార్యక్రమానికి వెళ్లడమే గాక వేదికపై ఆశీనులు కావడం, తర్వాత మాఝిని అభినందించడం పెద్ద ట్విస్ట్. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన నేతలు ఇక గెలిచిన వారి ముఖం చూడరు. ఈవీఎంలను తిడుతూ కూర్చుంటారు. కానీ నవీన్ అలా చేయకుండా మాఝీ ప్రమాణ కార్యక్రమానికి వెళ్లారు. ప్రధాని మోదీతో కబుర్లు చెప్పి కొత్త ముఖ్యమంత్రిని అభినందించి వచ్చారు. ఇది జాతీయ మీడియా దృష్టిని సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఇంగ్లీష్ మీడియాలో కూడా పట్నాయక్.. మోదీ, మాఝీతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడుతూ కాలక్షేపం చేయడం పదే పదే చూపించారు.
మరి ఇది సాధారణ విషయం కాదు కదా! ఎన్నికలకు ముందు అంటే పది రోజుల ముందు వరకు ప్రచార సభల్లో పట్నాయక్‌ను ప్రధాని మోదీ ఎంత తీవ్రంగా విమర్శించారో, దానికి దీటైన జవాబులు పట్నాయక్ ఎలా ఇచ్చారో చూశాం. పట్నాయక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనీ, అటువంటి వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారనీ ప్రచార సభల్లో మోదీ ప్రజలను ప్రశ్నించారు. దానికి 'నేను సభల్లో మాట్లాడుతున్నాను కదా! నాకు అనారోగ్యం ఏం ఉంది?' అంటూ పట్నాయక్ ప్రశ్నించే వారు. ఇలాంటి వివాదాలు చాలానే నడిచాయి. కానీ అవేమీ ఎరగనట్లే పట్నాయక్.. ప్రధానితో మాట్లాడుతూ కనిపించారు. చంద్రబాబు, మాఝీ.. ఇద్దరి ప్రమాణోత్సవాలకు ప్రధాని హాజరయ్యారు.
ఒడిశాలో ఏర్పడింది పూర్తి బిజెపి ప్రభుత్వమైతే, ఏపీలో బిజెపి భాగస్వామ్యం గల ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రజల సమక్షంలోనే జరిగాయి. ఒడిశాలో పాతికేళ్ల నుంచి అప్రతిహతంగా పాలిస్తున్న పట్నాయక్ ప్రభుత్వం కూలిపోవడం ఒక విచిత్రమైతే, అసాధారణమైన సంక్షేమ పథకాలు అమలు చేసినట్లుగా చెబుతున్న జగన్ ప్రభుత్వం ఓడిపోవడం మరింత ఆశ్చర్యకరం. జగన్ కలలో కూడా ఇలాంటి ఓటమిని ఊహించలేదనే చెప్పాలి. తన పార్టీ అఖండ మెజారిటీతో మళ్లీ విజయం సాధిస్తుందని, ప్రభుత్వం నుంచి నగదు సహాయం అందుకున్న అక్కాచెల్లెళ్ళు, అవ్వతాతలు తనను తప్పక గెలిపిస్తారనీ జగన్ ఆశించారు.
అయితే ఆయన ఆలోచన అంతా తారుమారైంది. రెండు చోట్లా ఒకే విధంగా ప్రభుత్వాలు పడిపోయాయి. కానీ ఆ ఓటమి ప్రభావం పడకుండా పట్నాయక్ వెంటనే జనంలోకి వచ్చారు. ప్రభుత్వ కార్యక్రమంలో మమేకమయ్యారు. ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించి 'రోల్ మోడల్' అయ్యారు. పట్నాయక్ పాతికేళ్లు పాలించిన తర్వాత ఓటమి పాలైతే, జగన్ అయిదేళ్లకే వెనుదిరిగారు. ఓటమి, గెలుపు ఏ రాజకీయ నాయకునికైనా సాధారణమే అయినా ఓటమికి కుంగిపోవడం మంచిది కాదు. పట్నాయక్ తన చర్య ద్వారా అదే అందరికి చెప్పినట్లయింది. భువనేశ్వర్‌లో ప్రమాణ కార్యక్రమం కూడా చాలా అట్టహాసంగానే జరిగింది.
చంద్రబాబు ప్రమాణ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జెపి నడ్డా, వెంకయ్య నాయుడు, బండి సంజయ్ వంటి పలువురు ముఖ్య నేతలు హాజరు కాగా భువనేశ్వర్ కార్యక్రమానికి ప్రధాని, నడ్డా, అమిత్ షా తో పాటు రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్య నాథ్ వంటి మరికొందరు బిజెపి అగ్రనేతలు కూడా హాజరయ్యారు. వేదికపై బిజెపి అగ్రనేతలు ఉడడం వల్లనో ఏమో! మిగిలిన పార్టీల వారు ముందుకు రాలేక పోయారు. ఈ విషయంలో పట్నాయక్ కొత్త ట్రెండ్ సృష్టించారనే చెప్పాలి.
ఒడిశాలో ఒక ప్రధాన రాజకీయ పక్షమైన బిజూ జనతాదళ్ అధినేత, పాతికేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎవరి మెప్పు కోసమో ఇలాంటి కార్యక్రమాలకు రావాల్సిన అవసరం లేకపోయినా సందర్భానికి తగినట్లుగా స్పందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. రాజకీయం తెలియడమంటే అదే. అదే విధంగా ఏపీలో జగన్ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఉంటే జాతీయ మీడియా ఫోకస్ సైతం ఆయన మీదే ఉండేది. జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు పెరిగి ఉండేది. నిజానికి బిజూ పట్నాయక్ తర్వాత పార్టీని ఎంతో ప్రతిష్టాత్మకంగానే నవీన్ నడుపుతున్నారు.
ఎవరైనా ఆయనతో పొత్తుకు తాపత్రయపడుతుంటారు గాని ఆయన ఎవరి పొత్తు కోసం వెళ్లరు. ఇటీవలి ఎన్నికల ముందు కూడా బిజెపి ఆయనతో పొత్తుకు చాలా ప్రయత్నించి సీట్ల సర్దుబాటు వద్ద విఫలమైంది. గత పాతికేళ్లుగా పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిపారు పట్నాయక్. కానీ జగన్ గత ఐదేళ్లలోనే తీవ్ర విమర్శల పాలయ్యారు. అయినా, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల 40 శాతం ఓటు బ్యాంకు జగన్ వద్ద ఇంకా మిగిలే ఉంది. అంటే బలమైన స్థానంలోనే ఉన్నట్లు చెప్పాలి.
సీట్లు ఓ డజను కూడా లేకపోయినా, ప్రతిపక్ష హోదా అయినా రాకపోయినా ఓట్ల శాతం బాగానే ఉన్నది గనుక దానికి తగిన రాజకీయం చేయాలి. అంటే ' నన్ను ముట్టుకోకు ' అన్నట్లు గాక ప్రభుత్వానికి తాను వ్యతిరేకమేమీ కాదన్నట్లు కనిపించాలి. ఒడిశాలో పట్నాయక్ చేసింది అదే. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి జగన్ హాజరై ఉంటే కొత్త సంప్రదాయాన్ని సృష్టించడమే గాక చరిత్రలో కూడా నిలిచే వారు. సాధారణంగా ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుతూనే ఉంటుంది. చంద్రబాబు కార్యక్రమానికి అలాగే సిఎస్ నుంచి ఆహ్వానం వెళ్లింది.
ప్రతిపక్ష నేత కూడా కొంత శాతం ప్రజలకు ప్రతినిధే గనుక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయనకూ భాగం ఉంటుంది. ఈ విషయం మర్చిపోయి ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమం తమకు నచ్చినా, నచ్చకపోయినా వాటికి దూరం మాత్రం కాకూడదు. అదే రాజకీయం. గతంలో చంద్రబాబు ప్రధాని మోదీని నిశితంగా విమర్శించిన సందర్భాలున్నాయి.
కానీ వాటన్నిటినీ మరచి ఇప్పుడు అదే బిజెపి తో పొత్తు కుదుర్చుకున్నారు. మరి అదే కదా రాజకీయం. జగన్ కూడా చంద్రబాబుతో ఉన్న వ్యతిరేకతను బయటికి పక్కనపెట్టి పట్నాయక్ లా చేసి ఉంటే ఆ దృశ్యం విభిన్నంగా ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనక పోయినా ప్రజలందరి అటెన్షన్ పడే కార్యక్రమాల్లో పాల్గొంటే ' ప్రజాదరణ ' పెంచుకొనడానికి అవకాశం కలుగుతుంది.