ఉత్తరాంధ్రలో సైన్యం ఏం చేస్తోంది...
x
Source: Twitter

ఉత్తరాంధ్రలో 'సైన్యం' ఏం చేస్తోంది...

ఉత్తరాంధ్రలో జన సైనికులు అయోమయంలో పడ్డారు.. సీట్లు రాక...చేసేదేమీ లేక... సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అసలు ఉత్తరాంధ్ర జనసేనలో ఏం జరుగుతోంది...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: వైలెంట్‌గా ఒకరు సైలెంట్‌గా ఇంకొకరు… ఆనందంతో ఒకరు ఆవేదనతో ఇంకొకరు… పార్టీని వీడుతుంది ఒకరు... పార్టీలో ఉండి మధనపడుతుంది ఇంకొకరు... ఇదీ ఉత్తరాంధ్రలో జనసైనికుల పరిస్థితి. చెప్పుకుంటూ పోతే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇలా ఎన్నో కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉండగా జనసేన కేవలం మూడు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీకి, ఇప్పుడు జనసేనకు కాస్తో కూస్తో పట్టున్న ఉత్తరాంధ్రలో సీట్లు ప్రకటించకపోవడం ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఇక ప్రకటించిన స్థానాల్లో రెబల్స్ రెచ్చిపోతున్నారు.

రెబల్స్ బెడద...

ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. అనకాపల్లి నియోజకవర్గానికి సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను అభ్యర్థిగా తొలి జాబితాలో జనసేన ప్రకటించింది. దీంతో అక్కడి అసమ్మతి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా సీనియర్ నేత పరుచూరి భాస్కరరావు రాజీనామా కూడా చేశారు. ఇక విశాఖ దక్షిణంలో జనసేన అధికారికంగా ఇంకా సీటు ప్రకటించినప్పటికీ మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్‌ల నడుమ సీటు వివాదం కొనసాగుతుంది. ఇరువర్గాలు కొట్లాటకు పోయి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాయి. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి పంచకర్ల రమేష్ బాబును జనసేన ప్రకటించగా అక్కడ టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తూ పంచకర్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పెందుర్తి సీటు ఆశించిన జనసేన సీనియర్ నాయకులు తమ్మిన శివశంకర్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు.

మనస్తాపంతో బొలిశెట్టి...

విశాఖకు చెందిన కాపు నేత, పర్యావరణ పరిరక్షకులు బొలిశెట్టి సత్య కూడా ప్రస్తుతం జనసేన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. 'జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నాకు కనీసం అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. మాట మాత్రమైనా చెప్పకుండా నేతలకు టిక్కెట్లు ఇచ్చేశారు' అంటూ సోషల్‌ మీడియా ద్వారా బొలిశెట్టి సత్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఈసారి టికెట్ ఆశించిన పసుపులేటి ఉషాకిరణ్ తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు తీవ్ర అన్యాయం జరిగిందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. మరోవైపు యువ నేత పంచకర్ల సందీప్ సైతం ఇదే బాటలో ఉన్నారు. టీవీ డిబేట్‌లో పాల్గొంటూ పార్టీ వాయిస్‌ని బలంగా వినిపించిన సందీప్‌ను జనసేన అధిష్టానం లైట్ తీసుకోవడంతో ఆయన ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఇలా దాదాపు జనసేన టికెట్లు కేటాయించిన ప్రతి చోటా ఇదే తరహా ఆందోళనలు కనిపిస్తుండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

విజయనగరం జిల్లాలో...

విజయనగరం జిల్లాలో సీను వేరు... ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా... నెల్లిమర్ల స్థానం నుంచి లోకం మాధవికి జనసేన టికెట్ కేటాయించింది. జిల్లాలో జనసేనకు పట్టు అంతంత మాత్రమే అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం మాధవి చరిష్మా పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో కూడా పీఆర్పీ పోటీ చేసినప్పుడు అత్యధికంగా ఓట్లు పడింది కూడా ఈ నియోజకవర్గంలోనే.

సిక్కోలు సైనికులు గగ్గోలు...

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా... జనసేన ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. గత ఎన్నికల్లో జనసేన పదికి పది నియోజకవర్గాల్లో పోటీ చేయగా... ఈసారి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జిల్లాలోని సైనికులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఒక్క టికెట్ అయినా కేటాయించండి అంటూ అధిష్టానాన్ని వేడుకుంటున్నారు. జనసేనకు కాస్తో కూస్తో పట్టున్న ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందో అంటూ ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.

Read More
Next Story