మాజీ సీఎం జగన్‌ విశాఖలో నిర్మించిన భవనాలు ఎవరి కోసం, ఎందు కోసమని చెప్పక పోవడం వల్లే వివాదాల్లో చిక్కుకున్నారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ వివాదాల వల అల్లుకుంటోంది. విశాఖపట్నంలో తన ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవన సముదాయాలు వివాదాలకు కారణమయ్యాయి. తాడేపల్లిలోని ఆయన నివాస భవనం చుట్టూ వేసిన రోడ్లు కూడా వివాదాలకు దారి తీసాయి. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ఇంకా ఇవ్వ లేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌ డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ స్పీకర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన క్యాంపు కార్యాలయానికి ఇచ్చిన ఫర్నిచర్‌ను దొంగిలించారని జగన్‌ ప్రభుత్వం అప్పట్లో కేసు నమోదు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ ఎంత మొత్తం ఉంది, దానిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చా, లేదా అనే అంశాల గురించి వెల్లడించకుండానే జగన్‌పైన కేసులు పెట్టాలనే డిమాండ్‌లు తెరపైకి రావడం విశేషం.

విశాఖలో రుషి కొండ భవనాలపై గోప్యత ఎందుకు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలోని రుషి కొండపై పలు ప్రభుత్వ భవనాలను నిర్మించారు. ఈ భవనాలు ఎందు కోసం నిర్మిస్తున్నారు? ఏ శాఖ ద్వారా నిర్మిస్తున్నారు? ఎవరి కోసం నిర్మిస్తున్నారు? నిర్మాణాలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారు? ఏ సంస్థ వీటిని నిర్మిస్తుంది? తదితర వివరాలను ముందుగానే వెల్లడించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. రుషి కొండపై నిర్మిస్తున్న భవనాలు ప్రైవేటు వారు నిర్మిస్తున్నారా? ప్రభుత్వం వారు నిర్మిస్తున్నారా? అనే అంశాలపై కూడా ఈ ఐదేళ్ల కాలంలో అప్పటి జగన్‌ ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ కూడా ఇవ్వ లేదు. రుషి కొండపై చాలా మంది ప్రైవేటు వ్యక్తులు భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారని, వారి సొంతంగా అపార్ట్‌మెంట్లు కడుతున్నారనే ప్రచారం కూడా సాగింది. దీనిని కూడా నాటి ప్రభుత్వం ఖండించ లేదు. అక్కడ కట్టేవి ప్రభుత్వ భవనాలేనని ఒక్క సారి కూడా ప్రజలకు వెల్లడించ లేదు.
సెక్యురిటీ రీజన్స్‌ ఏమిటి?
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రుషి కొండపై నిర్మిస్తున్న భవనాలు ప్రభుత్వం తరపున నిర్మిస్తున్నవేనని, టూరిజమ్‌ శాఖ తరుపున ఈ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడం విశేషం, విశాఖపట్నం అనేది రెండో అతి పెద్ద రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన నగరమని, భీమిలి రోడ్డులో స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ను నిర్మించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై కోర్డు కేసు వేసి, టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. విశాఖను రాజధానిగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు ఎక్కడ అనువుగా తెలుసుకునేందుకు ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో త్రీమెన్‌ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం టూరిజమ్‌ శాఖకు చెందిన భవనాలను బాగు చేయడం, కొత్త భవనాలను నిర్మించడం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కమిటీ వెలుబుచ్చింది. ఆ కమిటీ నిర్ణయం తర్వాత నిర్మాణాలను చూసేందుకు సెక్యురిటీ రీజన్స్‌ వల్ల లోపలికి అనుమతించడం లేదని, మంత్రిగా ఉన్నప్పుడు గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఆ సెక్యురిటీ రీజన్స్‌ ఏమిటీ అనేది ఈ రోజుకు ఎవరికి తెలియవు. వాటిని నాటి ప్రభుత్వం కూడా వెల్లడించ లేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వారు నిర్మాణంలో ఉన్నవి జగన్‌ సొంత భవనాలంటూ లోపలకెళ్లి చూపించారని, ఈ భవనాలు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, విదేశీ ప్రతినిధులు వంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఉండేందుకు వీలుగా టూరిజమ్‌ శాఖ తరపున ఈ భవనాల నిర్మాణాలు జరిగాయని అమర్‌నాథ్‌ తెలిపారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు మీడియాను తీసుకెళ్లి భవనంలో ఎన్ని రూమ్‌లు ఉన్నాయి, ఏ రూముల్లో ఏమున్నాయనేవి చూపించారు. అంటే వీవీఐపీలు ఉండే భవనాలు, వాటి బ్లూ ప్రింట్‌ను బయట పెట్టినట్టే కదా. ఇలా చేయడం వల్ల వీవీఐపీలకు సెక్యురిటీ సమస్యలు వస్తే అందుకు బాధ్యులు ఇప్పుడు చూపించిన వారే అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అమర్‌నాథ్‌ ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వం రాకముందే చెప్పి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు కదా అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సమస్యకు కారణం వైఎస్‌ఆర్‌సీపీనే
రుషి కొండపై టూరిజమ్‌ శాఖ ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపడుతోందని, ఈ ప్రాజెక్టు వల్ల గతంలో ఉన్న భవనాలను మరమ్మతులు చేయడంతో పాటు కొన్ని కొత్త భవనాల నిర్మాణాలు కూడా చేపడుతున్నట్లు గత ప్రభుత్వం చేప్పి ఉండే ఇంత రాద్దాంతం ఉండేంది కాదు. అలా చెప్పకుండా ఏదో రహస్యమన్నట్లు భవనాల నిర్మాణాలు చేపట్టడం వల్లే సమస్య మొదలైంది. తెలుగుదేశం పార్టీ వారికి కానీ, స్థానికులకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ అవి ప్రభుత్వ భవనాల అని సోమవారం గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పే వరకు ఎవరికీ తెలియలేదు. కనీసం టూరిజం శాఖైనా ఈ భవనాలు తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినవే అని వెల్లడించ లేదు. ఇందు వల్లే లేని పోని విమర్శలకు జగన్‌ తావిచ్చారని చెప్పొచ్చు. తిరిగి తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో రుషి కొండపైనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించామని అనుకున్నారే కానీ, ఒక వేళ ప్రభుత్వం మారితే వచ్చే సమస్యల గురించి కానీ, రాష్ట్ర ప్రజలకు చెపక పోవడం వల్ల వచ్చే ఇబ్బందులు గురించి కానీ ఆలోచించినట్లు కనిపించడం లేదు. ఇలా బయటకు చెప్పక పోవడం వల్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు జగన్‌ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి.
Next Story