అనంతలో రగిలిన మంటలు..
x

అనంతలో రగిలిన మంటలు..

ఎన్నికల వేళ అభ్యర్థుల పేర్ల వెల్లడి. భగ్గుమనే ఆగ్రహం. కార్యాలయాల ధ్వంసం ఇది టీడీపీ సంప్రదాయం. ఇప్పుడు కూడా అదే జరిగింది.


(ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్)

తిరుపతి: ప్రస్తుత ఎన్నికలకు టికెట్లు దక్కని సీనియర్లు తిరగబడ్డారు. అనుచరులు టీడీపీ ప్రచార సామాగ్రిని శుక్రవారం దహనం చేశారు. రాయలసీమ జిల్లాల్లో అనేక నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చాలనే డిమాండ్‌తో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. సాధారణంగా..

పొత్తు ఉంటేనే పొద్దు పొడుస్తుంది

"మిత్రులు లేకుండా టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లలేరు" నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడుపై ఉన్న విమర్శ ఇది. ఆ కోవలోనే.. 2024 ఎన్నికలకు కూడా పొత్తులు టీడీపీకి తలనొప్పిగా మారాయి. సీట్ల సర్దుబాటులో సీనియర్లకు న్యాయం చేయలేకపోవడం ఒక కారణమైతే. కొత్త వాళ్ళని తెరపైకి తీసుకు రావడం కూడా ఆగ్రహానికి ఆజ్యం పోస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా మారిపోయింది. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం నిజమే అనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. కొన్ని జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు కాకుండా కమ్యూనిస్టులే పోటీ చేసి జిల్లాలకు జిల్లాలు వారి గుప్పెట్లో పెట్టుకున్న ఎన్నికలు ఎన్నో జరిగాయి. ఆ కోవలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌తోపాటు విజయవాడ, రాయలసీమ, అనంతపురం జిల్లాల నుంచి కూడా కమ్యూనిస్టులు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగిన ఎన్నికలు ఎన్నో ఉన్నాయి. తిరుగుబాటు చేసి రోడ్డు పైకి వచ్చిన సందర్భాలు అనడం కంటే.. అంత సాహసానికి ఒడిగట్టిన నేతలు లేరని చెప్పవచ్చు. ఇప్పుడేమైంది..


యాదృచ్ఛికమే.. రగిలిపోయిన నేతలు

యాదృచ్ఛికంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు 2024 ఎన్నికల కోసం తుది జాబితా శుక్రవారం ప్రకటించారు. టికెట్లు దక్కని అభ్యర్థులు ఆగ్రహానికి గురయ్యారు. రాయలసీమ జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అప్పటివరకు మోసిన జండాలను తగలబెట్టారు. అనంతపురం, కడప జిల్లాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అనంతలో ఆగ్రహ జ్వాల

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో టీడీపీకి కార్యకర్తల నుంచి నాయకుల వరకు గట్టిపట్టుంది. గత ఎన్నికల్లో మినహా ప్రతిసారి ఇక్కడి నుంచి ఆదిపత్యం చలాయించిన నాయకులకు కొదవలేదు. 2024 ఎన్నికల జాబితా ప్రకటించడంలో తీవ్ర దాస్తారం జరిగింది. మొదట జనసేనతో ఏర్పడిన మైత్రి, వీరిద్దరూ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల నిర్ణయంలో జపం జరిగింది.

అనంతపురం జిల్లా అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు వైకుంఠ ప్రభాకర చౌదరి అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రచార సామాగ్రితో పాటు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం దుర్మార్గమైంది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు. ‘పార్టీలు అన్నీ కంపెనీలుగా మారాయి’ అని అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తున్నార’’ అని ప్రభాకర్ చౌదరి ప్రస్తావించారు. తన రాజకీయ వైఖరిపై శనివారం ప్రకటన చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మండిన గుంతకల్

అనంతపురం జిల్లా గుంతకల్లులో కూడా టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. టీడీపీ ప్రచార సామగ్రితో పాటు కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు నిలువెత్తు కటౌట్‌ను దహనం చేశారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. "పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు" ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన జితేంద్ర గౌడ్ ప్రకటించారు. గుమ్మనూరు జయరాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ, 15 రోజులుగా నియోజవర్గంలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వీటన్నిటిని పట్టించుకోకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


రాజంపేటలో రచ్చ... రచ్చ

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీలోని బలిజ సామాజిక వర్గం నేతలు రెచ్చిపోయారు. రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ, ఆందోళన దిగారు. ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడికి టికెట్ ఇవ్వకపోవడంపై రోడ్డుపైకొచ్చి నిరసన వ్యక్తం చేశారు.

ఆదిమూలం వద్దే వద్దు..

చిత్తూరు జిల్లాలో వివాదం ఇంకా సమసిపోలేదు. సత్యవేడులో కోనేటి ఆదిమూలంను తప్పించాలని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు తిరుపతిలో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం అక్రమ కేసులతో వేధించారని, దోతి వేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఎన్నారై రమేష్ నాయుడు, బుచ్చినాయుడు కండ్రిక పార్టీ నాయకుడు అన్నయ్య నాయుడు, సత్యవేడు ఈటిపాకం మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు ఈశ్వరయ్యతో పాటు వరదయ్యపాలెం, సత్యవేడు రూరల్, పిచ్చాటూరు మండలాల కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు.

ఆరని మంటలు..

తిరుపతి అసెంబ్లీ స్థానంలో టీడీపీ వర్గం నాయకులు జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు సహకారం లభించడం లేదు. టీడీపీ నుంచి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఇంకొందరు నాయకులు కలిసి వచ్చారు. జనసేనలో ఇంకో వర్గం నేతలు దూరంగా ఉన్నారు. బీజేపీలో వేర్వేరుగా ఉన్న సీనియర్ నాయకురాలు శాంతా రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్, సామంచి శ్రీనివాస్.. కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.


శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కూడా వారందరూ పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ, జాతీయ కార్యదర్శి జీ నరసింహ యాదవ్, సీనియర్ నాయకుడు ఆర్‌సీ మునికృష్ణ, ఊక విజయ్ కుమార్ వంటి సీనియర్లందరూ సమావేశంలోనే కాదు.. ప్రచారంలో కూడా కనిపించలేదు. జనసేన నుంచి కొణిదెల నాగబాబు, టీడీపీ నాయకులకు ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ వేరువేరుగా కలిసినప్పుడు చేసిన సూచనలు కూడా రాలేదని కనిపిస్తోంది.

మదనపల్లి ఎవరి దారి వారిదే

మదనపల్లిలో ఎవరి దారి వారిది అన్నట్లుగానే ఉంది పరిస్థితి. అభ్యర్థిత్వం ఖరారు చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. అభ్యర్థిత్వం సాధించాలని ఆరాటంలో భంగపడిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ సమన్వయకర్త గంగార ప్రాంతాల చౌదరి ఏకమై వేరు కుంపటి పెట్టారు. ఇంతవరకు పార్టీ అభ్యర్థి ప్రచారానికి కూడా రాకపోవడం గమనించిన విషయం. ఈ పరిస్థితుల్లో ప్రతి జిల్లాలను కొత్త అభ్యర్థులను తీసుకురావడం, సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి గందరగోళంగా కనిపిస్తుంది.

బీసీలను పట్టించుకోరా?

నెల్లూరు జిల్లా మొత్తం ప్రశాంతంగా ఉన్నప్పటికీ, వెంకటగిరి నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా మారింది. వెంకటగిరి టికెట్ బీసీలకు కాకుండా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను కూడా పట్టించుకోవడం లేదని, విలువ కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ కుమార్తె వెంకట సాయి లక్ష్మికి టికెట్ ఇవ్వడంపై ఆక్షేపణ వ్యక్తం అయ్యాయి. సీనియర్ల మాటకు విలువ లేదంటూ, బీసీ నాయకుడు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. కూటమి పార్టీల అధినేతలు ప్రత్యక్ష జోక్యంతో మినహా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి చక్కబడే వాతావరణం కనిపించడం లేదు.



Read More
Next Story