పుట్టపర్తి లో మీసం తిప్పిన అరగుండు సజ్జల..
x
Source: Twitter

పుట్టపర్తి లో మీసం తిప్పిన 'అరగుండు' సజ్జల..

పుట్టపర్తి వైసీపీలో అసమ్మతి సెగలు చెలరేగాయి. శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వడాన్ని నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.



ఆంధ్ర రాజకీయాల్లో అసమ్మతి సెగలు చెలరేగుతున్నాయి. అన్ని పార్టీల్లో టికెట్ లభించని ఆశావహులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. తమకెందుకు అన్యాయం చేశారంటూ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పుట్టపర్తి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే ఇవ్వడాన్ని నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పుట్టపర్తి టికెట్‌ను మరోసారి శ్రీధర్ రెడ్డికే కట్టబెట్టినట్లు ప్రకటించారు. దీంతో గతంలో ఎమ్మెల్యే ఆఫీసులో పనిచేసిన నియోజకవర్గ నేత సజ్జల మహేశ్వర్ రెడ్డి వినూత్నంగా అరగుండు, అర మీసం గీయించుకుని నిరసన తెలిపారు.
రానున్న ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి కచ్ఛితంగా ఓటమి పాలవుతారని జోస్యం చెప్పారు. ఇదే విషయాన్ని మహేశ్వర్ రెడ్డి గతంలో కూడా తెలిపారు. తాజాగా శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తున్న అసమ్మతి నేతలంతా సమావేశమయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వీరి సమావేశం చర్చనీయాంశంగా మారింది. దేశమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పుట్టపర్తి వైసీపీలో విభేదాలకు తెరపడటం లేదు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి, వైసీపీ సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో నాలుగేళ్లుగా సమస్యలు తిష్ట వేసి ఉన్నా శ్రీధర్ రెడ్డి పట్టించుకోలేదని, నియోజకవర్గంలోని సమస్యలను అనేక సార్లు ఎమ్మెల్యేకు బదులు తాము పార్టీ అధిష్టానానికి వివరించామని వారు వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి వల్ల నియోజకవర్గంలోని పార్టీ నేతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కూడా అధిష్టానానికి మొరపెట్టుకున్నామని చెప్పారు.
పార్టీని వీడటానికి వెనకాడం
త్వరలో జరిగే ఎన్నికల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డిని తొలగించకుంటే తాము పార్టీ వీడటానికి కూడా వెనకాడమని పార్టీని హెచ్చరించారు. నియోజకవర్గానికి ఏమీ చేయని శ్రీధర్ రెడ్డికే రెండోసారీ అవకాశం కల్పించడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని, తమను సంప్రదించకుండా శ్రీధర్‌కు టికెట్ ఇవ్వడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శ్రీధర్ పోటీ పడితే కచ్ఛితంగా ఓడిపోతారని, పార్టీ భవిష్యత్తు కోసం అభ్యర్థిని సీఎం జగన్ మార్చాలని కోరారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణపై ఉమ్మడి ప్రకటన చేస్తామని వారు వెల్లడించారు.
టికెట్ ఆశించిన సోమశేఖర్
పుట్టపర్తి టికెట్‌ను తనకు కేటాయించాలని నియోజకవర్గం మాజీ సమన్వయకర్త సోమశేఖర్ రెడ్డి కోరారు. కానీ వైసీపీ మాత్రం అందుకు విరుద్ధంగా మరోసారి పుట్టపర్తి ఎన్నికల బరిలో శ్రీధర్ రెడ్డిని నిలబెట్టడానికి సిద్ధమవుతోంది. అనంతపురం జిల్లా పర్యటనకు సీఎం జగన్ వచ్చినప్పుడు ఆయనకు సోమశేఖర్ స్వాగతం పలికారు. ఆ సందర్భంగా పుట్టపర్తి టికెట్‌పై తన ఆశాభావాన్ని జగన్‌కు విన్నవించారు. ‘‘తనకు అవకాశం కల్పిస్తానని గతంలో మాట ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి అవకాశం కల్పించండి. 2019లో కూడా మీరు చెప్పారనే శ్రీధర్ రెడ్డికి మద్దతు పలికాను’’అని సోమశేఖర్ గుర్తు చేశారు.
శ్రీధర్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్ల నియోజకవర్గ పార్టీలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందని, నియోజకవర్గంలో సమస్యలు సృష్టించి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని సోమశేఖర్ రెడ్డి కోరారు. ఇదే అంశంపై తాము పార్టీ అధిష్టానంతో చర్చిస్తామని, సోమశేఖర్‌కు టికెట్ ఇవ్వాలని కోరతామని ఆయన వర్గం వారు తెలిపారు.
వైసీపీకి తలనొప్పిగా మారిన పుట్టపర్తి టికెట్!
పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ విషయంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్టానం తన నిర్ణయం మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం పార్టీ అధిష్టానానికి పెద్ద తలపోటుగా మారిందని, ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారని వారు చెబుతున్నారు. శ్రీదర్ రెడ్డికే టికెట్ ఇస్తే నియోజకవర్గంలో పార్టీకి సగంమేరా మద్దతు లభిస్తుందని, టికెట్‌ను శ్రీధర్‌కు కాకుండా ఆశావహ అభ్యర్థి సోమశేఖర్‌కు అందిస్తే మరో తలనొప్పి వస్తుందని యోచిస్తున్న పార్టీ పెద్దలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇద్దరినీ కాదని మూడో వ్యక్తికి ఇస్తే శ్రీధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఇద్దరి వర్గాల మద్దతు పార్టీకి కరువు అవుతుందని కూడా వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో పుట్టపర్తి టికెట్ అంశం వైసీపీకి చిక్కుముడిలా మారిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ చిక్కుముడిని వైసీపీ ఎలా విప్పుతుందో చూడాలి.
Read More
Next Story