తుది జాబితాతో వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి
x
Source: Twitter

తుది జాబితాతో వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి

అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత వైసీపీలో అసమ్మతి రేగింది. టికెట్ల విషయంలో అధిష్టాన్యం నిర్ణయాన్ని పలు నేతలు వ్యతిరేకిస్తున్నారు.



వైసీపీలో అసమ్మతి సెగలు చెలరేగాయి. అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ తన 175 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో పలు చోట్ల వైసీపీలో అసమ్మతి స్వరాలు వినిపించాయి. టికెట్ల విషయంలో పలువురు నేతలు అలకబూనితే కొందరు మాత్రం తమకు అన్యాయం జరిగిందని నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్వతీపురం టికెట్‌ను మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకు కేటాయించడాన్ని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. పార్వతీపురం టికెట్ తమ నేత ప్రసన్నకుమార్‌కే వస్తుందన్న నమ్మకం ఇప్పటీ ఉందని, ఈ విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చిస్తామని వారు చెబుతున్నారు.

అప్పలనాయుడి ఓటమి తథ్యం

నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడికి కేటాయించడాన్ని భోగాపురం మండల వైసీపీ మాజీ అధ్యక్షుడు దారపు లక్ష్మణరావు వ్యతిరేకించారు. పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. సుమారు 10 వేల ఓటు బ్యాంకు ఉన్న తనను పార్టీ అధిష్టానం చులకన చేసిందని, వచ్చే ఎన్నికల్లో అప్పలనాయుడి ఓటమి తథ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘అవినీతికే జగన్ ఓటు’

జగన్ వైఖరి అవినీతికే మద్దతు ఇస్తున్నట్లు ఉందని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ మాజీ నేత సువ్వారి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమదాలవలస టికెట్‌ను సభాపతి తమ్మినేని సీతారాంకే మళ్ళీ ఇవ్వడాన్ని నిరసిస్తున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ కోసం దాదాపు 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాను. ఆమదాలవలస టికెట్ నాకే ఇస్తానని సీఎం జగన్ మాటిచ్చారు. కానీ తీరా టికెట్లు కేటాయించే సమయానికి తన మాట మరిచి దొంగ సర్టిఫికెట్లు, ఇసుక సహా ఇతర రంగాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేనికి కేటాయించారు. దీనిని బట్టి చూస్తుంటే జగన్.. అవినీతికే మద్దతు ఇస్తున్నట్లు ఉంది’’అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. వచ్చే ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

టికెట్లు కేటాయించిన దగ్గర నుంచి పలు ప్రాంతాల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. టికెట్ దక్కని ఆశావహులు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం, అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తమకు పార్టీ అన్యాయం చేసిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిలో కొందరు తమ తలరాత అనుకుని మౌనంగా ఉండిపోతే ఇంకొందరు పార్టీ వీడి ఇతర పార్టీల కండువా కప్పుకోవడానికి చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి వైసీపీ అధిష్టానానికి బుద్ధి చెప్పాలని యోచిస్తున్నారు. మరి వీరి విషయంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.


Read More
Next Story