ఓటు విలువ ఆ జిల్లాల వారికి బాగా తెలుసు. అందుకే వారు ఓటును సద్వినియోగం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు లైన్లో ఉండి ఓట్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు కొన్ని జిల్లాల్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడంలో ముందున్నారు. ఆ జిల్లాల్లో 82 నుంచి 83 శాతం వరకు పోలింగ్ జరిగింది. ఈ జిల్లాల్లోని ఓటరు చైతన్యానికి నాయకులతో పాటు అధికారులు కూడా వారికి అభినందనలు తెలుపుతున్నారు. సోమవారం జరిగిన పోలింగ్ ఆలస్యమై అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. ఇంతకు మునుపెన్నడూ పోలింగ్ చరిత్రలో ఈ విధంగా జరగలేదు. సుమారు 600 ఇవిఎంలు సరిగా పనిచేయలేదని, వాటి స్థానాల్లో కొత్తవి పెట్టామని ఎన్నికల అధికారి స్వయంగా ప్రకటించారు. ఈ కారణంగా ఎన్నికలు కొన్ని చోట్ల తెల్లవారు ఝాము వరకు కూడా జరిగాయి. పోలింగ్ సిబ్బంది ఇవిఎంలు స్ట్రాంగ్ రూములకు చేర్చి అక్కడి అధికారులకు అప్పగించే సరికి కొందరికి మంగళవారం మధ్యాహ్నం అయింది.
అర్ధరాత్రి వరకు ఓటింగ్
రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ నిర్వహించిన జిల్లాల్లో ప్రకాశం, సత్యసాయి, చిత్తూరు, కోనసీమ, ఏలూరు, క్రిష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల వంటి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు ఓట్లు ఉన్న వారంతా ఓటు వేసేందుకు వచ్చారు. ముసలి వాళ్లను కూడా తమ బంధువులు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించారు. ప్రకాశం జిల్లాలో 82.40 శాతం, సత్యసాయి జిల్లాలో 82.77శాతం, చిత్తూరు జిల్లాలో 82.65శాతం, కోనసీమ జిల్లాలో 83.19శాతం, ఏలూరు జిల్లాలో 83.4శాతం, క్రిష్ణా జిల్లాలో 82.20శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12శాతం, నంద్యాల జిల్లాలో 80.92 శాతం ఓట్లు నమోదయ్యాయి.
భారీ ఓటింగ్ ఎవరి గెలుపుకు సంకేతం
ఓటింగ్ భారీగా జరిగింది. ఈ జిల్లాల్లో గెలుపు ఏ పార్టీవైపు ఉంటుందనే విషయంలో చర్చ మొదలైంది. ఎక్కువ ఓటింగ్ జరిగిన జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూల పవనాలు వీచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి వారు కూడా ఎక్కువ ఓట్లు పోలైన చోట తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఈ జిల్లాల్లో వైఎస్సార్సీపీ వారు పెద్దగా మాట్లాడటం లేదు. టిడిపి వారు మాత్రం అన్ని చోట్ల గెలుపు తమదేనని చెప్పటం విశేషం.
ఓటింగ్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం
ఓటింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది. అలాగే ఓటింగ్ యంత్రాలను కూడా సరిగా చెక్ చేసి పంపించని కారణంగా చాలా వరకు మొరాయించాయి. ఈ కారణంగా పోలింగ్ బాగా ఆలస్యమైంది. రూరల్ ఏరియాల్లో పోలింగ్ సిబ్బంది బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సోమవారం ఒక్కరోజు పోలింగ్ డ్యూటీ అని చెప్పిన ఎన్నికల అధికారులు మంగళవారం మధ్యాహ్నం వరకు ఉద్యోగులను డ్యూటీ చేసేలా చేశారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుందని రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 9గంటల వరకు ఓటింగ్ జరగని కేంద్రాలు కూడా ఉన్నాయంటే ఎన్నికల కమిషన్ తీరు బాగోలేదనే విమర్శలు వచ్చాయి.