మైనార్టీల ప్రతీకాత్మక చిత్రం

రానున్న ఎన్నికల్లో మైనార్టీల దారెటనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చగా మారింది. క్రిష్టియన్‌ మైనార్టీలు, ముస్లిమ్‌ మైనార్టీలను బహిరంగంగానే బీజేపీ విమర్శిస్తోంది.


తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఢీల్లీ కేంద్రంగా బీజేపీతో జరిగిన చర్చల్లో మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో ఏమేరకు సక్సెస్‌ అవుతుందనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది.

బీజేపీని ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు తిరస్కరిస్తున్నారు. ఏ ఒక్క ఎన్నికలోనూ వీరిని గెలిపించలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ వారు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పొత్తులు లేకుండా బీజేపీ వారు గెలిచిన దాఖలాలు లేవు. పైగా డిపాజిట్లు కూడా బీజేపీ వారికి దక్కడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ వారు పోటీ చేస్తుంటారు. కమ్యూనిస్టులు కొన్ని చోట్ల పోటీ చేయడం లేదు. కానీ బీజేపీ వారు తప్పకుండా అన్ని నియోజకవర్గాలకు పోటీ చేస్తున్నా జనం వారిని ఆశీర్వదించడం లేదు.
బీజేపీకి ఎటువంటి బలంలేని రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇదో మార్గమని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో నిఖార్సయిన ఓటర్లు ఉన్నారు. పార్టీ అంటే పడిచచ్చేవారు ఉన్నారు. అలాంటప్పుడు పొత్తు ధర్మాన్ని మనం పాటించాల్సిందేనని పార్టీ పెద్దలు చెబితే పార్టీ క్యాడర్‌ వినక తప్పదు.
కొత్తేమీ కాదు..
తెలుగుదేశం పార్టీ 1998లో ఎన్‌డీఏకు మద్దతు తెలిపింది. 13 నెలల తరువాత ఆ ప్రభుత్వం పడిపోయింది. తిరిగి 1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ తరువాత 2004లో ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి అయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చింది. తిరిగి 2014లో ఎన్‌డీఏ కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చే సింది. తిరిగి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆ తరువాత 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా ఎన్నికల్లో పోటీ చేయనుంది. జనసేన, బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీకి కలిపి 30 ఎమ్మెల్యే స్థానాలు, 8 పార్లమెంట్‌ స్థానాలు పొత్తులో ఇవ్వనుంది. అంటే ఆ స్థానాల్లో జనసేన, బీజేపీ వారు పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ వారు ఆ పార్టీల వారికి ఓట్లు వేస్తారు. మిగిలిన అన్ని స్థానాల్లో జనసేన, బీజేపీ వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు.
బీజేపీ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో ఉంటుంది?
బీజేపీ వ్యతిరేక ఓటు ఆంద్రప్రదేశ్‌లో ఏస్థాయిలో ఉంటుందనేది ప్రధానమైన చర్చగా మారింది. ముస్లిమ్‌లు, క్రైస్తవులు బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయరని, బీజేపీని బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వేయరనే ప్రచారం తీవ్రంగా ఉంది. ఇవేమీ తెలుగుదేశం అధినేత పట్టించుకోలేదు. 2021 జనాభా లెక్కల ప్రకారం ముస్లిమ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో 9.4శాతం మంది ఉన్నారు. ఈ 12ఏళ్ల కాలంలో కనీసం రెండు శాతం పెరిగి ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఎంత తక్కువ అనుకున్నా 12 శాతం మంది ముస్లిమ్‌లు ఉన్నారని ముస్లిమ్‌ సంఘాల నాయకులు చెబుతున్నారు.
అదే విధంగా క్రైస్తవులు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారని క్రైస్తవ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం క్రైస్తవులు రెండు శాతం మంది మాత్రమే ఉన్నారు. కానీ హిందువులుగా ఉన్న దళిత క్రైస్తవులు కానీ, గిరిజనులను కలుపుకుంటే కనీసం క్రైస్తవుల సంఖ్య 34శాతంగా ఉన్నారని లెక్కలు వేస్తున్నారు. క్రైస్తవులుగా ఉన్న వారు కానీ, ముస్లిమ్‌లు కానీ ఎన్డీఏ కూటమికి ఓటు వేసే అవకాశం లేదని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. వీరు కేవలం ఆలోచనలు లేకుండా వ్యాఖ్యానించే వారేననే వాదన కూడా ఉంది.
పార్టీ క్యాడర్‌ వ్యతిరేకిస్తుందా?
తెలుగుదేశం, జనసేనలో ఉన్న క్యాడర్‌ బీజేపీ కలయికను వ్యతిరేకిస్తుందా? లేదా అనే విషయంలో మేధావి వర్గంలో చర్చ సాగుతోంది. నిజానికి అటు తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ ఉన్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీల్లో ముస్లిమ్‌లు కూడా నాయకులుగా ఉన్నారు. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. అటువంటప్పుడు వారు ఎలా పొత్తును వ్యతిరేకిస్తారనేది కూడా ఆలోచించాల్సి ఉంది. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన పాయింట్‌ ఒక్కటుంది. తటస్థులుగా ఉన్న ముస్లిమ్‌లు, క్రైస్తవులు తప్పకుండా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తారు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా వీరు తిర స్కరించే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప పార్టీని నరనరాల్లో జీర్ణించుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించే అవకాశం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ప్రత్యేంగా పార్టీ క్యాడర్‌కు బీజేపీ కలవడం వల్ల వచ్చే లాభాల గురించి వివరిస్తారు. బీజేపీకి కనీసం మూడు శాతం ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు వారి పార్టీ పోటీలో ఉంటే వారే వేసుకుంటారు. ఇప్పుడు పొత్తులో ఉన్నందున ఆపార్టీ ఓట్లు తప్పకుండా టీడీపీ జనసేనకు పడతాయని భావిస్తున్నారు. కేవలం బీజేపీ ఓట్లతోనే అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని బాబు, పవన్‌లు వ్యక్తం చేస్తున్నారు.
పౌరసత్వ సమస్య
ఉత్తర భారత దేశంలో క్రైస్తవులపై ఇటీవల దాడులు పెరిగాయి. బీజేపీ వారు బహిరంగంగా తాము హిందు మతాన్నే సమర్థిస్థామని, హిందూ మతం కాని వారిని ఈ దేశంలో ఉంచేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ముస్లిమ్‌లను కూడా ఈ దేశం నుంచి బయటకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు బీజే పీ వారు చేశారనే విమర్శలు ఉన్నాయి. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రై స్తవులు ఇలా ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వచ్చామని నిరూపించుకోగలిగితే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని బీజేపీ ప్రభుత్వం అంటోంది. ఈ చట్టం మైనారిటీ సమూహాలకు పౌరసత్వం ఇవ్వజూపటం లేదు కనుక ఇది వివక్షాపూరితంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ మూడు దేశాల్లో మైనారిటీలు తరిగిపోతున్నారని, మత విశ్వాసం ప్రాతిపదికన వారు పీడనను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే చాలా మంది మైనార్టీలు తాము భారతీయులమే అని నిరూపించుకోవడం ఎలా సాధ్యమనే వాదనను తెరపైకి తెచ్చారు. దేశంలో నివశిస్తున్నామంటే తాము భారతీయులం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఉత్తర భారతంలో క్రైస్తవులపై దాడుల ప్రభావం
ఉత్తర భారత దేశంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయి. ఈ ప్రభావం ఏపీలో తప్పకుండా ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేవం పార్టీని తప్పకుండా క్రైస్తవుల్లో కొందరు తిరస్కరిస్తారు. అందరూ అనుకుంటున్నట్లు రాష్ట్రంలో క్రైస్తవులు రెండు శాతం కాదు. కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీల్లోని 53 కులాల వారు, ఎస్టీలు, బ్రాహ్మణులు, రాజులు చాలా మంది క్రైస్తవుల్లో ఉన్నారు. అనదికారిక లెక్కలు తీసుకంటే సుమారు 34 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. వీరు అందరూ కాకపోయినా సగం మంది టీడీపీని తిరస్కరిస్తారు.
– సిరిపురపు పిలిప్స్‌ గ్రీటన్, విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మాజీ డిప్యూటీ మేయర్‌.
తటస్థులదే తుది నిర్ణయం
ముస్లిమ్‌లు ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. బీజేపీ వారు వారి అజెండాను క్లియర్‌గా ప్రకటించారు. రాజ్యాధికారం ద్వారానే ఏదైనా సాధించొచ్చు. బీజేపీని వ్యతిరేకించడం ద్వారా సాధించేది ఏమీ లేదు. చట్ట సభలో తమ సభ్యులను మైనార్టీ వర్గాల వారు పెంచుకోగలిగితే అనుకున్నది సాధిస్తారు. లేకుంటే పార్టీ చెప్పినట్లు విని పనిచేయాల్సిందే. ముస్లిమ్‌లంతా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తారనుకోవడం సరైంది కాదు.
– మహమ్మద్‌ కలీమ్, ముస్లిమ్‌ యునైటెడ్‌ ఫ్రంట్, ముస్లిమ్‌ జేఏసీ, ఏపీ.
Next Story