ఇంటర్‌ తర్వాత వివాహం చేసుకున్న వంగ గీత డిగ్రీల మీద డిగ్రీలు, పీజీలు మీద పీజీలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం పదో తరగతే.


సాధారణంగా డిగ్రీ అయిన తర్వాత ఒక సబ్జెక్టులోను, లేదా మరో సబ్జెక్టులోను పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)లు చేస్తారు. అప్పటికే వారి పని అయిపోతుంది. కానీ వంగ గీత మాత్రం అందుకు భిన్నం. ఒక్క డిగ్రీతోను, ఒక్క పీజీతోను ఆగి పోలేదు. ఏకంగా రెండు డిగ్రీలు, నాలుగు పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సులులు పూర్తి చేశారు. ఇక సంవత్సరం, ఆరు నెలలు డిప్లోమో కోర్సులైతే లెక్కే లేదు. తాజాగా బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చతువుతున్న వంగ గీత భవిష్యత్‌లో పిహెచ్‌డి చేసే పట్టుదలతో ఉన్నారు.

గీత చదివిన డిగ్రీలు, పీజీలు
ఏఎస్‌డి ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ కాకినాడ నుంచి డిగ్రీ చదివారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్, ఎంఏ సోషియాలజీ చేశారు. తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ సైకాలజీ చేశారు. జిఎస్‌కేఎం లా కళాశాల రాజమండ్రి నుంచి లా చేశారు. నాగపూర్‌ యూనివర్శిటీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ లా చేశారు. ప్రస్తుతం ఎంబిఏ చేస్తున్నారు. ఫైనల్‌ సెమిస్టిర్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. అది పూర్తి అయితే ఆమె ఖాతాలో మరో పీజీ వచ్చి చేరుతుంది. ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ రైట్స్‌ డాక్టరేట్‌(పిహెచ్‌డి) చేసేందుకు సన్నద్దం అయ్యారు. హిందీ భాషకు సంబంధించి కూడా కొన్ని కోర్సులు చేశారు. ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు కోర్సులు కంప్లీట్‌ చేశారు. హిందీలో మిగిలిన కోర్సులు కూడా పూర్తి చేసేందుకు పట్టుదలతో ఉన్నారు. ఇవి కాకుండా డిప్లోమో కోర్సులు కూడా పూర్తి చేశారు. జర్నలిజమ్, ఎన్విరాన్‌మెంట్, మెడిసిన్, యోగా వంటి రంగాలకు సంబంధించిన డిప్లోమా కోర్సులు కూడా పూర్తి చేశారు. వీటితో పాటుగా ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, లోకల్‌ బాడీస్‌ వంటి విభాగాలకు సంబంధించి డిప్లోమో కోర్సులు కూడా పూర్తి చేశారు. దేశంలోనే పేరు గాంచిన ప్రముఖ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఆర్‌డి) నుంచి పూర్తి చేయడం విశేషం. ఒక ప్రజా ప్రతినిధి(జిల్లా పరిషత్‌ చైర్‌పర్మన్,ఎంపీ)గా ఉండి ఎక్కువ సంఖ్యలో ఏడాది, ఆరు నెలల కాల వ్యవధి డిప్లోమో కోర్సులు పూర్తి చేయడం విశేషం. ఇంటర్‌ పూర్తి అయిన వెంటనే వివాహం చేసుకున్న వంగ గీత, పెళ్లి అయిన తర్వాత ఇన్ని కోర్సులు పూర్తి చేయడం విశేషం.
1983లో రాజకీయాల్లోకి ఎంట్రీ
వంగ గీత 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1985 నుంచి 1987 వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తర్వాత ప్రత్యక్ష పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1995లో కొత్తపేట జడ్పీటీసీ గెలుపొందారు. 1995 నుంచి 2000 వరకు తూర్పు గోదావరి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. తర్వాత రాజ్యసభ ఎంపీగా 2000 నుంచి 2006 వరకు ఉన్నారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోకి దిగారు. మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత పార్టీ మారారు. వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తాజా అదే పార్టీ నుంచి 2024 ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
పవన్‌ కల్యాణ్‌ పదో తరగతి
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్, వంగ గీత చదువులు కూడా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఉన్న వంగ గీత రెండు డిగ్రీలు, నాలుగు పీజీలు చేయగా, ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి బరిలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ పదో తరగతి మాత్రమే చదివారు. 1984లో నెల్లూరు సెయింట్‌ జోసెఫ్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ నుంచి టెన్త్‌ చదివినట్లు ఎన్నికల అఫిడవిట్లో పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.
Next Story