వీరయ్య చౌదరి హత్యకు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
x

వీరయ్య చౌదరి హత్యకు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

ఇది చాలా ఖరీదైన హత్యగా తేలింది. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 53 కత్తి పోట్లకు రూ.1కోటీ 6 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది.


ప్రకాశం జిల్లా టీడీపీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇది చాలా ఖరీదైన హత్యగా తేలింది. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 53 కత్తి పోట్లకు రూ.1కోటీ 6 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇతర ఖర్చులు కింద ఎంత వ్యయం చేశారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికల నేపథ్యంలో వేగంగా కదిలిన పోలీసులు ఈ హత్య కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అసలు సూత్రధారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరయ్య హత్య కోసం మూడునె లల కిందటే కుట్ర మొదలైంది. రెండు వారాల ముందు రెక్కీ నిర్వహించారు. చివరికి హత్య చేశారు. ఈ హత్య వెనుక గుట్టు విప్పేందుకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షల ఒప్పందం!
పోలీసుల దర్యాప్తులో బయటికొచ్చిన ఓ కీలక అంశం — ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్టు నిందితులు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇది సాదా సీదా హత్య కాదు. కసి, ప్రతీకారం, రాజకీయ కుట్రతో కూడిన చీకటి ఒప్పందం. ఒంగోలు శివారులోని ఓ లాడ్జిలో రెండు వారాల పాటు మకాం వేసిన నిందితులు, ప్రతీ కదలికను గమనించి, చివరకు వీరయ్య చౌదరిని పూనకం వచ్చినట్లుగా పొడిచి చంపారు.
హత్య పథకం వెనుక రాజకీయ మాఫియా?
వీరయ్య చౌదరికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలన్నీ ఏకతాటిపైకి తెచ్చి ఈ హత్య చేయించారు. హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తి పాత్రపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. టీడీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసిన ఆ వ్యక్తి ఎవరనే దానిపై శోధన జరుగుతోంది. రేషన్ మాఫియా డాన్‌తో చేతులు కలిపిందెవరు? అనే దానిపై పోలీసుల పరిశీలన సాగుతోంది. ఇప్పటికే ఓ మండలస్థాయి నాయకుడు, ఓ ప్రజాప్రతినిధి భర్తను అదుపులోకి తీసుకొని విచారణ జరిపినట్టు సమాచారం. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి వైసీపీకి చెందిన కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లందరూ పేకాట బ్యాచ్ అని తెలుస్తోంది. విదేశీ బంగారం వ్యాపారంలోనూ ప్రధాన నిందితునికి ప్రమేయం ఉన్నట్టు సమాచారం.
మృత్యుపథకానికి ముందస్తు మాస్టర్‌ప్లాన్
హత్యకు ముందు నిందితులు వీరయ్య చౌదరి కార్యాలయం వద్ద వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఆయన కదలికలను గమనించారు. చినగంజాం ప్రాంతానికి చెందిన మండలస్థాయి నాయకుడి ద్వారా మొత్తం ప్రణాళిక రూపొందించినట్లు ఆధారాలు లభించాయి.
పరారీలో సూత్రధారి?
ప్రధాన సూత్రధారి ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో తలదాచుకుని ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడిని పట్టుకోగలిగితే, హత్య కేసు మిస్టరీ వీడినట్టే. ఇప్పటికే కొంతమంది కీలక పాత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు, ప్రధాన కుట్రదారి, హత్యకు పాల్పడిన యువకుడి అరెస్టు కోసం నాన్‌స్టాప్ వేట సాగిస్తున్నారు.
ఈ కేసు మామూలు రాజకీయ రగడ కాదనడానికి అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ-వైసీపీ మధ్య కొద్ది నెలలుగా పెరిగిన ఉద్రిక్తతలు, బలబలాల పునర్‌వ్యవస్థీకరణ, రేషన్ మాఫియా ఆర్ధిక శక్తి మిళితమై వీరయ్య చౌదరి ప్రాణం తీసినట్లుగా అనిపిస్తోంది.
Read More
Next Story