ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వ్యవస్థలో మిగిలిన వాటి పరిస్థితి ఏమైనా నాకు సంబంధం లేదు. డబ్బు సేకరించడం, డీబీటీ ద్వారా అందించడం, ఇదొక్కటే కాదుకదా పాలన అంటే...
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రభుత్వ విభాగాలు నిర్వీర్యమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం. పరిపాలన సజావుగా సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభాగాల ద్వారా అన్ని వర్గాల వారికి ఎంతో కొంత సాయం అందాలి. అలాగే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే పథకాలు అమలు చేయాలి. అందుకే ఏ వర్గానికి ఏ విభాగం ఉండాలో ఆలోచించి ప్రభుత్వ విభాగాలు రూపొందించారు. ఆ ప్రభుత్వ విభాగాలు పనిచేసేందుకు అవకాశం లేకుండా చేశారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వ్యవస్థలు ఎందుకు మూలన పడ్డాయి
ప్రతి వర్గానికీ జగన్ ఉచితంగా ఆర్థిక సాయం అందించాలనుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం కార్పొరేషన్‌లను ఎంచుకున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత ఆర్థిక సాయాన్ని ఫైనాన్స్ శాఖ నుంచి నేరుగా ఆ వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ అకౌంట్‌కు జమ చే శారు. ఆ శాఖ ఉన్నతాధికారి ఆ డబ్బును బ్యాంకులకు రిలీజ్ చేస్తారు. ఇంతటితో ప్రభుత్వ అధికారుల పని అయిపోయింది. తాను ఇవ్వాలనుకున్న ఆర్థిక సాయం బ్యాంకుల నుంచి నేరుగా లబ్ధిదారునికి అందింది కాబట్టి నాపని నేను చేశాను అనుకున్నారు జగన్. అందుకే వ్యవస్థలు మూలన పడ్డాయి.
లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్లదే పెత్తనం కావడం
ఉచితంగా ఆర్థిక సాయం అందుకునే లబ్ధిదారుల ఎంపికను ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా నేరుగా వాలంటీర్లు ఎంపిక చేయడం, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం దరఖాస్తు దారుల నుంచి అర్జీలు తీసుకుని, వారే ఎంపిక చేసి జాబితాను మాత్రమే మండల అభివృద్ధి అధికారికి పంపిస్తున్నారు. ఆయన ఆ జాబితాను నేరుగా కలెక్టర్‌కు పంపిస్తున్నారు. ఇందువల్ల ప్రజా ప్రతినిధులు, అధికారుల పాత్ర నామమాత్రమైంది. దీంతో ఆ వర్గాల్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ప్రధానమైన శాఖలు కూడా స్తబ్దుగా ఉండాల్సి వచ్చింది!
ఉదాహరణకు ఎస్‌సి, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వ శాఖలకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇస్తుంది. ఈ గ్రాంట్స్‌ను ఏ పథకాల కోసం ఇస్తుందో ఆ పథకాలకు ఖర్చు చేసి సంవత్సరం ఆఖరులో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూటీ) ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా డీబీటీ పథకాలకు కేటాయించారు. దీంతో అధికారులు కేంద్రం ఇచ్చిన నిధులకు యూటీలు సమర్పించాల్సి వచ్చినప్పుడు ఏ పథకానికి ఖర్చు చేశారో తెలపాలి. అలా యూటీలు సకాలంలో ఇవ్వకపోవడంతో మరుసటి సంవత్సరం ఇచ్చే నిధులు కేంద్రం ఆపేసింది.
ఆర్థిక వృద్ధి పథకాలు లేవు
నాటి ప్రభుత్వం ఉచితంగా డబ్బులు ఇచ్చింది కాబట్టి ఆ డబ్బుతో లబ్ధిదారులు ఏదో ఒక పనిచేసి డబ్బును వృద్ధి చేస్తారనని భావించింది. ప్రభుత్వమే ఆ డబ్బును ఈ విధంగా ఖర్చు చేస్తే బాగుంటుందనే నిబంధనలు విధిస్తే బాగుండేది. అలాంటివేమీ లేవు. అందువల్ల లబ్ధిదారులు అప్పటి అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. దీంతో ఇన్‌కం జనరేషన్ అనేది లేకుండా పోయింది.
పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ష్కాలర్‌షిప్స్ వంటి పథకాలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా పిల్లల తల్లి బ్యాంకౌ అకౌంట్‌కు ఇస్తున్నామని, వారు కాలేజీల్లో, హాస్టళ్లలో ఫీజులు, మెస్ ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో చాలా మంది విద్యార్థుల తల్లులు తమ అకౌంట్స్‌లోకి వచ్చిన డబ్బును అత్యావసాల కోసం వాడుకున్నారు. తిరిగి కాలేజీలు, హాస్టళ్లలో చెల్లించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో వారు మేము మా అకౌంట్స్‌కు డబ్బులు ఇవ్వాలన్నామా? నేరుగా ప్రభుత్వమే కాలేజీలకు ఇచ్చి ఉంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని బహిరంగంగానే పలువురు తల్లిదండ్రులు అనడం వివేషం.
సబ్సిడీ పథకాలకు చెల్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పేదవారిని ఎంపిక చేసి సబ్సిడీపై కొన్ని పథకాల ద్వారా నిధులు ఇచ్చే వారు జగన్ ఆ పథకాలకు స్వస్థి పలికారు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సిన నిధులు ఎవరికి ఇవ్వాలో తెలియక ఆగిపోయాయి. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ లాంటి సంస్థల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. భారీ స్థాయిలో చేపట్టే సబ్సిడీ పథకాలు అంటే ఏమిటిలో ముందు తరం వారికి తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఐఏఎస్‌లకు పనిలేకుండా పోయింది
ఎప్పుడైతే ప్రభుత్వ విభాగాలు నిర్వీర్యమయ్యాయో ఐఏఎస్ అధికారులకు పనిలేకుండా పోయింది. వారి మెదళ్లకు ఆలోచన చేసే అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. కొత్త పథకాల రూపకల్పన లేదు. కేవలం ఉచితంగా డబ్బులు ఇచ్చే పథకాలకు పేర్లు తయారు చేయడం వరకే పరిమితమయ్యారు. లబ్ధిదారుల జాబితాలు డైరెక్టరేట్స్, కమిషనరేట్స్‌కు రాగానే ఒక సంతకం చేసి ఆ జాబితాను సీఎఫ్‌ఎంఎస్‌కు పంపిస్తే వారి పని అయిపోతుంది. ఇలా ప్రతి రోజూ ఉద్యోగులు, అధికారులు కార్యాలయాలకు రావడం, సంతకం పెట్టి కాసేపు కాలక్షేమం చేసి ఇంటికి వెళ్లటం. ఇది రోటీన్‌గా మారింది. ఈ విషయమై కొందరు కమిషనర్లను ఫెడరల్ ప్రశ్నిస్తే డీబీటీ లబ్దిదారుల జాబితాలపై సంతకాలు చేస్తే మా పని అయిపోతుంది. నెలకు రెండు లేదా మూడు పథకాలు అలాంటివి ఉంటాయి. ప్రభుత్వం చెప్పన పనిచేయడం వరకే మేము పరిమితం అంటూ నవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఒకదానికొకటి లింక్‌గా వ్యవస్థలు
ప్రస్తుత జీవన విధానంలో వర్గాలుగా విడిపోయి పనులు చేయడం జరుగుతోంది. ఆ విధంగానే ప్రభుత్వ శాఖలు కూడా ఏర్పడ్డాయి. ప్రభుత్వం రూపొందించిన పథకానికి ఒక చోట అవరోధం ఏర్పడిందంటే ఆ పథకంపై ప్రత్యక్ష్యంగానే కాకుండా పరోక్షంగా ఆధారపడిన వారు ఎంతో మంది ఉంటారు. వారందరికీ పనిలేకుండా పోతుంది. ఉదాహరణకు ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైనప్పుడల్లా మందులు కొనుగోలు చేయాలి. డబ్బులు లేవనే సాకుతో మందుల కొనుగోలు ఆగిపోతే ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులకు, అధికారులకు పని ఉండదు. వ్యాధుల బారిన పడిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. మందుల కంపెనీల పరిస్థితి కూడా దిక్కుతోచని స్థితికి చేరుతుంది. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించడంలో ముందడుగు వేస్తారు. ప్రభుత్వ మందుల కొనుగోలు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గత ప్రభుత్వం ఆరు నెలలకు సంబంధిం మందుల కంపెనీల వారికి బకాయిలు పెట్టడంతో అవసరమైన మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
కార్పొరేషన్స్ తీసుకుందాం. బీసీలకు సంబంధించి గత ప్రభుత్వం ప్రత్యేకంగా 56 ఏర్పాటు చేసింది. ఇక వైశ్య, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, ముస్లిమ్ వంటి కులాలకు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్‌లలో మెయింటెనెన్స్‌కు కూడా డబ్బలు లేకుండా పోయాయి. కార్పొరేషన్ అంటే పేదలకు రుణాలు ఇవ్వడం, తిరిగి తీసుకోవడం, ఆర్థికంగా ఆయా వర్గాల వారిని బలోపేతం చేయడం చేపట్టాలి. అలా చేయడానికి నిధులు లేకుండా చేస్తే కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఉపయోగం ఏమిటి? కార్పొరేషన్‌ల ద్వారా సాయం అందుతుందని ఆలోచించే వారు ఏమవ్వాలి. నామినేటెడ్ పదవుల్లో అక్కడ ఉన్న వారు ఆయా కులాల వారికి ఏమని సమాధానం చెప్పాలి. ఇలా అన్నీ సమస్యలే.
Next Story