ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి క్రికెట్‌ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు? ఏమిటా కథ..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జిల్లా పేరు చెప్పగానే వర్గ పోరాటాలు, ఫ్యాక్షన్‌ గొడవలు, నీలం సంజీవరెడ్డి, లేపాక్షి నంది, ధర్మవరం చీరలు గుర్తుకొస్తాయి. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉందని ఎవ్వరూ పెద్దగా గుర్తించలేదు. ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం తరువాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. పోలీస్, మిలిటరీ వంటి శాఖల్లో చేరేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య గణనీయంగా ఉండేది. హైదరాబాద్‌ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన స్టేడియంగా అనంతపురం స్టేడియం రికార్డును సొంతం చేసుకుంది. బెంగళూరులో కూడా స్టేడియం లేని రోజుల్లో అనంతపురం కేంద్రంగా స్టేడియం నిర్మాణం జరగటం ఆసక్తిగా మారింది. ఇంతకు ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు?

ప్రైవేట్‌ వ్యక్తులతో నిర్మాణం
క్రీడా మైదానాల్లో ప్రధానమైనదిగా ఉన్న నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు నిర్మించారంటే నమ్మ శక్యం కాదు. కానీ ఇది నిజం. వివిధ రాష్ట్ర స్థాయి క్రీడలకు వేదికగా నిలిచింది. ప్రస్తుతం వాకర్స్‌కు ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉదయం ఐదు గంటలైతే ఆరోగ్యం కోసం పరుగులు పెట్టే నగర ప్రజల్లో అధికంగా ఈ స్టేడియంలోనే ఉంటారు. స్వాతత్య్రం వచ్చిన తొలినాళ్లలో క్రికెట్‌ క్రీడ అంటే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైంది. 1950 తరువాత దేశమంతా మోజు పెరిగినా ఆట ఆడేందుకు అనువైన మైదానాలు ఉండేవి కావు. క్రీడా కారులకు నిరుత్సాహమే మిగిలిలేది. క్రికెట్‌ కామెంటరీ వస్తుందంటే అప్పట్లో రేడియోలకు చాలా మంది క్రీడాసక్తి ఉన్న వారు అతుక్కుపోయే వారు.
అనంతపురంలో క్రికెట్‌కు పునాదులు
రాయలసీమ జిల్లాల్లో మొదటిసారిగా క్రికెట్‌ క్రీడకు అనంతపురంలో పునాదులు పడ్డాయి. 1950 తరువాత ఇక్కడ క్రికెట్‌ ఆడేందుకు క్రీడాభిమాని ఉత్తర్‌కర్‌ జ్ఞానేశ్వరరావు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. క్రికెట్‌ ఆడాలంటే మంచి స్టేడియం అవసరమని భావించి స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఊహించని విధంగా క్రీడాభిమాని అయిన ఐపిఎస్‌ అధికారి జెఎస్‌ సల్దానా జిల్లాకు ఎస్‌పిగా వచ్చారు. ఉత్తర్‌కర్‌ అన్వేషణకు కాస్త ఊరట లభించింది. ఆ సమయంలో ఉత్తర్‌కర్‌ జిల్లా ఎస్పీని కలిసి క్రికెట్‌ అసోసియేషన్‌ గురించి వివరించారు. క్రికెట్‌ క్రీడకు క్రీడా ప్రాంగణం లేదని, స్థలం ఎక్కడ ఉందనేది పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. మాట సందర్భంలో పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చాలా స్థలం ఉందని, ఈ స్థలంలో కొంత స్టేడియం కోసం కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన సూచనను సానుకూలంగా తీసుకున్న ఎస్పీ సల్దానా పిటీసి స్థలంలో కొంత స్టేడియం నిర్మాణానికి కేటాయించారు.
ఆరు నెలల్లో పూర్తి...
1961లో పనులు మొదలు పెట్టారు. అప్పట్లో చెన్నైకి చెందిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం తాత చిదంబరం సాయం చేశారు. ఆయన సాయంతో పునాదులు వేశారు. రిజర్వు పోలీసుల శ్రమదానంతో కేవలం ఆరు నెలల్లోనే క్రీడా మైదానం తయారైంది. హిందూపురానికి చెందిన ప్రైవేట్‌ బస్‌ ఓనర్‌ శ్రీకంఠయ్య, ఆర్పీజీటీ బస్సు యజమాని బాలకృష్ణన్, ఉరవకొండకు చెందిన బస్‌ ఓనర్‌ దండా వెంకయ్య మరికొందరు కలిసి తమ వంతు ఆర్థిక సాయం అందించారు. అప్పట్లోనే మూడు లక్షలకు పైగా విరాళాలు వచ్చాయి. ఎస్పీ సల్దానా, జ్ఞానేశ్వరరావులకు స్టేడియం బాధ్యతలు అప్పగించారు. వారు మాట్లాడుకుని అప్పటి పిటీసీ ప్రిన్సిపాల్‌ ఆనందరామ్‌కు అప్పగించారు. స్టేడియానికి ఎవరిపేరు పెడితే బాగుంటుదనే ఆలోచన అందరిలోనూ వచ్చింది. జిల్లాలో కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింప జేసిన నీలం సంజీవరెడ్డి పేరును అందరూ ఏకగ్రీవంగా ఆమోందించారు. ఆ పేరుతోనే క్రీడా మైదానాన్ని ప్రారంభించారు.
జాతీయ స్థాయి ఆటలకు వేదిక
ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాలు, కర్నాటక రాజధాని బెంగళూరులో సహా ఎక్కడా క్రీడా మైదానాలు ఈ స్థాయిలో లేవు. దీంతో జాతీయ క్రీడలకు వేదికైంది. టర్ఫ్‌ వికెట్‌ కావడంతో జాతీయ స్థాయి ఆటలకు ఉపయోగపడింది. 1962, 1964, 1971వరకు ఈ స్టేడియంలో పలు రంజీమ్యాచ్‌లు జరిగాయి. అప్పటి క్రికెట్‌ బారత్‌ జట్టు పెప్టెన్‌ అజిత్‌ వాడేకర్, పాలీ ఉమ్రీగర్, రమాకాంత్‌ దేశాయ్, చందూ బోర్డె సర్థేశాయ్‌ దిలీప్‌ తదితరులు ఈ మైదానంలో ఆటలు ఆడి క్రీడా కారులను ఉర్రూతలూగించారు. ప్రధానంగా చైనా యుద్ధ సమయంలో స్టార్‌ క్రికెటర్లను మైదానానికి రప్పించి బెనిఫిట్‌ మ్యాచ్‌లు ఆడించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌ (ఎన్‌డీఎఫ్‌)కు విరాళంగా అందించారు. దీంతో జిల్లా ఖ్యాతి జాతీయ స్థాయికి వెళ్లింది. క్రీడా మైదానంలో వెల్‌కం ఆర్చ్‌తో పాటు సల్దానా విగ్రహం ఏర్పాటు చేయాలని నాటి క్రికెటర్లు కోరుతున్నారు.
సల్దానా చేసిన కృషి ఎంతో గొప్పది
ఆరోజుల్లో చాలా కష్టంతో కూడుకున్న పనిని అప్పటి ఎస్పీ సల్దానా ఎంతో సులువుగా చేసి శభాష్‌ అనిపించుకున్నారు. నీలం సంజీవరెడ్డి స్టేడియం నిర్మాణంలో ఆయన పాత్ర మాటల్లో చెప్పేందుకు వీలు కాదు. ఆయనతో పాటు తిరిగిన వారిలో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. తానే స్వయంగా పోటీల్లో పాల్గొని యువతను ప్రోత్సహించే వారు. మూడు రాష్ట్రంలో తిరిగి ఆయనే నిధులు సమకూర్చారు. అర్ధరాత్రి తన వాహనంలో సింగనమలకు వెళ్లి చీకట్లో పొలాల బయట పడిన గడ్డిని సేకరించి తీసుకొచ్చి స్టేడియంలో టర్ఫ్‌వేశారు. ఆయనతో కలిసి రంజీ మ్యాచ్‌ ఆడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
– ఉత్తర్‌కర్‌ జ్ఞానేశ్వరరావు, మాజీ క్రికెటర్, అనంతపురం.
Next Story