జీవితంలో ఎన్నో విషయాలు మనకు సంబందం కలిగి ఉంటాయి. అయితే అన్నింటినీ మనం అన్వయించుకోలేము. కానీ కొన్నింటిని అనుకుని సాధించొచ్చు.


విజయవాడ నగరంలో ప్రతి సంవత్సరం భారీ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అందులో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. కవులు, కళాకారులు, రచయితలకు ఈ సందర్భంగా సన్మానాలు, అభినందనలు తెలియజేసేందుకు సభలు కూడా ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలోనే సాయంత్రం వేళ నిర్వహిస్తారు. ప్రతి ఏటా పిడబ్లు్యడీ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. కానీ ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించే అవకాశం నిర్వాహకులకు లేదు. ఎందుకంటే అక్కడ మైదానం అంబేద్కర్‌ మైదానంగా మారిపోయింది. రోజూ కొన్ని వేల మంది ఇక్కడికి సందర్శకులుగా వస్తున్నారు. పుస్తక ప్రదర్శనకు అనువైన సమావేశపు హాలు కూడా ఇక్కడ ఉంది. ఇంకా నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. అలా అయితే ఈ స్మృతివనంలోనే పుస్తక ప్రదర్శన కూడా ప్రతి ఏటా నిర్వహించుకోవచ్చు.

రెండేళ్ల క్రితం విజయవాడలోని పిడబ్లు్యడీ గ్రౌండ్‌లో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకు ఒక రచయిత వచ్చారు. ఆయన ఓ పుస్తక ప్రదర్శన షాపు వద్ద నిలబడి నాలాంటి వారితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ మహిళ వచ్చి ఆ బుక్‌స్టాల్‌లో ఓ పుస్తకం కొనుగోలు చేసింది. మావద్ద మాట్లాడే ఆ రచయిత వద్దకు వచ్చింది. సర్‌ మీరు రాసిన పుస్తకం అంటూ ఎంతో అభిమానంతో కొనుగోలు చేసిన ఆ పుస్తకాన్ని చూపించింది. పుస్తకం అందుకున్న ఆ రచయిత తన సంతకాన్ని పుస్తకంపై చేసి అందించాడు. అప్పుడు ఆమె ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోరు కదా... అంటూ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఏమిటంటే.. మీ పుస్తకంలో ఏముందనే విషయాన్ని నాకు ఒక్క నిమిషంలో చెప్పగలరా..? అన్నది. కాసేపు ఆలోచించిన ఆ రచయిత ఏదేదో చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె ఆయన మాటలకు అడ్డుపడుతూ మీకు పుస్తకాలు రాయడం మాత్రమే తెలుసు. అమ్మడం తెలియదు అని నవ్వుతూ వెళ్లిపోయింది. నాకు బాగా రాయగలిగే శక్తి, యుక్తి ఉంది. ఆమె అలా అనిందేంటబ్బా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు రచయిత...
అందరి జీవితాల్లోనూ అన్ని విషయాలకు ఇది వర్తిస్తుంది. ఎలాగంటారా... ఒక విద్యార్థి చక్కగా చదివితే మాత్రమే సరిపోదు. పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి టిప్స్‌ ఉపయోగించాలి. మార్కులు ఎక్కువ రావాలంటే చేయాల్సిందేమిటి? అనే ఆలోచన ముందుగానే ఉండాలి. అందుకు ఒక పథక రచన అవసరం. మంచి మార్కులతో పాసయ్యాను. ఉద్యోగం కావాలని ఎన్ని ఆఫీసులకు తిరిగినా ఉపయోగం ఉండదు. తన ప్రతిభా పాఠవాలను వ్యక్తీకరించడంలో తగిన విధంగా శక్తియుక్తులు వాడితే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి మంచి వస్తువును తయారు చేస్తే సరిపోదు. దాని నాణ్యత గురించి కొనుగోలు దారులకు వివరించడంలో సక్సెస్‌ అయినప్పుడే ఆ వస్తువు అమ్ముడు పోతుంది. ప్రజాధరణ కూడా అప్పుడే లభిస్తుంది. ఉదాహరణకు మీకో విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లలితా జ్యువెలరీస్‌ అధినేత ఏమి చేస్తున్నాడో తెలుసా? అయనే తన ఉత్పత్తుల గురించి వివరించి కొనుగోలు దారులకు చెబుతున్నాడు. అడ్వర్‌టైజ్‌ మెంట్స్‌ను ఆయనే చేస్తున్నాడు. వారు తయారు చేయించిన బంగారు ఆభరణాల గురించి చక్కగా వివరించి సేల్స్‌లో తనకు సాటిలేదని నిరూపించుకుంటున్నాడు. ఇది చాలు మనం చెప్పదలుచుకున్న దానికి. ఈ విధంగా ఒక్కో అంశంపై సమగ్రమైన అవగాహనతో ముందుకు వెళ్లడాన్నే ‘గేమ్‌ప్లాన్‌’ అంటారు.
గేమ్‌ప్లాన్‌ అనేది క్రీడా రంగానికి ఎంతో ముఖ్యమైనది. ఇందుకోసం ఒక పెద్ద బృందమే పనిచేస్తుంది. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుతో ఇండియా జట్టు ఆడుతున్నట్లైతే ఆ జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్ల బలాన్ని, బలహీనతలను సమీక్షించి గెలుపు పథక రచన చేయడమే గేమ్‌ప్లాన్‌గా చెప్పొచ్చు. ఈ ఆటగాళ్లను గ్రౌండ్‌లో ఎక్కడెక్కడ నిలబెట్టాలి. ఎవరికి ఏ పని అప్పగించాలి. ఏ సమయంలో ఎవరు బంతిని కొట్టాలి. ఏ సమయాల్లో ఆట దిశను తిప్పాలి. అనే అంశాలపై ఆ ప్రత్యేక బృందం దృష్టిపెట్టి ఉంటుంది. అప్పుడే విజయం కూడా ఆ జట్టును వరిస్తుంది. ఎటువంటి పథక రచన లేకుండా విజయం అంత సులువు కాదు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని అందుకునేందుకు ఎలా వ్యవహరించాలనేదే గేమ్‌ప్లాన్‌. పథక రచన చేయగానే తన పని ముగిసినట్లు కాదు. గేమ్‌ప్లాన్‌ మనకు విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం క్రీడాకారుల జట్టులో కలగాలి. అప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారు. ఇదేమీ కఠినమైనది కాదు. సులభంగా సాధించొచ్చు... అనే భరోసాను ఈ ప్రత్యేక బృందం అందించినప్పుడు క్రీడాకారులు ఆడుతూ విజయాన్ని అందుకుంటారు. పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ఒక్కో పనికి సంబంధించిన ఫలితాలను సమీక్షించి ఏ క్షణంలో ఏమి చేయాలని నిర్ణయించి అందుకు అవసరమయ్యే వాటన్నింటినీ సేకరించి కార్యరంగంలో అడుగిడితే గేమ్‌ప్లాన్‌ అనేది ప్రతి ఆటకూ అవసరమని తేలిపోతుంది.
అలాగే జీవితానికి కూడా తప్పని సరి. ఎక్కడికి వెళ్లాలనే ఆలోచన లేకుండా ఓ ప్రయాణికుడు ఒక రైలెక్కి కూర్చున్నాడనుకోండి, ఎక్కడికి వెళతాడో తెలియదు. గమ్యం ఏమిటో తెలియదు. జీవితం అలా ఉండకూడదు. జీవితానికో లక్ష్యం ఉండాలి. ఎక్కడ ప్రయాణికుడు దిగాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అప్పుడే ఆ ప్రయాణానికి అర్థం ఉంటుంది. అనుకున్న లక్ష్యం చేరుకోగలుతాడు.
మీలో ఎవరైనా మీ లక్ష్యాలను, కలలను సాకారం చేసుకునందుకు సరైన గేమ్‌ప్లాన్‌ ఉండాలి. పథక రచన లేకుండా కేవలం లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని సాధించేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయినా ఒక్కోసారి సక్సెస్‌ కాలేము. కోర్కెలను అనుసరించి లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని పొందేందుకు సరైన వ్యూహం రూపొందించుకోవాలి. అప్పుడే గేమ్‌ప్లాన్‌ అంటే మనం చేసే పనులకు ఒక అర్థం ఉంటుంది. ఏ విషయాన్నైనా చక్కగా అర్థం చేసుకుని సరైన స్పష్టతతో నిర్ణయించుకోవడం వల్ల సరైన లక్ష్యం వైపు కార్యసాధకునిగా అడుగులు వేయవచ్చు. భవిష్యత్‌ అనే కలల సౌధాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనే విషయం చక్కగా అర్థం చేసుకోవచ్చు.
జీవితంలో ఏమి సాధించు కోవాలనుకుంటున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దానికి తగిన సమాధానం వస్తుంది. మీకు దానిపై ఆసక్తి ఉంది. ఏవిషయాలను మీరు గొప్పగా భావిస్తున్నారో ఆ విషయాలను సమీక్షించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించేందుకు వీలు ఉంటుంది.
ఎప్పుడైనా మీ బలం, బలహీనతల గురించి బేరీజు వేసుకోండి. ఇతరుల కంటే మీరు ఏదో ఒక విషయంలో ప్రతిభా వంతులుగా ఉండి ఉంటారు. ఆ ప్రతిభను చేరుకునేందుకు ఏ విధంగా అడుగులు వేయాలో ఆలోచించండి. బాగా ఆలోచించి ఏమి చేస్తే బాగుంటాయో అన్నీ చేయండి. లక్ష్యానికి సంబంధించిన పయనంలో మీ బలహీనతలు అడ్డంకి గా ఎదురు కావొచ్చు. వాటిని అధిగమించేందుకు తగిన మార్గాలను కనిపెట్టాలి. ఆ దిద్దుబాటు విజయాన్ని అందుకునందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
భవిష్యత్‌పై ఎప్పుడూ ఒక స్పష్టమైన వైఖరితో ఉండాలి. అప్పటికప్పుడు ధనవంతుడు కావాలనేది లక్ష్యం కాదు. అదొక ఆశ. అదే ఒక పది సంవత్సరాల్లో సొంత ఇల్లు కట్టుకుని వ్యాపారంలో స్థిరపడాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు లక్ష్యాన్ని చేరేందుకు వీలు కలుగుతుంది. లక్ష్యానికి సబంధించి స్పష్టమైన పథక రచన చేయగలగాలి. సరైన మార్గంలో వెళుతున్నామా? లేదా? అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. లక్ష్య సాధనకు కోరికలు అడ్డు కాకూడదు. ఇష్టపడని పనిని అసలు చేయలేరు. అది సాధ్యమయ్యే పనికూడా కాదు.
అడ్డంకులు లేని పయనం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. తిరోగామిగా కాదు, పురోగామిగా ఉండాలని ఎప్పుడైతే పట్టుదలతో ఉంటామో అప్పుడే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకుని తగిన మార్గాలను ఎంచుకుని వాటి గురించి ఆలోచించి ముందుకు అడుగులు వేయవచ్చు.
మనపట్ల శ్రద్ధగల అనుభవజ్ఞులైన వ్యక్తుల ఆలోచలను మనం పరిగణలోకి తీసుకోవాలి. వారి సలహాలు, సూచనలు స్వీకరించాలి. మనకు రాని ఆలోచనలు వారికి వస్తాయి. ఎందుకంటే వారికి అనుభవం పాఠాలు నేర్పి ఉంటుంది. వారు మన సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు చూపిస్తారు. వారు చూపిన ఆ నూతన మార్గాలను వెతుకుతూ మనం అడుగులు వేయాలి.
Next Story