సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు క్రిష్ణా కరకట్ట పక్క పొలాల్లో ఏమి జరుగుతోంది. ఈ భూములు రాజధానకి ఉండవల్లి రైతులు ఎందుకు ఇవ్వలేదు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికి 150 మీటర్ల దూరం. కృష్ణా కరకట్టకు ఉత్తరం వైపున సీఎం గారి ఇల్లు. దక్షిణం వైపున తోటలు. ఏంటిది అనుకుంటున్నారా? అవును చంద్రబాబు ఇంటికి ఎదురుగా అమరావతిలో రాజధానికి పొలాలు ఇవ్వని రైతులు పంటలు వేస్తున్నారు. కొన్ని అరటి తోటలు ఉన్నాయి. మరికొన్ని పూల తోటలు, పసుపు, కంద తోటలు ఉన్నాయి. నేను నా మిత్రుడు కుమార్‌తో కలిసి బైకుపై ఉండవల్లి నుంచి చంద్రబాబు ఇంటి ముందు రోడ్డు మీదుగా సెక్రటేరియట్‌కు వెళుతున్నాం. చాలా మంది కూలీలు చంద్రబాబు ఇంటికి ఎదురుగా ఉన్న పొలంలో నాట్లు వేస్తూ కనిపించారు. చంద్రబాబు ఇంటి ముందు అరటి తోటలు ఉన్నాయి. ఇదేమిటి నాట్లు వేస్తున్నారు... చూద్దామని బైకు రోడ్డపై పక్కకు తీసి ఆపి దగ్గరికి వెళ్లాం. ఉల్లి నారు నాటే పనిలో కూలీలున్నారు. మగ కూలీలు మడులకు నీళ్లు కడుతూ దమ్ముచేసి చెంగత్తు కొడుతున్నారు. ఆడవాళ్లు ఉల్లి నారు నాటు తున్నారు. ఆ పనులు చూడగానే ముచ్చటేసి ఫొటోలు తీసుకున్నాం.

పొలంలో అడుగు వేస్తే మెత్తటి రేగడి మట్టి కావడంతో దిగబడుతోంది. చిన్నగా నడుచుకుంటూ పొలం యజమాని వద్దకు వెళ్లాం. ఎవరు మీరు.. ఎందుకొచ్చారని వారు అడుగుతారనుకున్నాం. మేము పలకరించే వరకు వారు మాట్లాడ లేదు. వారి పనిలో వారు ఉన్నారు. పెద్దాయనా పక్కన వస్తున్న వారు ఎవరు? అని పట్టించుకోకుండా పనిలో ఉన్నావ్‌ అన్నాం. తలెత్తి మావైపు చూసి ఆ.. ఏందయ్య... ఏమి కావాలని అడిగాడు. ఊరికే పొలం చూద్దామని వచ్చాం. ఎలా ఉంది వ్యవసాయం. పైగా చంద్రబాబు ఇంటి ముందు చేస్తున్నావ్‌. రాజధానికి ఈ భూమి ఇవ్వలేదా అని అడిగాను. లేదండీ ఇవ్వలేదు. నేను పొలం కౌలుకు చేస్తున్నా. పొలం ఉండవల్లి పులుగుజ్జోల్లది. ఇక్కడ ఎవ్వరూ పొలాలు రాజధానికి ఇవ్వలేదు అన్నాడు. చుట్టపక్కల వారంతా పొలాలు రాజధానికి ఇస్తే చంద్రబాబు ఇంటి ముందు పొలాలు ఇవ్వలేదంటే సీఎం గారికి కోపం రాదా? అని అన్నా... మా పొలాలు ఇష్టమైతే ఇస్తాం... లేదంటే ఇవ్వము. అంతే గాని సీఎం గారి ఇంటి ముందు భూమి ఇవ్వాలంటే ఎలా? అన్నాడు. పైగానే పొలం నాది కాదు. ఇక్కడి పొలాలు ఎవ్వరూ ఇవ్వలేదు అన్నారు. సీఎం ఇంటి సమీపం నుంచి ఉండవల్లి వరకు కరకట్టను ఆనుకుని ఉన్న పొలాలు ఎక్కువ మంది రాజధానికి ఇవ్వలేదు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
సరే ఉల్లి ఎందుకు వేస్తున్నావని ప్రశ్నించా. నేను 30 సంవత్సరాలుగా కౌలుకు పొలాలు తీసుకుని ఉల్లి వేస్తున్నా. ఈ పంట పండించడం నాకు ఇష్టం. ఒక్కోసారి ధరలు బాగుంటే లాభాలు వస్తాయి. లేదంటే పెట్టుబడి నష్టం లేకుండా ఉంటే చాలనుకుంటాం. ఒక్కోసారి గిట్టుబాటు కాదు. దీనికే అలవాటు పడ్డాం. ఇది తప్ప వేరే పని చేతకాదన్నారు. కౌలు సంవత్సరానికి ఎంత ఇస్తున్నావని ప్రశ్నిస్తే... ఎకరాకు రూ. 60 వేలు కట్టాలి. డబ్బులు ముందే భూమి యజమానికి ఇవ్వాలి. పంట వచ్చినా.. రాకపోయినా వారికి సంబంధం లేదు. ఉల్లి పంట పండించేందుకు నారు, మందులు కలిపి ఎకరాకు రూ. 60వేల వరకు ఖర్చవుతుంది. కౌలు, ఖర్చులు కలిపి ఒకటిన్నర లక్ష అవుతాయి. బాగా పండితే ఎకరాకు రూ. 50వేలు మిగులుతుంది. ఒక్కోసారి ధరలు లేకపోతే నష్టాలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడి గడ్డలు కుళ్లిపోతాయి. ఇందులోనూ చాలా బాధలున్నాయండీ అని అన్నారు.
నారు ఎక్కడి నుంచి తెస్తున్నారన్న ప్రశ్నకు అదో పెద్ద కథ అంటూ మొదలు పెట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలోని పెద్దారవీడు, సిద్దినాయుడుపల్లె గ్రామాల నుంచి తెస్తాము. అక్కడి పొలాల రైతులతో ముందుగానే మాట్లాడుకుని నార్లు పోయించి తీసుకొస్తామన్నారు. ఇక్కడెందుకు నార్లు పోయలేరన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ భూమి నారు పెంచేందుకు పనికి రాదు. నారు పెరగాలంటే భూమిలో నీరు పెట్టిన కొద్ది సేపటికి జల్లుమని నీరు ఆరిపోవాలి. నీరు పెడుతుండాలి. ఆరిపోతుండాలి. అక్కడి పొలాలు అలా ఉంటాయి. అందుకే అక్కడ నారు బాగా వస్తుందన్నారు. నలుగురైదుగురు రైతులం కలిసి ఒక ఎకరం పొలంలో నారు పోయిస్తాం. ఎకరంలో నారు పెంచాలంటే లక్షన్నర అవుతుంది. ఆ ఖర్చు మేమే భరిస్తాం. వారు పెంచి ఇచ్చినందుకు డబ్బులు తీసుకుంటారని తెలిపారు. కర్నాటక, మహారాష్ట్రల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తాం. మేము ప్రస్తుతం నాశిక్‌ రెడ్‌ రకం ఉల్లి నారు నాటుతున్నాం. గార్వా అనే రకం కూడా ఉంది. చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది రైతులు నాశిక్‌ రెడ్‌ ఉల్లినే వాడతారని చెప్పారు. నారు పెంపకం రెండు నెలలు ఉంటుంది. నాటు వేసిన తరువాత మూడు నెలలకు కాపు వస్తుందన్నారు. ప్రస్తుతం వర్షా కాలం అయినందున మళ్లలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
నీ పేరేంటì .. పిల్లలు ఎంత మంది అని ప్రశ్నిస్తే.. నా పేరు షేక్‌ శిలార్‌. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. అమ్మాయి. అబ్బాయి కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకున్నాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి బిటెక్‌ చదువుకుంది. ఇంటి వద్దనే ఉంటోందన్నారు. అబ్బాయిని వ్యవసాయంలోకి ఎందుకు దించలేదని ప్రశ్నస్తే నాకు పొలం లేదు. కౌలుకే పొలాలు వేస్తుంటాను. నేను ఇన్నేళ్లుగా సంపాదించిందేమీ లేదు. పిల్లలను కూడా వ్యవసాయంలోకి దించి వాళ్ల జీవితం ఎందుకు పాడు చేయడం, చదువుకుంటే వాళ్లు బతికేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే చదివించా. వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు అన్నారు.
రాజధాని రాజకీయాలు ఏమిటని ప్రశ్నిస్తే ఏముంటాయండీ ఇప్పుడంతా తిరుపతి లడ్డుపై మాట్లాడుకుంటున్నారు. కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడైనా లడ్లు తయారు చేసే నెయ్యిలో పంది కొవ్వు కలుపుతాడా... చెప్పేవాడికన్నా ఉండాలి... వినేవాడికన్నా ఉండాలి అన్నారు. ఒక్కసారిగా నాకు కాసేపు మాట రాలేదు. పొలాల్లో కూడా ఇంతగా ఇటువంటి అంశాలు చర్చించుకుంటారా.. అనుకుంటూ ఏమమ్మా... తిరుపతి లడ్డు గురించి మీరేమనుకుంటున్నారు అని నాట్లు వేసే కూలీలను ప్రశ్నిస్తే ఏమోనయ్యా కొంత మంది పంది కొవ్వు కలిపారంటున్నారు. కొంత మంది కలపలేదంటున్నారు. ఎవరి మాట నమ్మాలో మాకు తెలియడం లేదన్నారు. నాట్లు వేసే వాళ్లు అలుపు రాకుండా పాటలు పాడుతుంటారు కదా మీరెందుకు పాటలు పాడటం లేదంటే ఇప్పుడెవరయ్యా పాటలు పాడేది. గోదారి జిల్లాల్లో అక్కడక్కడా పాడుతుంటారు. వరినాట్లు వేసేటప్పుడు బురదలో కాళ్లు ఇరుక్కుపోతుంటాయి. కాళ్లు పైకి లాక్కుంటూ హుషారు కోసం పాడతారు. ఇక్కడ పాటలు ఎవ్వరికీ రావన్నారు.
అక్కడి నుంచి చిన్నగా రోడ్డుపై పెట్టిన బైకు వద్దకు వచ్చి నేరుగా సచివాలయానికి వెళ్లాం. ఇదో ప్రత్యేకానుభవం.
Next Story