గతంలో ఎన్నడు లేని విధంగా ఏపీలో నెలకొన్న రాజకీయాల కారణంగా టీటీడీ డిక్లరేషన్‌ తెరపైకి వచ్చింది. ఏయే అంశాలను అంగీకరించాల్సి ఉంటుందంటే?


ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న మత రాజకీయాల పుణ్యమా అంటూ డిక్లరేషన్‌ అనేది తెరపైకొచ్చింది. టీటీడీ నిబంధనల్లో దానిని పొందుపరచి ఉన్నా, గత కొన్ని రోజులుగా ఈ పదం మారి మోగి పోతోంది. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి టీటీడీ దర్శనం కోసం తిరుపతి తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ పదం ప్రపంచ వ్యాపితమైంది.

టీటీడీ నిబంధనల్లో డిక్లరేషన్‌ అనేది ఒకటి ఉంటుందనేది కూడా చాలా మందికి తెలియదు. దేవుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని, మొక్కు తీర్చుకొని వెంకటేశ్వరుని ఆశీర్వాదాలు పొందాలనే భక్తీ భావంలో ఉన్న వారికి డిక్లరేషన్‌ గురించి ఏమి తెలుస్తుంది? వారి మదిలో కానీ ఆలోచనల్లో కానీ డిక్లరేషన్‌ టాపిక్‌ వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే వారి చూపు ఎప్పుడూ వెంకటేశ్వరునిపైనే ఉంటాయి. ఆయన దైవాశీర్వాదాలు ఎలా పొందాలనేదానిపైనే ఉంటాయి. కులాలు, మతాలు వంటి పట్టింపులు లేకుండా అందరూ వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందాలని ఆశపడుతుంటారు.
అయితే డిక్లరేషన్‌ ఫారమ్‌లో ఏమి ఉంటుందంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలన్నీ ప్రజా దేవాలయాలు. హిందువులు తమ హక్కుతో దేవాలయాలను దర్శించుకోవచ్చు. అయితే ఇదే సమయంలో ఇతర మతస్తులు కూడా టీటీడీ ఆలయాల్లోకి వెళ్లొచ్చు. దర్శనం చేసుకొవచ్చు. ఆశీర్వాదాలు పొందొచ్చు. దానిపైన ఎలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. కాకపోతే టీటీడీ ఆలయాల్లోకి వచ్చే ముందు ఇతర మతాలకు చెందిన వారు డిక్లరేషన్‌ ఇవ్వడం తప్పనిసరి. అనేది ఆ ఫారంలోని సందేశం. ఇతర మతాలకు చెందిన వారు డిక్లరేషన్‌ ఫారంలో వారి పేరు, అడ్రస్సు తప్పకుండా రాయాల్సి ఉంటుంది. వారు ఏ ఆలయాల్లోకైతే వెళ్లాలని అనుకుంటున్నారో ఆ ఆలయంలోని దేవుడి పేరు రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దేవుడిపైన నమ్మకం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఆ దేవుడిని ఆరాధించడం తనకు ఇష్టమని, దేవుడి ఆరాధనను గౌరవిస్తానని కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని విషయాలను అంగీకరిస్తున్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది. తాను ఇవన్నీ అంగీకరిస్తున్నట్లు సాక్షులు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇలా సంతకం చేసిన డిక్లరేషన్‌ ఫారంను ఆలయ ప్రత్యేక అధికారికి కానీ, విధుల్లో ఉన్న ఇన్‌చార్జి ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ అధికారి దానిపై ఆమోద ముద్ర వేస్తారు. తర్వాత అందరు భక్తులు మాదిరిగానే ఇతర మతాలకు చెందిన వారు కూడా టీటీడీ ఆలయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దేవుడికి పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది.
Next Story