పాదరక్షలకు ఆసుపత్రి పెట్డం ఏమిటి.. వాటికి శస్త్ర చికిత్సలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా? అవును నిజమే.. పాదరక్షల కోసం ఆసుప్రతి ఏర్పాటు చేశారు. చేసింది చిన్న సాయమే అయిన ఓ కుటుంబానికి ఆసరగా మారింది.


మనుషులకు హాస్పిటల్స్‌ ఉంటాయి. మనుషులకు వచ్చే జబ్బులను బట్టి విభాగాల వారీగా ఆసుపత్రులు ఉన్నాయి. జంతువులకు, పశువులు, కోళ్ళకు, కుక్కలకు కూడా ఆసుపత్రులు ఉన్నాయి. విజయవాడ వంటి ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తెచ్చారు. శరీరంలో పని చేయని అవయవాలకు చికిత్సలు అందించి అవి సక్రమంగా పని చేసే విధంగా వైద్యులు చేస్తారు. అదే కాన్సెప్ట్‌ను పాదరక్షలకు కూడా అన్వయించుకున్నారు. కాకపోతే మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, కోళ్ళు, కుక్కలు తదితరాలు ప్రాణాలతో ఉంటాయి. పాదరక్షలకు ప్రాణం ఉండదు. అంతే తేడా. పాడై పోయిన పాదరక్షలకు మరమ్మతులు చేసి వాటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా అందంగా తయారు చేసి ఇవ్వడంలో గొప్ప నైపుణ్యతను ప్రదర్శిస్తారు.

ఇంతకీ ఎక్కడ దీనిని ఏర్పాటు చేశారని అనుకుంటున్నారా? ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో దీనిని ఏర్పాటు చేశారు. వత్సవాయిలో ఉప్పర కృష్ణ అనే వ్యక్తి ఉంటున్నారు. ఈయనకు 61 ఏళ్లు. ఈయన దివ్యాంగులు. చిన్నప్పుడు పౌలియో రావడం వల్ల కాలుకు సమస్య వచ్చింది. ఈయనకు ఇద్దరు పిల్లలు. ఏళ్ల తరబడి చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ఈయనకు జీవన ఆధారం. ఈ వృత్తిని చేసుకుంటూనే ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పటికీ ఈ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. నాలుగు కర్రలు, తాటాకులతో చిన్న పందిరిగా వేసుకొని దాని కిందనే చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఇది దెబ్బతినింది. ఉరుస్తుండటం, నీళ్లు కారుతుండటం వల్ల దాని కింద కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు పడిన ప్రతి సారి ఇదే రకంగా ఉప్పర కృష్ణ ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే ఈ షాపు ఉండటం వల్ల రోడ్డుపైన నిలబడిన వర్షపు నీరు వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు.
దీనిని గమనించిన ఓ ప్రభుత్వ అధికారి చలించి పోయారు. కృష్ణకు ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనే వత్సవాయి ఎస్సై బి అభిమన్యు. తాటాకులతో ఉన్న వసారను తొలగించి ఐరన్‌తో కూడిన షాపును ఏర్పాటు చేయాలని భావించారు. దాని కోసం ప్రత్యేకంగా ఐరన్‌ పైపులను తెప్పించి వాటిని వెల్డింగ్‌ చేసి సొంత ఖర్చులతో షాపులాగా తయారు చేయించారు. ఫ్లెక్సీ రూపకల్పన నుంచి నిర్మాణ అంత తనే దగ్గర ఉండి చూసుకున్నారు. దీనికి ‘కృష్ణా పాదరక్షల ఆసుపత్రి’ అని నామకరణం చేశారు. ఇక్కడ అన్ని రకాల చెప్పులు, షూలు బాగు చేయబడును అని క్యాప్షన్‌ పెట్టారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత తనే రిబ్బన్‌ కట్‌ చేసి ఓపెన్‌ చేసి ఆసరాగా నిలిచారు. చేసింది చిన్న సాయమై అయినా ఒక కుటుంబం జీవించేందుకు భరోసా కల్పించారు. దీనికి ఆ పోలీసు అధికారి స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు.
పాదరక్షల ఆసుపత్రి ప్రయోగం వినూత్నంగా ఉండటంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై అభిమన్యును సంప్రదించగా.. తనకు సోషల్‌ సర్వీస్‌ అంటే చాలా మక్కువ అని, అందుకే తన బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలి పెట్టి పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో వారికి ఒక భరోసా కల్పించడంతో పాటు, వారికి మానసిక ధైర్యంఅందించడం ఎంతో ముఖ్యమన్నారు. పోలీసు అధికారులు ఇలా చేయడంతో ప్రజలకు చేరువ కావడానికి, వారితో కలిసి పని చేసేందుకు అవకాశం ఉంటుందని, దీంతో డిపార్ట్‌మెంట్‌కు గౌరవం కూడా పెరుగుతుందన్నారు. అందుకే ఫ్లెక్సీలో ఒక వైపు కృష్ణకు ఇష్టమైన దైవం జీసస్‌ ఫొటోను, మరో పక్క ఏపీ పోలీసు లోగో కూడా ఉండే విధంగా తయారు చేయించినట్లు తెలిపారు. పాదరక్షల ఆసుపత్రి ఎందుకు పెట్టాలనిపించిందని అడుగగా.. ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ టాక్‌ను ఇంకా కొనసాగిస్తూ ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నట్లు చెప్పారు. ఇది వరకు తాను సామర్లకోటలో పని చేస్తున్న సమయంలో భాస్కరరావు అనే వ్యక్తికి కూడా ఇదే రకంగా షాపును ఏర్పాటు చేసి భరసా కల్పించామని, ఆయన కూడా దివ్యాంగుడని, రెండు కాళ్ళు లేవని, అయితే ఇటీవలే ఆయన కాలం చేసినట్లు తెలిసిందని మనసులోని తన బాధను వ్యక్తం చేశారు.
Next Story