సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్

సీఎం క్యాంపు ఆఫీసులోకి మంగళవారం మధ్యాహ్నం ఒక మినీ కంటైనర్ వచ్చింది. అది ఎందుకొచ్చింది. ఎవరు తెచ్చారు. ఇది ఇప్పుడు రాష్ట్రమంతా తీవ్రమైన చర్చ.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి మంగళవారం మధ్యాహ్నం ఒక మినీ కంటైనర్ వాహనం వచ్చింది. అది ఎవరిది? ఎందుకొచ్చిందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇందులో ఏమున్నాయి. పోలీసు చెక్ పోస్టు వద్ద నమోదు కాకుండా వాహనం లోపలికి ఎందుకు పోయింది. అదే దారిలో తిరిగి ఎందుకు వెళ్లిపోయిందనేది జరుగుతున్న చర్చ. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి అనుమతి లేకుండా ఏ వాహనమైనా వస్తుందా? శివుడి ఆదేశం లేనిదే చీమైనా వస్తుందా? అన్నట్లు పోలీసులకు తెలియకుండా వాహనం లోపలికి వెళ్లి బయటకు పోవడం సాధ్యమవుతుందా? పైగా పోలీసులే లోపలికి పంపించి బయకు వెళ్లటప్పుడు కూడా దగ్గరుండి పంపించారు. ఇది బాగా చర్చనీయాంశమయింది. ఎన్నికలపుడు ఏమి అనుమానం వస్తుందో అదే వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీని మీద అనుమానం వ్యక్తం చేశారు.

"అయ్యా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులూ.. రోజు నా కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? మీ ఎదురుగా సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్ ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం డిజిపి చెబుతారా?," అని చాలా ఘాటుగా ఆయన ట్వీట్ చేశారు.




ఇంతకూ ఆ వాహనం ఎందుకొచ్చింది..


సీఎం జగన్ బుధవారం నుంచి ఇడుపులపాయ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. జగన్ మొదటి దఫా ప్రచారాన్ని 21 రోజులు వరుసగా నిర్వహించనున్నారు. రూట్ మ్యాప్ ప్రకారం ప్రచారం సాగుతంది. ప్రచారం సందర్బంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనం తయారు చేసేందుకు ఒక ప్యాంట్రీ వాహనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు అద్దెకు తీసుకున్నారు. ఆ వాహనంలోనే జగన్ కు కావాల్సిన ఆహారాన్ని తయారు చేస్తారు. వంట మనుషులు కూడా అందులోనే ఉంటారు. రూట్ మ్యాప్ ప్రకారం మధ్యాహ్నం భోజనానికి ఎక్కడ ఆగుతారో ఆ వాహనం ముందుగా అక్కడికి చేరుకుని వంట సామగ్రి దించి వంట చేస్తారు. తరువాత మరలా వాహనంలోకి సామగ్రి సర్థుకుని వేరే చోటుకు వెళతారు.



క్యాంపు ఆఫీసులో వాహనంలోకి ఏమి ఎత్తారు..

మంగళవారం మధ్యాహ్నం వాహనం సీఎం జగన్ క్యాంపు కార్యాలయం లోపలికి వచ్చింది. ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ వాహనం నెంబరును సీఎం ఆఫీసుకు పార్టీ వారు తెలిపారు. అందుకే ఆ వాహనం పోతుండగానే వాహనాన్ని క్యాంపు ఆఫీసులో వంట సామగ్రి ఉండే వైపుగా తిప్పి పెట్టి వంట పాత్రలు అందులోకి ఎక్కించారు. సామాన్లు కంటైనర్ లోపలికి చేర్చడానికి సుమారు గంట పట్టింది. అక్కడి నుంచి వాహనం సామాన్లు తీసుకుని ఆళ్ళగడ్డకు బయలుదేరి వెళ్లింది. ప్రస్తుతం ఆళ్లగడ్డ వద్ద వాహనం ఉందని ఎవరైనా వచ్చి చూసుకోవచ్చని వైఎస్సార్సీపీ వారు చెబుతున్నారు.


పాదయాత్రలోనూ ఇలాంటి వాహనమే వాడారు..

వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇటువంటి వాహనాన్నే పాంట్రీకి వాడారు. వంట సామాన్లు ఉంచేందుకు కంటైనర్ లాంటి వాహనం అయితే బయటకు కనిపించకుండా ఉంటాయనే ఆలోచనతో ఈ వాహనం ఉపయోగిస్తుంటారు. అయితే మంగళవారం వాహనం మధ్యాహ్నం సమయంలోనే అందరూ చూస్తుండగానే లోపలికి వెళ్లి బయటకు వచ్చిందని, వాహనంలో డబ్బే తరలిస్తే ఇంత బహిరంగంగా ఎందుకు చేస్తారని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలని అనటం విశేషం.



Next Story