శాసన సభలో ఆంధ్రా గాంధీ ఎవరో గుర్తున్నారా?
x

శాసన సభలో "ఆంధ్రా గాంధీ" ఎవరో గుర్తున్నారా?

నీరుకాయ పంచ.. చేతిలో గుడ్డ సంచి.. బక్కపల్చటి మనిషి, నీతినిజాయితీలకు నిలువుటద్దం ఆయన. ఎనభై ఏళ్ళ జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు.


నీరుకాయ పంచ.. చేతిలో గుడ్డ సంచి.. బక్కపల్చటి మనిషి, నీతినిజాయితీలకు నిలువుటద్దం ఆయన. ఎనభై ఏళ్ళ జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు. ఆయనే వావిలాల గోపాలకృష్ణయ్య. రాజకీయాల విలువలకు పెద్దపీట వేసి, ప్రజాపోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉత్తమ శాసనసభ్యునిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎనలేని కీర్తిని పొందిన వావిలాల గోపాలకృష్ణయ్య ఎందరికో ఆదర్శం.

స్ఫూర్తి ప్రదాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన జీవితమే ఓ సందేశం. రెండు జతల ఖద్దరు బట్టలు, గాంధీజీ బొమ్మ ఉన్న ఒక ఖద్దరు సంచిలో సర్దుకుని నిత్యమూ ఏదో ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొన్న అసాధారణ వ్యక్తి. ఆయన్ని కొందరు ఆంధ్రా గాంధీగా అభివర్ణిస్తారు. జీవితాంతం చెక్కుచెదరని ఆశయాలు. ప్రజాసేవే పరమావధి. అతిసాధారణ జీవనశైలి. ‘నాలుగు సార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించినది ఈయనేనా?’ అని ఆశ్చర్యపోయేంతటి మూర్తితత్వం... ఆ మహనీయుడే పద్మభూషణ్‌ వావిలాల గోపాలకృష్ణయ్య.

పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించి బ్రతికినంత కాలం ప్రజాసేవలో జీవించిన ధన్యజీవి గోపాలకృష్ణయ్య . స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘ఆంధ్రపత్రిక’కు ఉప సంపాదకుడిగా తనవంతు పాత్ర పోషించారు. సుదీర్ఘమైన ప్రజాజీవిత ప్రస్థానంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అందులో 'విశాలాంధ్ర' ఉద్యమం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ముఖ్యమైనవి. అన్నిటికన్నా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ప్రధాని నెహ్రూ చేత ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయించటంలో కృషి అభినందనీయం. నల్గొండ- గుంటూరు జిల్లాలు ఇప్పుడు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు ఈ ప్రాజెక్టే కారణం. సాగర్ నేడు ఒక గొప్ప పర్యాటక ప్రాంతం కూడా.

వావిలాల గోపాలకృష్ణయ్య 1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి పేరిందేవి, శ్రీ నరసింహం. ఈయన వారి నాలుగో సంతానం. చదువుకునే రోజుల్లోనే గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులై, విద్యను మధ్యలోనే ఆపేసి ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ హయాంలో జైలు శిక్షలు కూడా అనుభవించారు. జీవితమంతా నిరాడంబరంగా గడిపారు. స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన భీమవరపు నరసింహారావుతో గోపాలకృష్ణయ్య కలిసి... ఇంటింటికీ తిరిగి ‘స్వరాజ్య భిక్ష’పేరుతో బియ్యం, జొన్నలు సేకరించారు. ఆ సేకరించిన ఆహారపదార్థాలతో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.

ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన యోధుడీయన!. 1925 లోనే సత్తెనపల్లిలో 'శారదా నిలయం' అనే గ్రంథాలయం నెలకొల్పటమే కాకుండా, గ్రంథాలయ ఉద్యమాలు చేసి, అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వావిలాల ఖర్చుపెట్టినది కేవలం 600 వందల రూపాయలు. 1955, 1962, 1967 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా సత్తెనపల్లి నుంచి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్ధిగా గెలుపొందారు. జీవితాంతం గాంధేయవాదిగా కొనసాగిన ప్రకాశం పంతులుకి సన్నిహితుడు. ప్రకాశం పంతులు, బూర్గుల, పుచ్చలపల్లి సుందరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు వంటి మహామహుల సరసన శాసనసభలో సభ్యునిగా వ్యవహరించిన వావిలాల స్పృశించని సమస్య లేదు.

మరో ప్రముఖ వ్యక్తి తెన్నేటి విశ్వనాథంతో జతకూడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతలుగా అనేక ప్రజా సమస్యలపైన అర్ధవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. చర్చల మధ్యలో ఎన్నో హాస్యోక్తులు కురిపించేవారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఒక రోజు శాసన సభలో ఒక తీవ్రమైన విషయంపైన సుదీర్ఘ చర్చ జరుగుతున్నది. బ్రహ్మానందరెడ్డి అసహనంగా ఉన్నారు. ఆ అసహనంలో, "గోపాలకృష్ణయ్య గారూ! మీరు చెబుతున్న విషయం అర్ధవంతంగా లేదు. నేను ఒక చెవితో విని మరొక చెవితో వదిలి పెడుతున్నాను" అని అన్నారు. వెంటనే గోపాలకృష్ణయ్య "ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దంతా ఒక చెవితో విని మరొక చెవితో వదిలి పెడుతున్నారంటే, నాకొక అనుమానం, ఆ రెండు చెవుల మధ్య ఉండవలసిన 'బ్రహ్మ' పదార్థం లేని వట్టి 'ఆనందరెడ్డి' గారేమో మన ముఖ్యమంత్రి" అని విసిరిన ఛలోక్తికి సభలోని అందరితోపాటు బ్రహ్మానందరెడ్డి కూడా నవ్వుకున్నారు.

1990 లో మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి మొట్ట మొదటి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన హయాంలోనే ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ప్రకటనలు ఎన్నో అమలులోకి వచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' సత్కారంతో గౌరవించి తన ప్రత్యేకతను నిలుపుకుంది. భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్' బిరుదుతో సత్కరించింది. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే వ్యక్తి ఈయన.

తెలుగు ఆంగ్ల భాషలలో అనేక గ్రంథాలు రచించిన ఈ మేధావి తెలుగు వాడని చెప్పుకోవడానికి అందరం గర్వపడాలి. విద్యాధికుడు కాదు, సామాన్యమైన మాధ్యమిక విద్యాలయంలో చదువుకున్న విద్యే! అయితేనే, అమోఘమైన ధారణ కలిగిన వ్యక్తి. ఎంతో మంది మేధావులు, విద్యావంతులు – విశ్వవిద్యాలయాలలో ఆయన 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ ఉపన్యాసాలు' వినడానికి కుతూహల పడేవారు! అయితే ఆ మహనీయుని స్మారక చిహ్నాలు, ఒక ఉద్యానవనం సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం చేసిన వాగ్దానం శుష్క వాగ్దానంగానే మిగిలి పోయింది. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. దానినే 'వావిలాల సంస్థ' గా పిలుస్తుంటారు. అందులో గోపాలకృష్ణయ్య సేకరించిన వేలాది పుస్తకాలతో ఒక గ్రంథాలయం కూడా ఉన్నది. ఆయన తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రాశారు. 1922లో తొలి రచన 'శివాజీ', 1947లో 'మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?', 1951లో 'విశాలాంధ్ర', 1976-77 'ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం'.. మచ్చుక్కు కొన్ని.

1952లో శాంతి సభలలో ఆయన భారతదేశ ప్రతినిధిగా చైనాలో పర్యటించారు. 1952 లోనే శాంతి సభలలో పాల్గొనే భారతదేశ ప్రతినిధిగా రష్యాలో పర్యటించారు. 1992 లో ప్రపంచ తెలుగు మహాసభలలో అమెరికాలో పర్యటించారు. “ఈ దేశాన్ని, జాతిని తానొక్కడే తీర్చిదిద్దగలనన్న అహంకార ధోరణి ప్రతి రాజకీయ నాయకునిలోనూ పెరిగిపోయి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడి, స్వార్థమే పరమావధి”గా మారిన నేటి పరిస్థితుల్లో వావిలాల వంటి వారు ఒక్కరు కూడా తెలుగునాట లేకపోవడం తెలుగువారి దురదృష్టం. రెండు తెలుగు ప్రాంతాలలోనూ నేడు జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, పార్టీల పొత్తులు, ఎత్తులు, జిత్తులు చూస్తూ ఆవేదన చెందుతున్న తెలుగువారు, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి వేగుచుక్క కోసం ఎదురుచూస్తున్నారని అనడంలో సందేహం లేదు.

ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు, ఆజన్మ బ్రహ్మచారి, అపర భీష్ముడుగా భాసిల్లిన గోపాలకృష్ణయ్యని 96 సంవత్సరాల వయసులో 2003 ఏప్రిల్ 29న మృత్యువు కబలించింది. భౌతికంగా వీడిపోయినా, నాగార్జునసాగర్ నుంచి ప్రవహించే కృష్ణా జలతరంగాలలో వారు చిరునవ్వుతో నిత్యం జన క్షేమాన్ని కనిపెడుతూనే ఉన్నారు!

Read More
Next Story