ఆంధ్రప్రదేశ్ లో పోస్టర్ల వివాదం ముదిరి పాకాన పడుతోంది. గొడవలు, కొట్లాటలకు దారి తీస్తోంది. కంప్లైంట్ చేసే వారిపై అధికార పార్టీ వారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
ఎన్నికల కమిషన్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్ర స్థాయిలో దాన్ని పరిష్కరించే వారు ఉంటేనే కాని అమలవుతుంది. లేకుంటే వివాదాలు దాని చుట్టూ అలుముకుంటాయి. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతున్నది. ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం ఫెక్సీ పోస్టర్లు హైవేల పక్కన ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. రహదారుల వెంట దాదాపు అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కటౌట్స్ ఏర్పాటు చేశారు. అధికారులు చూసినా పట్టించుకోవడం లేదు. ఎవరి నుంచైనా ఫిర్యాదు వస్తే తప్ప చర్యలు తీసుకోవడం లేదు.
ఎందుకిలా జరుగుతోంది...
ఎన్నికల కమిషన్ పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. అయినా అధికార పార్టీకి చెందిన వారి డామినేషన్ ఎక్కువగానే ఉంది. గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు మధ్య మునిసిపాలిటీ వారు అడ్వర్టైజ్ మెంట్లకు ఇచ్చే బోర్డులను టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకుని పోస్టర్లు అంటించారు. దీంతో వైఎస్సార్సీపీ వారు ఒక్కసారిగా రోడ్లపైకొచ్చి ఆ పోస్టర్లపై వైఎస్సార్సీపీ పోస్టర్లు రాత్రికి రాత్రి అంటించారు. మరుసటి రోజు ఉదయాన్నే తామేమీ తక్కువ తినలేదంటూ వైఎస్సార్సీపీ పోస్టర్లను పీకి పక్కన పడేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది. పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరూ రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు వచ్చాయి.
శుక్రవారం రాత్రి కడప టీడీపీ అభ్యర్థి ఆర్ మాదవి రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలో ఒక మీటింగ్ లో పాల్గొనేందుకు వస్తోంది. రోడ్డుపక్కనే నిలువెత్తు సిద్ధం ఫొటో కనిపించడంతో కారు ఆపి ఆ పోస్టర్ ఫొటో ఫోన్లో ఫొటోలు తీస్తోంది. దీనిని చూసిన స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశి మనుషులు ఆమె దగ్గరకు వెళ్లి పొటోలు తీయోద్దంటూ ఆపారు. ఇక్కడ ఇంకా ఈ పొటోలు ఉంచకూడదని, తాను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు తీస్తున్నానని చెప్పారు. దీంతో అక్కడి వారు ఆమెతో గొడవకు దిగారు. ఫోన్లోని ఫొటోలు డిలీట్ చేయాలని పట్టుపట్టారు. ఈలోపు జరుగుతున్న గొడవను తెలుసుకున్న టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఫొటోలు తీసిన కడప టీడీపీ అభ్యర్థి అయిన మాధవి రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు దీంతో అక్కడి టీడీపీ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
సి విజిల్ యాప్ లో కంప్లైంట్ చేసే వరకు తీయరా?
రోడ్ల పక్కన ఏ పార్టీ వారి పోస్టర్లు ఉన్నా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తొలగించాల్సి వుంటుంది. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. పట్టణాల్లో దాదాపు పోస్టర్లు ఎక్కడున్నా, ఎవరివైనా తొలగించారు. రోడ్లపై ఉన్న పోస్టర్లు ఆయా పంచాయతీల వారు వారి పరిధిలో తొలగించాల్సి ఉంటుంది. అలా కూడా వారు పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేసేవారు విజిల్ యాప్ ను ఉపయోగించి కంప్లైంట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చదువుకున్న వారు మాత్రం ఈ పని చేయగలుగుతున్నారు. నాలుగు రోజుల క్రితం గోదావరి గట్టున 60 అడుగుల ఎత్తైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కటౌట్ ఉండటాన్ని చూసిన మాజీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ కటౌట్ ఫొటో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టు చేశారు. విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశారు. ఆ తరువాత 24 గంటల్లో ఆ కటౌట్ ను తొలగించారు. ఇలా ఎక్కడ చూసినా కంప్లైంట్లకు స్పందిస్తున్నారు తప్ప స్వతహాగా కటౌట్ లు, పోస్టర్లు తొలగించడం లేదు.
ఎమ్మెల్యే అభ్యర్థిపైనే దాడులకు తెగబడతారా?
సి విజిల్ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు మధవి ఫొటో తీస్తుంటే బెదిరించి దాడులకు తెగబడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలి. మహిళా నేతపై జరిగిన దాడిని అడ్డుకోకపోగా ఆమెనే పోలీస్ స్టేషన్ కు రావాలంటూ వత్తిడి చేసిన పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
పలుచోట్ల వాలంటీర్లపై కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న 12మందిపై ఈసీ వేటు వేసి వారిని తొలగించింది. పలు చోట్ల వీరు వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై కమిషన్ స్పందిస్తూనే వుంది.