జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పిఠాపురం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఏమి చేయనుంది?
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంపై ప్రతి ఒక్కరు దృష్టిపెట్టారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వింగ్‌తో మాట్లాడుతూ తాను పిఠాపురం నుంచి అభిమానుల కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో. ప్రస్తుత రాజకీయాల్లో కీలక వ్యక్తి. నిత్యం వార్తల్లోకి ఎక్కిన నేతగా పవన్‌కళ్యాణ్‌కు పేరుంది. అటువంటి పవన్‌కళ్యాణ్ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు. అక్కడి నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు.
కులబలం ఉందనే...
పిఠాపురం నియోజకవర్గంలో కాపులు ఎక్కువ. రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కూడా కాపు సామాజిక వర్గానికి చెందివారే. అందుకే ఆయన ఎదురు లేకుండా రెండు సార్లు గెలిచారని చెబుతుంటారు. ఇక్కడి నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. మొత్తం ఓటర్లలో మెజారిటీ ఓటర్లు కాపులు అవడం వల్ల అక్కడి నుంచి పోటీ చేయాలని పవన్‌కళ్యాణ్‌ను నియోజకవర్గ ప్రజలు కోరారు. దీంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
ప్రజా నాయకునికి కులబలం అవసరమా?
ప్రజా నాయుకుడు. అందులోనూ సినీ హీరో. ప్రస్తుతం సినీ పరిశ్రమలో క్రేజ్ ఉన్న హీరో. ఆయన కూడా కులబలాన్ని నమ్ముకున్నా అనే విమర్శలు కూడా వచ్చాయి. ఎక్కడి నుంచి పోటీ చేసినా ఒక పార్టీ నాయకునిగా ధైర్యంగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలి. అంతే కాని ఓడిపోతాననే భయం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను తాకేందుకు వీలుండకూడదని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.
రంగంలోకి వంగా గీత
వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతను రంగంలోకి దించేందుకు వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. వంగా గీతకు ఓటర్లలో మంచి పేరు ఉంది. ఆ మంచితనాన్ని ఉపయోగించుకుని కులబలాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు రాబట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ భావించింది. ఇద్దరు హేమాహేమీలు ఎన్నికల బరిలోకి దిగితే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, అందులోనూ ఇద్దరూ కావాలని కోరుకునే వారు ఎవరివైపు మొగ్గుచూపాలో ఆలోచించుకుంటారు. అందువల్ల కులబలంపై దెబ్బకొట్టాలంటే పవన్‌కళ్యాణ్‌కు ధీటైన అభ్యర్థి వంగా గీత మాత్రమేనని వైఎస్ జగన్ భావించారు. అందుకే రెండు సార్లు గెలిచినా పెండెం దొరబాబును పక్కనబెట్టి గీతను రంగంలోకి దించారు. దొరబాబుకు గత ఎన్నికల్లో 45శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి వర్మకు 37 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ అభ్యర్థి శేషుకుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. అంటే 15శాతం ఓట్లు జనసేన సాధించింది. ఇప్పుడు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నందున జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చరిస్మా కలుపుకుని కనీసం 65శాతం తగ్గకుండా ఓట్లు వస్తాయనే భావనలో జనసేన ఉంది.
రామ్‌గోపాల్‌వర్మ గోలేంటి?
తెలుగు సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తాను పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌పై పోటీ చేస్తానని తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? వైఎస్ జగన్‌తో మాట్లాడి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే ఈయన సీతయ్యని, ఎవరిమాటా వినేవాడు కాదని, తాను ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడని, ఎదిటివారి ఇబ్బందులు నాకు పట్టవని చాలా సార్లు ప్రకటించారు. ఇటువంటి దర్శకుడిని అక్కడి ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. మొత్తం మీద ఒక్కో పార్టీ తమ అభ్యర్థుల పూర్తి జాబితాను త్వరత్వరగా ప్రకటించే పనిలో ఉంది. ఇప్పుడు పిఠాపురం వార్తల్లో నియోజకవర్గమైంది.
Next Story