వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగిందో జగన్‌కు తెలుసా?
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు మలుపులు తిరుగతోంది. సీబీఐ వారు చేతులెత్తేసేలా ఉన్నారు. ప్రజల మధ్య విచారణ జరగాలి. అప్పుడు కాని వాస్తవాలు బయటకు రావు.
నిందితులను కాపాడాలని జగన్ చూస్తున్నారా?
సునీతకు షర్మిల ఎందుకు అండగా ఉన్నారు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు మరో సారి చర్చనియాంశ మైంది. ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కేసు ముందుకు సాగటం లేదని, సీబీఐ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించడంతో రాష్ట్రంలో మరోసారి చర్చకు దారితీసింది. కేసును ప్రజాకోర్టులో విచారించి తీర్పునివ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కేసుపై షర్మిల ప్రత్యేక శ్రద్ధ
సీబీఐ విచారణ చేపట్టినప్పటి నుంచీ వైఎస్ షర్మిల ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి హస్తం ఉందని సునీత ఆరోపిస్తూనే ఉంది. ఈ ఆరోపణ నేపథ్యంలోనే అవినాష్, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రజల్లో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి హత్యకు గురైతే ఆకేసును ఇన్ని మలుపులు తిప్పడం వెనుక రాజకీయ హైస్తం ఉందనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది. న్యాయం కోసం ఐదేళ్లుగా సునీత పోరాడుతున్నా సీబీఐ నుంచి సరైన స్పందన కరువైందని చెప్పొచ్చు. అందుకే ఆమె తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరుకోవడంలో అర్థముంది.
ఐదేళ్లయినా కేసు కదల్లేదు..
సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది కనీసం వారం రోజుల్లో నిర్ధరణకు రావొచ్చు. వివేకానందరెడ్డి కేసులో ఐదేళ్లయినా హంతకులు ఎవరనేది నిర్ణారణ కాలేదు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. సొంతవాళ్లే మోసం చేయడంతో వివేకా ఓడిపోయారు. అయినా నిరాశ చెందలేదు. మరింత యాక్టివ్ అయ్యారు. ప్రత్యర్థులను ఎలాగైనా అణగదొక్కుతారని భయం వారిలో ఉండి ఉండొచ్చు. ఎందుకు ఇలా జరిగిందో అప్పట్లో వివేకా బంధువుల్లో కూడా ఎవరికీ అర్థం కాలేదు. కుమార్తె, అల్లుడు. భార్య కూడా ఏమి జరిగిందని తేరుకునేలోపులోనే శవం పోస్టుమార్టం అయి అంత్యక్రియల వరకు చకచకా జరిగిపోయాయి.
అవినాష్‌రెడ్డిపై అనుమానం వచ్చిన తరువాతే సీబీఐని ఆశ్రయించిన సునీత
వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ మార్చురీ బయట సునీత వద్దకు వచ్చి రాత్రి 11.30 గంటల వరకు పెద్దనాన్న నాతోనే ఉండి నాకోసం ఎన్నికల ప్రచారం చేశారని సునీతకు చెప్పారు. అయితే అప్పట్లో ఆమె అవినాష్‌ను అనుమానించలేదు. వివేకా హత్యలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల ప్రమేయం ఉందనే అనుమానంతోనే సునీత సీబీఐని ఆశ్రయించడం, ఆ తరువాత కేసు పలు మలుపులు తిరిగి సంచలనంగా మారింది.
వివేకాను గొడ్డలితో చంపారనే విషయం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎలా తెలిసిందనేది సునీత ప్రశ్న. నిజానికి గొడ్డలితో చంపారని జగన్‌కు తెలిసిందంటే ఎవరు ఇందులో పాత్రదారులు, సూత్రదారులనే విషయం జగన్‌కు తెలిసే ఉంటుందనేది సునీత తరఫున బంధువుల అనుమానం. ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలని, వాస్తవాలు వెలుగులోకి రావాలనేది సునీత కోరుకుంటోంది. దీంతో పాటుగా తెరవెనుక ఉన్న సూత్రదారులు, పాత్రదారులు కూడా బయట సమాజానికి తెలియాలనేది సునీత బలంగా కోరుకుంటున్న అంశం. అంతేకాకుండా వివేకానంద రెడ్డి మర్డర్‌లో ఎంపి అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి హస్తం ఉందని, వీళ్లను జగన్‌మోహన్‌రెడ్డి రక్షిస్తున్నారని సునీత మొదటి నుంచి బలంగా నమ్మడమే కాకుండా వాదిస్తూ వస్తోంది. ఇవే విషయాలను బహిరంగంగానే వెల్లడిస్తూ వస్తోంది. సిబిఐ దర్యాప్తు మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎందుకు త్వరగా విచారణ జరగడం లేదు, జాప్యం ఎందుకు జరుగుతోందనేదానిపై ఇంతవకు సీబీఐ నుంచి సమాధానాలు లేవు. వంచనకు పాల్పడిన అవినాష్ రెడ్డికి శిక్ష పడాలని ఆమె న్యాయ పోరాటం సాగిస్తోంది. ఇంత నయవంచనకు పాల్పడిన జగన్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని, జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కష్టాలే ఉంటాయని ప్రజలకు కోరుతోంది.
ఇచ్చిన మాట మీద నిలబడతా, విశ్వసనీయత అంటూ జగన్ చెప్పుకోవడం పైన ఆమె ప్రశ్నిస్తోంది. సునీతకు జగన్ ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో ఇంతవకు జగన్ నుంచి సమాధానం లేదు. సొంతవాళ్లే హత్య చేశారని ఎలా నమ్మగలం అంటూ సునీత మాట్లాడుతుంటే ఎవరికైనా ఆలోచించకుండా ఉంటారా? మొత్తం మీద ఇంకా 8 మందిపై విచారణ జరగాల్సి వుందని సునీత చెబుతోంది. నిర్ధోషులైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా.. దోషులైతే తప్పకుండా శిక్షపడాలని ఆమె కోరుకుంటున్నారు.
అరెస్టుకు వెళ్లి వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా?
శివశంకర్‌రెడ్డి అరెస్టు తర్వాత కేసు మొత్తం మారిపోయింది. భయం మొదలైంది. అప్పటి నుంచే సీబీఐపై కేసులు పెట్టడం ప్రారంభించారు. సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు. కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాకే విచారణ మళ్లీ ప్రారంభమైంది. అవినాష్ అరెస్టు కోసం సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లినపుడు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అరెస్టు చేయడానికి సీబీఐ వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? అరెస్టు చేయాల్సిన వ్యక్తి కళ్లెదుటే ఉన్నా దర్యాప్తు సంస్థ అధికారులు రెండు రోజులు ఎదురుచూసి వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐకి ఎవరైనా ఎదురు చెబుతారా. ఇవన్నీ పరిశీలిస్తే సీబీఐపై వత్తిళ్లు ఉన్నాయనేది సునీత అనుమానం.
సంవత్సరాల తరబడి సాగుతున్న కేసు..
సీబీఐపై కూడా వత్తిళ్లు ఉండి ఉంటాయనే అనుమానం సునీత వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి కేసును సాగదీస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ తలుచుకుంటే ఎందుకు కేసు ముందుకు సాగదనేది సునీతతోపాటు పలువురి వాదన.
అనుమానంతో నన్ను, నాభర్తను విచారించారు. తప్పేముంది, అనుమానం ఉంటే ఎవరినైనా విచారించొచ్చని సునీత చెప్పడం కూడా విశేషమే. రాష్ట్ర ప్రభుత్వం వెనుక ఉండి మాపై కేసులు పెట్టించారనే అనుమానాన్ని ఆమె వక్తం చేశారు. నన్ను నా భర్తను ఎంత త్వరగా విచారించారో అంతే త్వరగా ఈ కేసును విచారించి తీర్పునివ్వాలని కోరుకోవడంలో తప్పులేదనొచ్చు. నేను ప్రజల్లోకి వెళ్తా. అయితే ఎలా వెళ్లాలనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. నేను పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సునీత చెప్పడం విశేషం.
Next Story