ఉచిత గ్యాస్‌ పథకం తుస్సుమంటుందనే అనుమానం ఉచిత గ్యాస్‌కు ఎంపికయ్యే వారిలో ఉంది. వారి సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు.


ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్‌ పథకం తుస్సుమంటుందనే మాటలు వినవస్తున్నాయి. ఎవరిని కదిలించినా ఆ వచ్చినప్పుడు చూద్దాంలేండి అంటున్నారే తప్ప నాకు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న కుటుంబాల సంఖ్య 1,48,43,671 ఉంది. వీరందరూ ఉచిత గ్యాస్‌ పథకానికి అర్హులే. అయితే వీరిలో సగం మందికి మాత్రమే గ్యాస్‌ పథకం అమలయ్యే అవకాశం ఉంది.

అలా ఎందుకని?
అర్హులైన పేదలు.. అంటే తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న వారందరికీ ఉచితంగా ఏడాదికి మూడు సిలెండర్ల గ్యాస్‌ పథకం అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పింది. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. ఈనెల 31 అంటే దీపావళి పండుగ రోజున పథకం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన ఉంటుందనేది మాత్రం స్పష్టం చేయలేదు. తెల్ల కార్డులు ఉండీ, గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే సరిపోతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారి పరిస్థితి ఏమిటనేది మాత్రం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న గ్యాస్‌ కనెక్షన్‌లు రాష్ట్రంలో 89లక్షలు ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దీపం పథకం కింద గతంలో ఇచ్చిన గ్యాస్‌ కనెక్షన్‌లు 59,43,671 ఉన్నాయి. ఇవన్నీ పేదవారి గ్యాస్‌ కనెక్షన్‌లే. వీరందరికీ ఉచిత గ్యాస్‌ ఇవ్వాల్సిందే.
ఉచిత గ్యాస్‌కు రూ. 2,684 కోట్లు.. ఏ లెక్కన...
ఉచిత గ్యాస్‌ పథకానికి ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న వారంతా ఉచిత గ్యాస్‌కు అర్హులైనట్లైతే ఏడాదికి సుమారు రూ. 5,200 కోట్లు ఖర్చవుతుంది. అలా కాకుండా సగానికి తగ్గించి చెప్పారంటే ఇందులో మతలబు ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అంటే తప్పకుండా సగం మంది తెల్ల రేషన్‌ కార్డుల వారికి గ్యాస్‌ పథకం అమలు కాదని పేదలు భావిస్తున్నారు.
ఉచిత గ్యాస్‌ డబ్బులు నేరుగా ఇవ్వొచ్చు కదా..
ఏడాదికి మూడు సిలెండర్ల గ్యాస్‌ ఉచితంగా ఇస్తామంటున్న ప్రభుత్వం గ్యాస్‌ కనెక్షన్‌ దారులు కొనుగోలు చేసుకునే విధంగా డబ్బలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్స్‌కు వేస్తే వారే గ్యాస్‌ ఎప్పుడు కావాలో అప్పుడు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం నాకు ఇంట్లో ఉన్న సిలెండర్‌ ఇటీవలే గ్యాస్‌ తీసుకోవడంతో మరో ఖాళీ సిలెండర్‌ లేదు. ఈనెల 29 నుంచి గ్యాస్‌ బుక్‌ చేసుకుంటేనే వారికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ముందే బుక్‌ చేసుకుని ఖాళీ సిలెండర్‌ లేక బుక్‌ చేసుకోని వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. ఈ విషమై ఏ అధికారి కూడా సమాధానం ఇవ్వడం లేదు.
డీబీటీ అంటేనే ప్రభుత్వం నేరుగా ఇచ్చే డబ్బులు కదా...
డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పద్ధతి ద్వారా డబ్బులు బ్యాంకు అకౌంట్లకు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అటువంటప్పుడు నేరుగా ప్రభుత్వమే ఇవ్వకుండా ఆయిల్‌ కంపెనీల వారి ద్వారా ఎందుకు ఇప్పిస్తున్నది. పైగా గ్యాస్‌ సిలెండర్‌ ప్రస్తుతం రూ. 825.50లు ఉంటే ఉచిత గ్యాస్‌ పథకం కింద ఇచ్చే గ్యాస్‌ సిలెండర్‌కు రూ. 894.92లు ఎందుకు చెల్లించాలని లబ్థిదారులుగా భావిస్తున్న వారు అడుగుతున్నా సమాధానం లేదు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు, ఆగస్ట్‌ నుంచి నవంబరు వరకు, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడు దఫాలుగా గ్యాస్‌ పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారులు కోరుకునేది మాత్రం ఆ మూడు మాసాలకు సంబంధించి ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ ఇస్తామంటున్న ప్రభుత్వం డబ్బులు డీబీటీ ద్వారా ముందుగా ఇస్తే తామే గ్యాస్‌ను కొనుగోలు చేసుకుంటామని లబ్ధిదారులు అడుగుతున్న దాంట్లో తప్పేముందనేది పలువురి ప్రశ్న. దీనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు.
మంత్రి ఏమి చెబుతున్నారంటే..
సివిల్‌ సప్లైస్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఉచిత గ్యాస్‌ పథకం కింద మీ సెల్‌ ఫోన్‌కు ఒక మెసేజ్‌ వస్తుంది. ఆ మెసేజ్‌లో మీరు ఉచిత గ్యాస్‌ పథకానికి ఎంపికయ్యారని ఉంటుంది. అప్పుడు మీరు లబ్దిదారు అని తెలిసి పోతుంది. మెసేజ్‌ రాని వారు అర్హులు కాదని, ఎవరికైనా సందేహాలు ఉంటే గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్‌ రిడ్రెసెల్‌ సిస్టమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని, అక్కడ తగిన సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు.
Next Story