ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. సజ్జలే మాస్టర్‌మైండా!
ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపణలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల కూసాలను కదిలించింది. ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరన్నది తేలలేదు. కానీ ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు మాత్రం కొందరు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతోనే తాము ఈ పని చేశామన్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆంధ్రలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అనేక మంది కీలక నేతల ఫోన్‌లను ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవన్నీ రికార్డ్ అయ్యాయి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. వారి ఫోన్ కాల్స్, వ్యక్తి సంభాషణలు అన్నీ రికార్డ్ చేయబడ్డాయని, వాటి ఆధారంగా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనకున్న మాస్టర్‌మైండ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా ఆయన ఆరోపణలు చేశారు.
చర్చంతా దానిపైనే
ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజే మాణిక్య వరప్రసాద్ ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆయన అంటున్నట్లు నిజంగానే ఆంధ్రలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఎవరూ ఎందుకు ఏం చెప్పలేదు? ఈ వ్యవహారాన్ని మాణిక్య ప్రసాద్ ఇన్నాళ్లూ ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇన్నాళ్లూ విచారణ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ఆయనకు ఇది గుర్తొచ్చిందా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
అవన్నీ తప్పుడు ఆరోపణలే
డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన ఆరోపణలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అధికారం తమది అని తెలిసి వెంటనే వైసీపీ టార్గెట్‌గా తప్పుడు కేసులు నమోదు చేయడానికి టీడీపీ పావులు కదుపుతోందని, వాటిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒకటని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడానికి వరప్రసాద్ దగ్గర ఎటువంటి ఆధారం ఉంది? ఉంటే ఆ ఆధారం ఏంటో చూపి ఆయన ఫిర్యాదు చేయొచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలనీ, కేవలం వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలన్న నెపంతోనే వాళ్లు ఇలా చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.