
తిరుమల ఆనందనిలయం
TIRUMALA | అనంత స్వర్ణమయం దాతలకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యం
పుష్కరకాలానికి ఆ ప్రాజెక్టు పేరు వినిపించింది. బంగారు కానుకలు ఇచ్చిన దాతలకు వీఐపీ దర్శనం దక్కనుంది.
తిరుమల శ్రీవారి ఆనందనిలయం, అంతర ప్రాకారానికి బంగారురేకులు అమర్చాలనేది టీటీడీ సంకల్పం. దీనికోసం అప్పటి టీటీడీ చైర్మన్ డీకే. ఆదికేశులు నాయుడు "ఆనందనిలయం అనంతస్వర్ణమయం" ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి నగదు, బంగారు టీటీడీ స్వీకరించింది. అనివార్యకారణాల రీత్యా ఆ ప్రాజెక్టు 2008లో ఆగిపోయింది. అయితే,
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం (AAD) కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం అర్చనానంతర దర్శనసేవ లేకపోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దాతలకు విరాళం పాసుబుక్ జారీ చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది.
దాతలకు సౌకర్యాలు
తిరుమల శ్రీవారి ఆలయానికి బండారు రేకులు అమర్చే ''ఆనంద నిలయం అనంత స్వర్ణమయం'' పథకానికి కానుకలు ఇచ్చిన దాతలకు కల్పించే సదుపాయాలు ఇవి.
-తిరుమలలో ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ గతంలో రద్దు చేశారు. దీనికి బదులుగా గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి మూడు రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలకు అనుమతిస్తారు.
- రూ.2,500 టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు.
- సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు.
- దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు.
- దాతల మొదటిసారి దర్శన సమయంలో ఐదు గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వనున్నారు.
- సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.
- విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
Next Story