ఎన్నికల కేసుల్లో పిన్నెల్లి నిందితుడు. పోలీసులు రెండు రోజులుగా వేట ప్రారంభించారు. పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్నారు. న్యాయం గెలిచిందని పిన్నెల్లి పోస్టు.


మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తమను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టులో గురువారం సాయంత్రం దాఖలు చేసిన లంచ్‌ మోషన పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. తము ఏ తప్పూ చేయలేదని, పోలీసులు తమను అరెస్టు చేసేందుకు వెంటాడుతున్నారని, అరెస్టు చేయకుండా బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు. వారి అభ్యర్థనలను మన్నించిన కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్డు ఆదేశించింది. అయితే కొన్ని షరతులు విధించింది. పిటీషనర్‌ అయిన పిన్నెల్లిపై నమోదైన కేసుల దర్యాప్తును కానీ, సాక్షులను కానీ ప్రభావితం చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వృధా అయిన పోలీసుల ప్రయాస
కాగా ఈ నెల 13న రెంటచింతల మండలం పాల్వాయిరైల్వే గేటు పోలింగ్‌ స్టేషన్‌లోకి నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయగా, సీసీ కెమేరాల్లో రికార్డు అయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు ఆదేశాలిస్తూ పాల్లాయి రైల్వేగేటు ఘటనకు బాధ్యులైన వైఎస్‌ఆర్‌సీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు. పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి వెతుకుతుండగా పిన్నెల్లి తరపున న్యాయవాదులు బెయిల్‌ పిటీషన్‌ను దాఖలు చేసి, బెయిల్‌కు ఆమోదం పొందారు. దీంతో గత మూడు రోజులుగా పోలీసుల ప్రయత్నం వృధా ప్రయాసగా మారింది.
న్యాయం గెలిచిందని ఫేస్‌బుక్‌లో పోస్టు
ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరడంపై గంట క్రితం మాచర్ల ఎమ్మెల్యే వైఎస్‌ఆర్‌సీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. న్యాయం గెలిచిందని, హైకోర్టు జూన్‌ 5వరకు తనను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్టు చేశారు. మేము సిద్ధమంటూ ఎన్నికల ప్రచారంలో వ్యానుపై జగన్‌ పొటో పట్టుకొని పాల్గొన్న ర్యాలీ ఫొటోను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం గమనార్హం. పిన్నెల్లితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌ పిటీషన్‌లపై ఆదేశాలు జారీ చేసింది.
Next Story