కౌంటింగ్ రోజున కాలు బయటపెట్టొద్దు.. వీధుల్లో వీరంగం వద్దు!
x

కౌంటింగ్ రోజున కాలు బయటపెట్టొద్దు.. వీధుల్లో వీరంగం వద్దు!

నరాలు తెగే ఉత్కంఠ ఓవైపు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరోవైపు... ఏమాత్రం అలజడి, ఆందోళనకి తావులేకుండా ఓట్ల లెక్కింపును చేపట్టేందుకు ఎన్నికల సంఘం నడుంకట్టింది..


నరాలు తెగే ఉత్కంఠ ఓవైపు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరోవైపు... ఏమాత్రం అలజడి, ఆందోళనకి తావులేకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును చేపట్టేందుకు ఎన్నికల సంఘం నడుంకట్టింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా చీమచిటుక్కుమన్నా పసిగట్టేలా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను, పారామిలిటరీ దళాలను రంగంలోకి దించుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి విషయాన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా దగ్గరుండి చూస్తున్నారు. తగిన విధంగా సూచనలు సలహాలు ఇస్తున్నారు.

కౌంటింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకోవాలన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల సంఘం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటుకి ఒకే విడతలో మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల తర్వాత హింసాకాండ చెలరేగడంతో ఎన్నికల సంఘం ఉలిక్కిపడింది. నాలుగైదు జిల్లాలు భగ్గుమన్నాయి. దీంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం ఎన్నికల ఫలితాల సందర్భంగానూ అల్లర్లు చెలరేగవచ్చునని భావించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎన్నికల ఫలితాలను ఏ మాత్రం ఆలస్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కూడా పూర్తిస్థాయిలో పాటించాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు రోజు ఇవిఎమ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పాస్‌లు లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పవర్‌ బ్యాక్‌ అప్‌, ఫైర్‌ సేప్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుతున్నారు. అత్యవసర ఆరోగ్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ట్రైనింగ్ పొందిన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్‌ వంటి పరికరాలను ముందుగానే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేర్చుతున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆయా ఇవిఎమ్‌లపై మార్కు చేస్తూ వెంటనే వాటిని సీల్‌ వేస్తారు. వాటన్నింటిని భద్రపరుస్తారు.
"ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయం. డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్ఛితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తాం" అన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా.
రాష్ట్రానికి పారా మిలిటరీ దళాలు...
పోలింగ్‌ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో పెట్టుకొని ఓట్ల లెక్కింపు అనంతరం అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు.రా ష్ట్రానికి 20 పారామిలిటరీ బలగాలను రప్పిస్తున్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడెంచల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు భౌతికంగా రెండుసార్లు స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించే అవకాశం ఉంది.
పల్నాడులో పరిస్థితులు అదుపులో ఉన్నాయని, పోలింగ్‌ అనంతరం ఘర్షణలపై తగిన చర్యలు తీసుకున్నామని మీనా చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌ రోజున మద్యం షాపులకు సెలవు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి అనుమానితులను, పాత నేరస్తులను నియంత్రించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నందున ప్రజలు ఇళ్లకే పరిమితమైతే బాగుంటుందని, వీధుల్లోకి వచ్చి వీరంగం వేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పోలీసులు.


Read More
Next Story