వరుసగా ఐదుసార్లు అందలమెక్కిన డమ్మీ అభ్యర్థి!
అనూహ్యంగా గెలిచిన సత్యం మాస్టారు. నిరాడంబర జీవితానికి నిలువటద్దం ఆయన. సైకిలు, కాలినడకకే అధిక ప్రాధాన్యం. 99వ ఏట కన్నుమూసిన రెడ్డి సత్యనారాయణ.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఊహించనూ లేరు. ఆ కోవలోకే వచ్చారు రెడ్డి సత్యనారాయణ మాస్టారు. అది 1983వ సంవత్సరం. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం హోరెత్తుతున్న రోజులవి. టీడీపీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది అప్పుడే. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం సీటును అల్లు భానుమతికి కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆమె టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
డమ్మీగా ఎవరితో వేయించాలి? అని ఆలోచిస్తున్న ఆ పార్టీ నాయకులకు ఉపాధ్యాయుడైన రెడ్డి సత్యనారాయణ గుర్తొచ్చారు. ఆయనతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. నామినేషన్ల పరిశీలనలో అసలు అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. నిబంధనల ప్రకారం డమ్మీ అభ్యర్థే అసలు అభ్యర్థి అయ్యారు. ఆపై ఎమ్మెల్యేగానూ గెలుపొందారు.
అంతే.. ఆయన ఆ తర్వాత ఒకట్రెండు సార్లు కాదు.. ఏకంగా ఐదుసార్లు అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983, 1985, 1989, 1994, 1999ల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా ఆయన మంత్రి (పశుసంవర్థక శాఖ) కూడా అయ్యారు. తన 99వ ఏట అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన మంగళవారం కన్నుమూశారు.
నిరాడంబరతకు నిలువటద్దం..
స్వతహాగా ఉపాధ్యాయుడైన సత్యం మాస్టారు అత్యంత నిరాడంబరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సైకిల్పై వెళ్తూ అందరినీ ఆశ్చర్య పరిచేవారు. మంత్రి పదవిని అధిరోహించినా ఆయన తీరు మారలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా బస్సులు, ఆటోలనే ఆశ్రయించేవారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఆటోలను సైతం ఎక్కకుండా ఎంత దూరమైనా కాలినడకనే వెళ్లేవారు.
కాలికి సాదాసీదా చెప్పులు, చేతిలో గుడ్డ సంచితో వడవడిగా నడుచుకుంటూ పోయేవారు. ఆయనను చూసిన వారు.. రెడ్డి సత్యనారాయణ గారే కదా? ఎమ్మెల్యేగాను, మంత్రిగానూ పనిచేసి ఇలా నడిచి వెళ్లడమేంటి? అని ఆశ్చర్య పోయేవారు. మాజీ అయ్యాక పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన నడుచుకుని వెళ్లడమే తప్ప కార్ల కోసం చూడలేదు. ఎవరికైనా దారిలో తారసపడితే ఆయనను తమ కార్లలో ఎక్కించుకుని వెళ్లేవారు.
ఇలా ఆడంబరాలకు దూరంగా ఉండే వారు. అత్యంత నిరాడంబరతతో ఈ తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన నేతగా పేర్గాంచారు రెడ్డి సత్యనారాయణ. ఈయన మంత్రి పదవితో పాటు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్గా, రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబరుగా, టీడీఎల్పీ ఉప నాయకుడి పదవులను చేపట్టారు. గతంలో ప్రజారాజ్యంలో చేరిన ఆయన కొన్నాళ్లు ఆ పార్టీలో కొనసాగారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో కొనసాగుతున్నారు.
సెంచరీ మిస్సయారు మాస్టారు..
రెడ్డి సత్యనారాయణ ఇటీవలే 99వ పడిలోకి అడుగుపెట్టారు. ఇంత వయసొచ్చినా ఆయన ఆరోగ్యానికి డోకా లేదు. ఏనాడూ ఆనారోగ్యం బారిన పడలేదు. తన ఆరోగ్య రహస్యం నడకేనని చెబుతుండేవారు. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన తిరుగాడుతూనే ఉండేవారు. మరికొన్నాళ్లలో శత వసంతంలోకి అడుగు పెడతానని తనను కలిసే వారితో ఎంతో ఆనందంగా చెప్పేవారాయన. ఇంతలోనే ఆయన కన్నుమూశారని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.