ఓ నకిలీ ఐపీఎస్‌ అధికారి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ పర్యటన సెక్యూరిటీ విధుల్లో పాల్గొనడం హాట్‌ టాపిక్‌గా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఓ నకిలీ పోలీసు అధికారి వ్యవహారం తెరపైకొచ్చింది. తక్కువ ర్యాంకులో ఉన్న పోలీసు అధికారులుగా నకిలీ అవతారం ఎత్తుతుంటారు. కానీ ఆ వ్యక్తి ఏకంగా పెద్ద అధికారి అవతారమే ఎత్తారు. ఎస్‌ఐ గానో, సీఐ, డీఎస్పీగానో కాకుండా ఏకంగా ఐపీఎస్‌ అధికారిగా ఆయన అవతారం ఎత్తారు. అంతటితో ఆగని ఆ వ్యక్తి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో పాల్గొనడం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో భద్రత విధుల్లో ఆయన పాల్గొనడంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు షాక్‌కు గురయ్యారు. సదరు నకిలీ ఐపీఎస్‌ అధికారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ, బాగోజాల వంటి పలు ప్రాంతాల్లో ఆయన టూర్‌ చేశారు. జోరు వానలను సైతం లెక్క చేయకుండా గిరిజన గ్రామాల్లో కలియ తిరిగారు. పలు రోడ్ల నిర్మాణాల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున భద్రత చర్యలు తీసుకున్నారు. నకిలీ ఐపీఎస్‌ అధికారి కూడా భద్రత విధుల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాష్‌ ఈ నకిలీ ఐపీఎస్‌ అధికారిగా అవతారం ఎత్తినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. లోతైన విచారణ దిశగా పోలీసులు నిమగ్నమయ్యారు.
Next Story