మరి ముఖ్యంగా కలెక్టర్ల సమావేశాలు ప్రధాన హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ప్రభుత్వ హయాంలో కేవలం ఒకే ఒక సారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఇలా ఒకే ఒక సారి కలెక్టర్ల కాన్‌ఫెరెన్స్‌లు నిర్వహించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలచి పోయారనే టాక్ జోరుగా సాగుతోంది.
కలెక్టర్ల కాన్ఫెరెన్సులు నిర్వహించడం సర్వసాధారణం. ఏ ప్రభుత్వమైన వీటిని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే జిల్లాలో శాంతి భద్రతల సమస్యలపై కూడా జిల్లాల ఎస్పీలతో సమీక్షలు నిర్వహిస్తారు. ఏడాదికి ఒక సారి కానీ, ప్రతి ఆరు మాసాలకు కానీ, మూడు మాసాలకు కానీ ఒక సారి తప్పకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫెరెన్సులు నిర్వహిస్తారు. జగన్ కంటే ముందుకు 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు కలెక్టర్ల కాన్ఫెరెన్సులు నిర్వహించారో లెక్కే లేదు. హైదరాబాద్ నుంచి పాలన సాగించినప్పటికీ విజయవాడ వచ్చి ఈ సమీక్షలు నిర్వహించే వారు. ప్రభుత్వ భవనాల సదుపాయం అందుబాటులో లేక పోవడంతో ప్రవేటు హోటళ్లు, కన్వెషన్ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేసే వారు. తర్వాత ఉండవల్లిలోని తన నివాసం వద్ద ప్రజావేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచే సమీక్షలు నిర్వహించే వారు. ప్రభుత్వ సేవలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి, క్షేత్ర స్థాయిలో వస్తున్న సమస్యలేమిటి, వాటిని అధికమించాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశాలతో పాటు శాంతి భద్రతల అంశాలపైన కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించి, సూచనలు, సలహాలు ఇచ్చే వారు.
కానీ గత జగన్ ప్రభుత్వం వీటిపైన పెద్దగా ఆసక్తి చూప లేదు. ఐదేళ్ల కాలంలో ఒకే ఒక సారి నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లల్లో 2019 జూన్‌లో ఒక సారి నిర్వహించారు. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికలో దీనిని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించారు. తొలి రోజు ప్రారంభం సందర్భంగా నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజావేదిక భవనం నుంచే మొదలు పెడుతున్నాం. ప్రజావేదికలో ఇదే కలెక్టర్ల చివరి సమావేశం. ఇవి అయిపోయిన తర్వాత దీనిని కూల్చి వేస్తామని చెప్పి ప్రజావేదికను కూల్చి వేయించారు. అదే మొదటి, చివరి కలెక్టర్ల కాన్ఫెరెన్స్. తర్వాత ఇక నిర్వహించింది లేదు. మధ్యలో పథకాలు అమలుకు సంబంధించి వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించే వారు.
ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల మీద ముఖ్యమంత్రులు, మంత్రులు ఆయా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం సర్వ సాధారణం. పాలసీ తయారీకి సంబంధించిన అంశాల మీద ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షలు నిర్వహిస్తారు. అయితే వాటిని అమలు చేయడంలోను, ప్రజలకు చేరువ చేయడంలోను జిల్లాల కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలు వారికే తెలుస్తుంటాయి. వాటిని అధికమిస్తూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తుంటారు. అందువల్ల కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫెరెన్సులను ప్రతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. కానీ ఆ రకమైన ప్రాముఖ్యత గత ప్రభుత్వంలో లోపించిందనే విమర్శలు ఉన్నాయి. నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇదే అంశంపై ఒక టీవీ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన రంగానికి పట్టుగొమ్మలాంటి కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫెరెన్సులు జగన్ ప్రభుత్వంలో కేవలం ఒకే సారి నిర్వహించారని వెల్లడించడం గమనార్హం.