
SWEET POTATO | గణుసుగడ్డే తింటే గడుసుతనమూ ఎక్కువే!
చిలకడదుంప.. పేదల పాటిట పౌష్టికాహారమని డాక్టర్ స్వామినాధన్ ఫౌండేషన్ ప్రకటించింది. అవును.. ఇది నిజమేనని ఐక్యరాజ్యసమితీ కూడా అంటోంది..
పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళుతుండగా మనకు అక్కడక్కడా ఓ తీగజాతి పంట కనపడుతుంది. పెద్ద ఆకులు నేలను పాకి ఉంటుంది. ఆ ఆకును తొలగించి నాగలితో భూమిని దున్నుతుంటే వెనకుండే మహిళా రైతులు భూమి నుంచి ఎర్రటి గడ్డల్ని పైకి తీసి మట్టి దులిపి గంపల్లో వేస్తుంటారు. కొందరైతే తట్టల్లోకి ఎత్తి ఆ పక్కనున్న ఎడ్ల బండిలో పోస్తుంటారు. ఆ గడ్డే గణుసుగడ్డ. పోషకాల అడ్డా అంటున్నారు. చాలామంది ఇళ్లల్లో, దొడ్లల్లో కూడా పెంచుతుంటారు గాని తీగలు బలహీనంగా ఉండి దుంపలు పెద్దగా ఊరేవి కాదు. ఇప్పుడిదంతా ఎందుకంటే
పౌష్టికాహార లోపంతో, అర్థాకలితో బాధ పడుతున్న పేద వర్గాలున్న ప్రాంతాలలో ఈ దుంపనే సిఫార్సు చేసినట్టు డాక్టర్ స్వామి నాధన్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు వివరించారు.
గణుసుగడ్డ చరిత్ర ఇదీ...
గణుసుగడ్డకు సుమారు 5వేల ఏళ్ల చరిత్ర ఉంది. చిలగడ దుంపను ఆంగ్లంలో Sweet potato అంటారు. అది కన్వాల్వులేసీ (Convolvulaceae) కుటుంబానికి చెందిన తీగమొక్క. దాని శాస్త్రీయ నామం ఐపోమియా బటాటాస్ (Ipomoea batatas). దక్షిణ లేదా మధ్య అమెరికాలో పుట్టింది. పశు గ్రాసంగా పెంచారు. అక్కడి నుంచి కరీబియన్ దీవులకు, దక్షిణ అమెరికాకు వ్యాపించింది. క్రిస్టఫర్ కొలంబస్ 1492 లో స్వీట్ పొటాటోను యూరోప్ కి తీసుకురాగా, పోర్చుగీజ్ అన్వేషకులు 16వ శతాబ్దంలో స్వీట్ పొటాటోను ఆఫ్రికా, భారతదేశం, దక్షిణాసియా, తూర్పు ఇండీస్ కి తీసుకువచ్చారు. 16వ శతాబ్దంలో మెక్సికో నుండి ఫిలిప్పీన్స్ దీవులకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. మలావీ కూడా స్వీట్ పొటాటో ప్రముఖ ఉత్పత్తిదారుగా ఉంది.
ఏమిటీ అర్థాకలి...
కడుపు నింపుకుంటున్నా ఆకలి తీరనట్టుండే తీరుపై (హిడెన్ హంగర్)పై స్వామి ఫౌండేషన్ పరిశోధనలు చేస్తోంది. వంటికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లు లేకపోవడమే హిడెన్ హంగర్‌కు కారణం. ఈ పరిస్థితుల్లో విటమిన్ల కోసం టాబ్లెట్లు వాడడం కన్నా చిలకడ దుంప లాంటి ప్రకృతి ఆహార పదార్ధాలే ఎక్కువ మేలు చేస్తాయని ఫౌండేషన్‌కు చెందిన వీరభద్రం చెప్పారు. అందువల్లే ప్రపంచంలోని ఏడు ముఖ్యపంటల్లో ఇదొకటైంది. మొదటి ఆరింటిలో గోధుమ, వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, బార్లీ, కర్రపెండలం ఉంటే ఏడోదిగా చిలకడదుంప ఉంది.
ఆరు జిల్లాలలో సాగు...
ఉద్యాన శాఖ లెక్కప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అంతో ఇంతో ఉన్నా ప్రధానంగా ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో చిలకడ దుంప సాగవుతుంది. కూరగాయల్లో ఒకటిగా దీన్ని వాడుతుంటారు. పశుగ్రాసానికి, ఆల్కహాల్ తయారీలో కూడా వినియోగిస్తారు. హెక్టార్‌కు 20, 25 టన్నుల దిగుబడి ఇస్తుందని అంచనా. గరిష్టంగా పంట కాలం 120 రోజులు. తక్కువ నీరు, సాగు వ్యయంతో పండించవచ్చు. సస్యరక్షణ కూడా సులువే.
పోషకాలు ఎక్కువే...
టైప్–2 చక్కెర వ్యాధి ఉన్న వారిలో ఇన్సులిన్‌ను పెంపొందించేందుకు తెల్ల రకం చిలకడదుంపలు ఉపయోగపడతాయి. కాల్షియం ఎక్కువ. ఏ, బీ, సీ, కే విటమిన్లు ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కూడా ఈ దుంపుల్లో ఉంటుందని న్యూట్రీషియన్ డాక్టర్ భార్గవ్ చెప్పారు. కాన్సర్ నివారణకు, చర్మం ముడతలు పడకుండానూ నివారిస్తుంది. ఊపిరి తిత్తుల సమస్యలున్నవాళ్లు ఈ దుంపను వాడితే యాంటీఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఈ దుంపల్లోని పీచుపదార్ధం సహజంగానే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ దుంపలలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే ఇవి కడుపు ఉబ్బరం కలిగిస్తాయి. అయితే అవి శరీరంలో ఉష్ణ తాపాన్నీ, జ్వరాన్నీ తగ్గిస్తాయి. మూత్రకారిగా, విరేచనకారిగా పనిచేస్తాయి. పురుషుల సామర్థ్యాన్ని పెంచుతాయి. అరికాళ్ళ మంటలు, మూత్ర పిండాలలో, మూత్ర సంచిలో ఏర్పడే రాళ్ళు, మూత్రం మంటతో చుక్కచుక్కగా పడడం (Strangury) వగైరాలను పోగొడతాయి. తేలుకాటులో బాధా నివారణకు ఈ తీగ ఆకులను మెత్తగా పేస్టులా చేసి రాస్తే ప్రయోజనం ఉంటుంది.
స్వీట్ పొటాటోలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలున్నందున వైద్యులు, పోషకాహార నిపుణులు దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. స్వీట్ పొటాటోను పోషకాహారంగా పరిగణించే అనేక పరిశోధనలు ఇప్పటికీ సాగుతున్నాయి.
Next Story