ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్..
x

ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్..

ఆంధ్రలో సమస్యాత్మక నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తోంది. ఆ నియోజకవర్గాలు ఏవంటే..


ఆంధ్రలో ఎన్నికలకు వారం రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఇందులో భాగంగా ఎన్నికల కోసం చేసిన అన్ని ఏర్పాట్లును తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఏర్పాట్లలో ఏమాత్రం అవకతవకలు జరగకుండా చూసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈసారి ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా ఎక్కడిక్కడ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మీనా.

స్వయంగా పర్యవేక్షణ

ఇందులో భాగంగానే ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్‌లను, స్ట్రాంగ్ రూమ్‌లను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మీనా చెప్పారు. అంతేకాకుండా వీటి విషక్ష్ంలో అధికారులకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నామని, ఈసారి ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని వివరించారాయన. అందుకోసమే అదనపు భద్రతా చర్యలు చేపడుతూ ఎక్కడిక్కడ అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేస్తున్నామని, అందుకే ఆయా ప్రాంతాల్లో పోలింగ్ తీరును వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయా నియోజకవర్గాల పేర్లను కూడా కొన్ని రోజుల క్రితమే మీనా ప్రకటించారు.

ఆ 14 నియోజకవర్గాలపైనే ఫోకస్

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాలుగైదు రోజుల్లోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం పలువురు అధికారులను బదిలీ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక పోలీసు బలగాలను నియమించింది. నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, గురజాల, మాచర్ల, తిరుపతి, ఆళ్లగడ్డ, విజయవాడ సెంట్రల్, చంద్రగిరి, తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం.

కేంద్ర బలగాలతో పహారా..

రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రలను గుర్తించిన ఎన్నికల సంఘం అక్కడ పటిష్ట భద్రత కల్పించడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 12,438 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు గుర్తించారు. వాటితో పాటుగా మొత్తం 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో అదనపు కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఎటువంటి సంఘటిత చర్యలు జరగకుండా పోలీసుల, కేంద్ర బలగాలు ముందస్తు చర్యలు తీసుకోనున్నాయని, ఆ దిశగా ఇప్పటికే దాదాపు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మీనా వెల్లడించారు.

Read More
Next Story