మందుబాబులకు  గడ్డు రోజులు.. మద్యం అమ్మకాలపై ఆంక్షలు
x

మందుబాబులకు గడ్డు రోజులు.. మద్యం అమ్మకాలపై ఆంక్షలు

ఆంధ్రలోని మందుబాబులకు ఎన్నికల సంఘం పిడుగులాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది.


(శివరామ్)

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు గడ్డు రోజులు వచ్చేశాయి. ఎన్నికలొచ్చాయి ఎంచక్కా రాజకీయ నేతలు ఇచ్చే ఉచిత మద్యం తాగేయవచ్చు అనుకుంటే ఒక్కసారిగా నిబంధనలు కఠినమైపోయాయి. వైన్ షాపులపై ఎన్నికల సంఘం నిఘా పెరిగిపోయింది. ఇష్టమైన బ్రాండ్‌ల సంగతి దేవుడెరుగు రాత్రి ఏడైతే కొన్ని షాపుల్లో అమ్మకాలే ఆపేస్తున్నారు. దీంతో మందు బాబులకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయ. చచ్చినట్టు అధిక ధరలకు బార్‌లకు వెళ్లి కొనుక్కోవాల్సి వస్తుంది.

గత ఏడాది ఎంతో అంతే అమ్మాలి

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఎన్నికల సమయంలో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లో మద్యం అమ్మకాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది . ఎంసీసీ నిబంధనల ప్రకారం గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపులో ఎంత మేర అమ్మకాలు జరిగాయో అంత మేరకే ఈ ఏడాది కూడా అమ్మకాలు జరపాలని ఎన్నికల సంఘం ప్రొహిబిషన్ శాఖాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన మద్యం అమ్మకాల పరిమాణాన్ని బట్టి రీటైల్ దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యం పరిమాణాన్ని అధికారులు నిర్ణయిస్తున్నారు.

డిపోల వద్ద తనిఖీలు

అదే విధంగా ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరఫరా అయ్యే మద్యం సప్లైపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. వైసీపీ పెద్దలు తాము నియమించిన ఆదికారుల ద్వారా ఇక్కడి నుంచి నేరుగా వైసీపీ అభ్యర్దులకు మద్యం పంపుతున్నారంటూ ఫిర్యాదులు వెళ్లాయి. వైసీపీ ప్రభుత్వం ఎనిమిది శాతం కమీషన్ ఇచ్చి మరీ నియమించుకొన్న అస్మదీయ సంస్ధ ఆర్‌ఆర్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యాన్ని దుర్వినియోగం చేయకుండా నివారించడానికి ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికితోడు వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో మద్యం, బీరుకు డిమాండ్ భారీగా ఉంది. ఇదే అదునుగా మద్యం రిటైల్ దుకాణాలు ఇష్టానుసారంగా విక్రయాలు జరుపుతుండటంతో ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి భారీగా మద్యం నిల్వలను ఎత్తివేయాల్సి వస్తోంది.

ప్రతి జిల్లా నుంచి నివేదికలు

ఈ పరిస్థితుల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి మద్యం నిల్వల ఎత్తివేత, అమ్మకాలపై ప్రతిరోజూ జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో పాటు నిల్వల ఎత్తివేతపై కూడా ఆంక్షలు విధించారు. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్ నేరుగా డిపోకి వెళ్లి నిల్వల పరిస్ధితిని పరిశీలించి వ్యవహారాలను పర్యవేక్షించారు.

దీంతో నిన్న ఉన్న షాపు నేడు ఎందుకు మూత పడుతుందో ? ఏమి జరిగిందో? అర్థంకాక మద్యం ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. మే 13న రాష్ట్రంలో పోలింగ్ జరుగనుండడం, మరో ఐదు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం కోసం నేతలు రోడ్డెక్కుతున్నారు. దీంతో మద్యం వినియోగం పెరుగుతోంది. అక్రమ నిల్వలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గం పరిధిలో గడ్డి వాములో దాచిన 60 లక్షల రూపాయల యానం మద్యాన్ని అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రతిరోజూ అక్రమ మద్యం పట్టుపడుతూనే ఉంది. నిఘా మరింత పెరిగితే మరిన్ని కష్టాలు తప్పవని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story