ఈ అబ్జర్వర్ల కంటపడితే అభ్యర్థిత్వమైనా రద్దే
x
విజయవాడకు వచ్చిన రామ్‌మోహన్ మిశ్రా

ఈ అబ్జర్వర్ల కంటపడితే అభ్యర్థిత్వమైనా రద్దే

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను అరికట్టడానికి ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ. పార్టీలు, అభ్యర్థులపై స్పెషల్‌ ఫోకస్ పెట్టనున్న అబ్జర్వర్లు..


ఎన్నికలు చేరువవుతున్న కొద్దీ ఎన్నికల సంఘం అధికారులు మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రలో ఎన్నికల వేడి ఓవైపు పార్టీ అధినేత ప్రత్యేక యాత్రలతో, మరోవైపు ఎన్నికల అధికారులు కీలక ఆదేశాలతో అమాంతం ఆకాశాన్నంటుంతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలకు కేంద్ర బలగాలను పంపిన జాతీయ ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల అబ్జర్వర్లను కూడా రంగంలోకి దింపింది. పార్టీలు, అభ్యర్థులపై వీరు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రకు ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్‌గా నియమితులైన రామ్‌మోహన్ మిశ్రా.. విజయవాడకు చేరుకున్నారు.

మే 13న ఆంధ్ర ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశమంతటా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ఈ నిబంధనలను పలు పార్టీలు ఉల్లంఘించాయంటూ అనేక ఫిర్యాదులు ఎన్నికల సంఘం ముందుకు చేరాయి. దీంతో రంగంలోకి దిగిన ఈసీ ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల వేళ ఎక్కడా హింస, దాడులు, తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు, ప్రసంగాల్లో పరుష పదజాల వాడకం, సోషల్ మీడియా వేదికగా నిందాపూర్వక పోస్ట్‌లు పెట్టడం వంటి చర్యలను అడ్డుకోవడం, వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ అబ్జర్వర్ల పని. ఇందుకోసం జాతీయ ఎన్నికల సంఘం.. ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. వారిలో ఒకరైన రామ్‌మోహన్.. విజయవాడకు చేరుకోగా.. మిగిలిన ఇద్దరు ఈరోజు(మంగళవారం) ఆంధ్రకు రానున్నారు. బుధవారం నుంచి వీరు ముగ్గరు ఆంధ్రలో విస్తృతంగా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పార్టీలు, అభ్యర్థులపై ప్రత్యేక అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసినా వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా ఈ ప్రత్యేక అధికారులు చూసుకుంటారు. అంతగా అవసరం అయితే సదరు అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశంలో పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలను నిర్వహించడం కోసమే ఈసీఐ ఈ కఠిన చర్యలు తీసుకుంటుందని, కొందరు తమ స్వార్థం కోసం చేసే తప్పులు ప్రజలపై భారం కాకూడదనే ఈ చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Read More
Next Story