చంద్రబాబు పర్యటనలు రద్దు.. ఆంధ్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఈరోజు ఇలా..
ఆంధ్రలో ఎన్నికల ప్రచారాల జోరు పెరుగుతోంది. ప్రచారాల్లో ప్రతి పార్టీ దూకుడు పెంచేసింది. ఈరోజు ఎవరు ఎక్కడ ప్రచారం చేయనున్నారంటే..
ఆంధ్రలో ఎన్నికల ప్రచారాల జోరు రోజురోజుకు అధికం అవుతోంది. ప్రత్యర్థుల విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ.. ఎత్తులకు పైఎత్తులతో ఈ ప్రచారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థుల వైఫల్యాలను ప్రతి సభలో ఎండగడుతూ ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి శ్రమిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం చాలా తెలివిగా తటస్థ వైఖరిని కనబరుస్తున్నారు. అందుకే ఎన్నికలు అతి చేరువయ్యే కొద్దీ ఆంధ్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. పార్టీల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. మరి ఈ రోజు పార్టీల ప్రచారాలు ఎక్కడెక్కడ జరగనున్నాయంటే..
సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజానగరంలో ఈరోజు తొలి సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్‌లో, మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో జగన్ సభలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ సభలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఈరోజు కడప జిల్లాలోనే జరగనుంది. ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
అదే విధంగా బీజేపీ కూడా ఈరోజు తమ ప్రచారాన్ని ప్రెస్‌మీట్‌తో ప్రారంభించనున్నారు. ఉదయం 10:40 నిమిషాలకు బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ప్రెస్‌మీట్ జరగనుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఈ నెల 9న నరసన్నపేటలో జరగనున్న ‘ప్రజాగళం’ సభలో పాల్గొనాల్సి ఉంది. అదే విధంగా ఈరోజు శ్రీకాకుళంలో లోకేష్ ఆధ్వర్యంలో జరిగే ‘యువగళం’ సభ జరగాల్సి ఉంది. కానీ వీరిద్దరి షెడ్యూల్ బాగా బిజీ అయిపోవడంతో ఈ పర్యటనలు రద్దయ్యాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థి బగగు రమణమూర్తి తెలిపారు.