ఆ ఇద్దరు పెద్దల మధ్యే చిత్తూరు వార్
x
నారా చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఆ ఇద్దరు పెద్దల మధ్యే చిత్తూరు 'వార్'

చిత్తూరు ఎన్నికల సమరం అత్యంత రసవత్తరంగా సాగనుంది. పోటీ అంతా కూడా చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్యనే అన్నట్లుగా ఉంది ఇక్కడి వాతావరణం..


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ )


తిరుపతి: చిత్తూరు ఎస్సీ రిజర్వుడు పార్లమెంటు నియోజకవర్గ టిడిపి ఎంపీ అభ్యర్థిగా.. బాపట్ల కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గిమళ్ల ప్రసాదరావును తెరమీదకి తీసుకొచ్చారు. ఈయన పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు పుంగనూరు కు చెందిన న్యాయవాది ఎన్ . రెడ్డప్ప చిత్తూరు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన బాధ్యత అంతా మంత్రి పెద్దిరెడ్డి భుజస్కందాల పైనే ఉంటుంది. డి ప్రసాద్ రావును పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి నిన్న ఆ ప్రాంత కేడర్ కు పరిచయం చేశారు. గురువారం రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చెబుతున్నారు.

టిడిపి చిత్తూర్ పార్లమెంట్ అభ్యర్థిగా తెర మీదకు వచ్చిన దగ్గుమళ్ళ ప్రసాదరావు ఇన్కమ్ టాక్స్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పని చేస్తూ 2019 పదవి విరమణ చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్న గంజాం మండలం దగ్గుమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తి. బాపట్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి, రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ పరిసరాల్లో ఆయనకు నిర్మాణరంగ వ్యాపారం ఉన్నట్లు సమాచారం. "మాకు ఎన్ చంద్రబాబు నాయుడు చెప్పింది వేదం ఆయన చెప్పింది మేము చేస్తాం" ఏమి భయపడకండి " అని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి భరోసా ఇచ్చారు. "మిమ్మల్ని చంద్రబాబు మాకు అప్పగించారు మళ్లీ ఎంపీగా గెలిపి పంపించే బాధ్యత మాది" అని అన్నారు.

పేరుకే ... అభ్యర్థులు

చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు నామమాత్రంగా ఉంటారు. ఆధిపత్య పోరాటం ప్రధానంగా ఇద్దరి మధ్య సాగుతోంది. అందులో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు- జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉంటుంది. ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి తన ఆదిపత్యం నిలుపుకునే దిశగా సాగుతుంటారు.



ఎందుకు అంత పట్టుదల?

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ చీఫ్ ఎం. చంద్రబాబు నాయుడు, పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇద్దరు ప్రధాన నేతలు పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సెగ్మెంట్ పరిధిలోని పలమనేరులో ఎట్టి పరిస్థితుల్లో సత్తా చూపించాలని ఇక్కడి మాజీ ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి క్యాడర్ను సమయత్వం చేస్తున్నారు.

చిత్తూరు పార్లమెంట్...

1951లో ఏర్పాటైన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు జరిగిన 17 ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొమ్మిది సార్లు, టిడిపి అభ్యర్థులు ఏడుసార్లు గెలుపొందారు. వైయస్సార్ సిపి అభ్యర్థి గత ఎన్నికల్లో విజయం సాధించారు. 1984లో ఎంపీ ఝాన్సీ లక్ష్మి, మంత్రి ఎన్. అమర్నాథరెడ్డి తండ్రి 1996, 98, 99 లో వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో సినీ నిర్మాత, నటుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎం రెడ్డప్ప చేతిలో.. శివప్రసాద్ ఓటమి చెందారు. టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడుకు సహ విద్యార్థి అయిన మాజీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించారు. దీంతో కొత్త అభ్యర్థి అనివార్యమైంది.


బలమైన క్యాడర్ ఉన్నా...

చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చిత్తూరు, చంద్రగిరి, నగరి, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన నాయకత్వంతో పాటు కేడర్ కూడా ఉంది. అయినా ఎంపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఓరకంగా ఆ పార్టీకి మైనస్ అని పరిశీలకులు భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం మినహా ఆరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర వహించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారికి అవసరమైన సంపత్తి మొత్తం సమకూర్చడంలో మంత్రి పెద్దిరెడ్డి భాగస్వామ్యం అవుతారనేది ఆయన అనుచరుల నుంచి వినిపించే మాట. ఈ ఎన్నికల్లో కూడా అదే తరహా ఎత్తుగడ వేస్తున్నట్లు ఆయన మద్దతుదారుల్లో కనిపించే ధైర్యం అది

బాబు రాడు.. మేము వెళ్తాం..

"అసెంబ్లీకి చంద్రబాబు రారు. కుప్పంకు సరిగా వెళ్లరు" అందుకే కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలు మేము తీసుకున్నాం. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక సార్లు వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడచిన పదేళ్ల నుంచి కుప్పంను టార్గెట్ చేశారు. ఆ దిశగానే దృష్టి కేంద్రీకరించి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (భరత్) ను కుప్పంలోనే మకాం పెట్టించారు. భరత్ ను ఎమ్మెల్సీ చేయడం ద్వారా అభివృద్ధి పనుల్లో మమేకం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు పరిస్థితిని గ్రహించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో మూడు సార్లు పర్యటించారు. దీనిపై వైఎస్ఆర్సిపి నాయకులు కూడా సెటైర్లు వేశారు.

విద్యార్థి దశ నుంచి వారిద్దరు అంతే..

వీరిద్దరి మధ్య ఈ పోరాటం ఈనాటిది కాదు.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్న నాటి నుంచి ఎన్ చంద్రబాబు నాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది. ఆ కోవలోనే తాజా ఎన్నికల్లో కూడా ఎవరికి వారు సత్తా చాటుకునేందుకు వ్యూహలతో.. ఎత్తులు వేస్తున్నారు . ఎవరు ఎత్తులో ఫలిస్తాయో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది వేచి చూద్దాం.


Read More
Next Story