చంద్రబాబు వాట్సాప్ పాలన జనవరి 30 నుంచే
x

చంద్రబాబు వాట్సాప్ పాలన జనవరి 30 నుంచే

పరిపాలనపై చంద్రబాబు తన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి వాట్సాప్ పరిపాలనను అందుబాటు లోకి తేనున్నారు.


చంద్రబాబు అంటేనే హైటెక్. ఆయన విజన్ అంతటిది. ఆయన ఏది చెప్పినా వెస్ట్రన్ వరల్డ్ భాషలోనే చెబుతారు. అలాగే చేస్తారు. ప్రపంచ బ్యాంకు అధికారులు వాడే పదాలు ఆయన వాడతారు. శాచ్యురేషన్ మోడ్, మిషన్ మోడ్, టెక్నాలజికల్ హబ్, హార్టీకల్చర్ హబ్, గ్లోబల్ గవర్నెన్స్, లోకల్ మూడ్, ఇంటర్నేషనల్ హబ్.. అలా అనేకం ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ ఆయన ఖాతాలో పడింది. దేశంలోనే మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా పరిష్కారం చూపాలని నిర్ణయించారు. దాన్ని జనవరి 30 నుంచే అమల్లోకి తేవాలని ఆదేశించారు. ఇవాళ ప్రపంచాన్ని రూల్ చేస్తోంది వాట్సాప్ లు, ఫేస్ బుక్ లు, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలే. దాన్ని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు వాట్సాప్ పరిపాలనను అందుబాటులోకి తెచ్చారు.

ఏమిటీ వాట్సాప్ పాలన...
చంద్రబాబు వాట్సాప్ పాలన ఎలా ఉంటుందంటే...
ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌ ను తీసుకువచ్చారు. జనవరి 30 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దఫాలో 161 సేవలు పౌరులకు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ ను ఇస్తుంది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈ నంబరు వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 161 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేస్తారు.
ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే... ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుంది. ఉదాహరణకు ‘‘ భారీవర్షాలు, వరదల కారణంగా.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం, మీ ప్రాంతంలో విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతుల కారణంగా.. ఫలానా సమయంలో విద్యుత్తు సరఫరా ఉండదు, వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి, మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి, మీ ప్రాంతంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’’ లాంటి సమాచారాన్ని ఒకేసారి కోట్లమందికి చేరవేస్తారు. అయితే ఇవన్నీ ఇప్పటికే ప్రజలకు ఆయా విభాగాలు పంపిస్తున్నాయి. మరి ఇందులో కొత్తదనం ఏముందన్న అనుమానాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలకు దీన్ని వినియోగించబోవడమే ఈ వాట్సాప్ పాలన.
ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఏవైనా ఇవ్వాలనుకుంటే.. ఈ నంబరుకు మెసేజ్‌ చేస్తే... వెంటనే వారికి ఒక లింక్‌ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా పొందుపరిచి.. వినతిని టైప్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది? ఎవరివద్ద ఉందనేది తెలుసుకోవచ్చు.
తమ పరిధిలో మురుగు కాలవల లీకేజీలు, రోడ్లు గుంతలు వంటివి ఫొటోలు తీసి పెట్టొచ్చు. వాతావరణ కాలుష్యంపైనా ఫిర్యాదులు చేయొచ్చు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాల లబ్ధి గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌లో పంపిస్తారు. అందులో నుంచి మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడే టికెట్లు, వసతి సహా అన్ని బుక్‌ చేసుకోగలరు.
విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్‌ లైసెన్సులు పొందొచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్‌ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందొచ్చు.
Read More
Next Story