ఏలూరు ఎంపి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పొత్తుల్లో తమకే కేటాయించాలని బిజెపి ఫైట్ చేసింది. అల్లుడికి స్థానం దక్కించుకోవడంలో యనమల సక్సెస్ అయ్యారు.
జి. విజయ కుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పార్లమెంట్‌కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహేష్ యాదవ్‌కు సీటు ఖరారు చేయడంలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, ఆంతరంగికుల్లో ఒకరు యనమల రామకృష్ణుడు చక్రం తిప్పినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణడికి స్వయాన అల్లుడు కావడంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మహేష్ యాదవ్‌కు ఏలూరు పార్లమెంట్ సీటు దక్కే విధంగా చంద్రబాబును ఒప్పించినట్లు తెలిసింది. పొత్తుల నేపథ్యంలో జనసేన, బిజెపిలతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యనమల రామకృష్ణుడు పావులు కదిపినట్లు సమాచారం. మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా టీడీపీలో సీనియర్ నేతే. ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా కూడా పని చేశారు. గత ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సుధాకర్ యాదవ్ ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో కూడా అదే నియోజక వర్గం నుంచే బరీలోకి దిగుతున్నారు.
ఏలూరుకు నాన్‌లోకల్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన అభ్యర్థులను ఒక చోట నుంచి మరొక చోటుకు రాజకీయ బదిలీలు చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత కూడా స్థానికేతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేశారు. అలా చేసిన వాటిల్లో ఏలూరు పార్లమెంట్ స్థానం అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కూడా ఒకరు. మహేష్ యాదవ్ కడప జిల్లా వాస్తవ్యులు. 1985 ఏప్రిల్ 10న ప్రొద్దుటూరులో జన్మించారు. ఆయనకు ఇపుడు 39 ఏళ్లు. డిగ్రీ చదివారు. వ్యాపారం చేస్తుంటారు. తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్, తల్లి విజయలక్ష్మీ. భార్య కృష్ణ సాహిత్య. ఒక కుమార్తె ఉన్నారు. వ్యాపారంతో పాటు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీని కోసం పుట్టా విజయలక్ష్మీ ట్రస్టును ఏర్పాటు చేశారు. మైదుకూరు నియోజక వర్గంలోని కొత్తపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. మరుగుదొడ్లు నిర్మించడం, తాగు నీరు అందించడం, రహదారులు ఏర్పాటు చేయడం వంటి మౌలిక సదుపాయాలను ట్రస్టు ద్వారా కల్పిస్తుంటారు. అయితే మహేష్ యాదవ్ ఏలూరుకు నాన్ లోకల్. కడప జిల్లాకు చెందిన నేతకు ఏలూరు ప్లామెంట్ సీటు ఇవ్వడంపై స్థానిక నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సర్థుకు పోవాల్సిందేనని స్థానికులు అనుకోవడం కనిపించింది.
తెరపైకి సుజనా చౌదరీ పేరు
ఏలూరు పార్లమెంట్ స్థానంపై బిజెపి కన్నేసింది. దీనిని ఎలాగైనా దిక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు. టీడీపీ, జనసేన, బిజెపీ పొత్తులో భాగంగా ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరారు. పొత్తుల్లో భాగంగా ఏలూరు ఎంపి స్థానాన్ని బిజెపికి కేటాయిస్తే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీని రంగంలోకి దింపాలని ఆ పార్టీ నేతలు భావించారు. ఆ మేరకు చర్చలు కూడా జరిగినట్లు గతంలో ప్రచారం జరిగింది. విజయవాడ పార్లమెంట్ కానీ, ఏలూరు పార్లమెంట్ కానీ సుజనా చౌదరీ కోరినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో సుజనా చౌదరీనే అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారని ఆ పార్టీ వర్గాలు భావించాయి. మరోక బిజెపి నేత పేరు కూడా వినిపించింది. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు బావించారు. మరో వైపు బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణ గౌడ్, గోరుముచ్చు గోపాల్ యాదవ్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ స్థానం దిక్కంచుకునేందుకు వీరు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. కానీ దక్కించుకోలే పోయారు. మహేష్ యాదవ్ పేరును ప్రకటించగానే ఆయనను స్థానిక బిజెపి నేతలు వ్యతిరేకించారు. ఏలూరు బిజెపి కార్యాలయంలో నిరసనలు చేపట్టారు. బిజెపి, జనసేన, టీడీపీలు ఏలూరు ఎంపీ సీటు విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. తపనా చౌదరికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యతిరేకత నేపథ్యంలో స్థానిక నేతలు, జనసేన, బిజెపి శ్రేణులకు మధ్య గ్యాప్ నెలకొంది. ఇది ఎటువైపుకు దారి తీస్తుందనేది ప్రశ్నార్థకంగా మారిందని స్థానిక నేతలు చెబుతున్నారు.