సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యెోగులు నిలువునా చీలారు. అధికార పక్షానికి కొందరు, ప్రతిపక్షానికి కొందరు కొమ్ముకాశారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులదీ అదే పరిస్థితి.
ఎన్నికలు సజావుగా జరగాలంటే కార్యనిర్వాహక, న్యాయ, లెజిస్లేచర్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. కార్యనిర్వాహక వ్యవస్థ నిలువునా చీలడంతో ఎన్నికల విధుల్లో కొన్ని లోపాలు తలెత్తాయి. వాటిని అధిగమించి ముందుకు సాగటంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్నికల్లో జరిగే హింసను ముందుగా గుర్తించి అరికట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైందనే విమర్శలు వెల్లువలా వచ్చాయి.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగటానికి విస్తృత అధికారాలు కలిగిన ఎన్నికల కమిషన్ తన పాత్రను నిర్వహించాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి పాలకులు ఆపద్ధర్మ పాలకులుగా వ్యవహరిస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళాయి. ఎన్నికలు సజావుగా జరగాలంటే అప్పటి వరకు ఉన్న అధికారుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వారిని గుర్తించి ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం, కొందరిని బదిలీలు చేయడం సహజం.
డిజిపిని వారం ముందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది?
ఈ మేరకు షెడ్యూల్ విడుదలైన తరువాత కొందరు కలెక్టర్‌లు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలను ఎన్నికల కమిషన్ మార్చింది. అయితే ఎన్నికలకు వారం రోజుల ముందు డిజిపిని మార్చడం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో అనిచ్చితి చోటు చేసుకోవడానికి కారణమని మేధాలు వ్యాఖ్యానించారు. అలాగే ఇంటిలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషన్ కాంతిరాణ తాతాను మార్చింది. డిజిపిని చివర్లో మార్చడం వల్ల అన్ని జిల్లాలపై అవగాహన పెంచుకోవడం డిజిపికి సాధ్యం కాలేదని చెప్పొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమి జరిగిందనేది ఎన్నికల కమిషన్‌కు గుణపాఠమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికార, ప్రతిపక్షాలకు కొమ్ముకాస్తూ విడిపోయిన ఉద్యోగులు..
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో ప్రభుత్వానికి కొమ్ముకాసే వర్గం, ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే వర్గాలుగా చీలిపోయాయి. రాబోయే ప్రభుత్వంలో చక్రం తిప్పాలనుకునే మరో వర్గం ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి ఆయా పార్టీల ప్రాపకం కోసం వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడం నుంచి బయట పెట్టకూడని విషయాలను సైతం వారి వర్గం వారికి చేరవేయడం జరిగాయి. మరీ ముఖ్యంగా పోలీసులు పోటీ పడి ఆయా పార్టీల సేవలో మునిగి తేలారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికార వర్గాలు అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు బాగా వచ్చాయి. కలెక్టర్‌లు, ఎస్పీల వంటి వారు, కార్యదర్శులు, కమిషనర్ల వంటి వారు ప్రభుత్వం చెప్పనట్లు చేశారనే విమర్శలు మూట గట్టుకున్నారు.
పోలీసు వ్యవస్థకు బాగా చెడ్డపేరు వచ్చింది. ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. వారు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, ప్రధానంగా ఎమ్మెల్యేలు ఏమి చెబితే అది చేశారనే ఆరోపణలు వచ్చాయి. చివరలో తేరుకున్న పోలీసులు ఎన్నికల కమిషన్ చర్యలుకు భయపడి పోలీస్ అధికారులు పోలీసులను మరింత యాక్టివేట్ చేసి పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై పోలీసులతోనే కేసులు పెట్టించారు. ఉదాహరణకు కారంపూడి సీఐపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సీఐ అటెమ్ట్ మర్డర్ కేసు పెట్టారు.
రెండుగా చీలిన ఉద్యోగులు
ఉద్యోగులు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలాయి. ఇందులో అనుకూల వర్గం 20 శాతం కాగా వ్యతిరేక వర్గం 80 శాతం ఉన్నట్లు పాలకులు అంచనా వేశారు. ఇందుకు ప్రభుత్వ చర్యలే కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రశ్నించిన ఉద్యోగ సంఘాల నాయకులపై కావాలని చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉన్న సూర్యనారాయణ తమకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని రాష్ట్ర గవర్నర్‌ను కలిసి మెమోరాండం ఇచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసింది. కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్‌జీవో సంఘం కూడా ప్రభుత్వ చర్యలను ఖండించలేకపోయింది. ఉద్యమాలు చేసేందుకు ముందుకొచ్చిన ఉపాధ్యాయులు అనేక మందిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కొందరు జిల్లా నాయకులను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్‌లు చేసింది. జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు రాకుండా పోలీసులతో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రశ్నించే హక్కును కాల రాశారు. దీంతో ఉద్యోగులు నిలువునా రెండు వర్గాలుగా చీలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపాధ్యాయులను పక్కనబెట్టి ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పక్కనబెట్టి ఎన్నికల కమిషన్ అన్ని శాఖల్లోని ఉద్యోగులను ఎన్నికల విధుల్లో పాల్గొనేలా చేసింది.
దీంతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై బాగా కసి పెరిగిందని చెప్పొచ్చు. ఒకవైపు పోలీసుల్లోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కింది స్థాయి పోలీసులు ఒక వర్గంగాను, పైస్థాయి అధికారులు మరో వర్గంగాను ఏర్పడ్డారు. కింది స్థాయిలో ఏమి జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో పల్నాడు జిల్లా, రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో అల్లర్లు అధికంగా జరిగాయి. హింస కూడా చెలరేగింది. ఎన్నికలు జరిగిన రోజు కనీస స్థాయిలో కూడా పోలీసులు స్పందించలేదు. కేసులు నమోదు చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తరువాత ఎన్నకల మిషన సీరియస్ కావడంతో సీన్ రివర్స్ అయింది.
Next Story