ప్రశ్నించేవారు లేరనుకుంటే ఎలా!?
x
'ఎర్ర జెండా నీడన నా అనుభవాలు' పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్న మాజీ రాజ్యసభ సభ్యులు పి. మధు

ప్రశ్నించేవారు లేరనుకుంటే ఎలా!?

నీట్ పరీక్ష పేపర్ లీకైతే, పరీక్ష జరిగిన స్కూల్ యాజమాన్యం పైన కేసు పెట్టారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు కోరితే మోడీ ప్రభుత్వం తిరస్కరించింది. బీజేపీని బలరుస్తున్న చంద్రబాబు దీనికేం సమాధానమేమిస్తారని ప్రశ్నించారు మధు.


''పార్లమెంటులో మాకు సీట్లు లేవని అనుకుంటున్నారా? ప్రశ్నించే వారు లేరని అనుకుంటే డొక్క చించి డోలుకడతాం' అంటూ బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభ మాజీ సభ్యులు, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు హెచ్చరించారు. ‘‘మద్యం కేసులో యాభై కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారు. అదే మద్యం కేసులో నిందితుడైన అరబిందో లేబరేటరీస్ ఎండి శరత్ చంద్రా రెడ్డి బీజేపీకి యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్టు చార్జీషీట్ తయారు చేశారు. రుజువులు లేని కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, రుజువులు ఉన్న శరత్ చంద్రారెడ్డి బయట ఉన్నాడు’’ అని వివరించారు.

ఏ.వి. వర్మ రాసిన ‘ఎర్రజెండా నీడన నా అనుభవాలు’ పుస్తకావిష్కరణ సభ సీఐటీయూ ఉపాధ్యక్షులు కందారపు మురళి అధ్యక్షతన ఆదివారం ఉదయం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సభలో మధు మాట్లాడుతూ.. ‘‘నీట్ పరీక్ష పేపర్ లీకైతే, పరీక్ష జరిగిన స్కూల్ యాజమాన్యం పైన కేసు పెట్టారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు కోరితే మోడీ ప్రభుత్వం తిరస్కరించింది. బీజేపీని బలరుస్తున్న చంద్రబాబు దీనికి ఏం సమాధానమేమిస్తారని ప్రశ్నిస్తున్నా'' అన్నారు.

''లోక్ సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం నుంచి ఎంపిక చేస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి చెందిన వారిని ఎంపిక చేసే సంప్రదాయం నెహ్రూ కాలం నుంచి వస్తోంది. మోడీ 2019లో రెండోసారి ప్రధాని అయ్యాక ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 238 స్థానాలున్న ప్రతిపక్షానికి డెప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు" అని వివరించారు.

'ఎర్ర జెండా నీడన నా అనుభవాలు' పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతున్న సీ ఐ టీ యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి నర్సింగరావు

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న అయిదు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం మూడు నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటమేనని అన్నారు. రోడ్లలో మేకులు కొట్టి, కందకాలు తవ్వి, రైతులపై 45 వేల కేసులు పెడితే బీజేపీని ఓడించకుండా ఎట్లా ఉంటారని ప్రశ్నించారు. బీజేపీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అధికారంలో కొచ్చారని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే కార్మిక సంఘాలు చేసిన ఎన్నో పోరాటాల ఫలితమేనని గుర్తు చేశారు. పోస్టల్ విభాగంలో పనిచేసే రోజుల్లో పుస్తక రచయిత ఏ.వి. వర్మను అధికారి ఆర్థిక సరళీకరణను భగవంతుడు చేయమన్నాడని అంటే, ఆ భగవంతుడే దాన్ని వ్యతిరేకించమని చెప్పాడని వర్మ చెప్పిన సమాధానాన్ని గుర్తు చేశారు. వర్మ జీవితం నుంచి ఈ తరం ఎంతో నేర్చుకోవాలని కోరారు.

'ఎర్ర జెండా నీడన నా అనుభవాలు' పుస్త న్ని సమీక్షిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాఘవ

ఏ.వి. వర్మ రాసిన ‘ఎర్ర జెండా నీడన నా అనుభవాలు’ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాఘవ సమీక్షిస్తూ, ‘'పుస్తకం చాలా తేలికగా ఉన్నా, చదవడానికి భాష చాలా సరళంగా ఉన్నా, లోపలి విషయాలు మాత్రం చాలా బరువైనవి. కుల వ్యవస్థ బలంగా వేళూనుకున్న నేటి సమాజంలో దానికి వ్యతిరేకంగా ముగ్గురు కూతుళ్ళకు, కులాంతర, మతాంతర వివాహాలు చేయడం అంత తేలికైన విషయం కాదు. కమ్యూనిస్టు ఆదర్శాల నిబద్దతతో వర్మ జీవించారు" అని వివరించారు.

'ఎర్ర జెండా నీడన నా అనుభవాలు' పుస్తకా ఆవిష్క రిస్తున్న దృశ్యం

ఈ పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన సీఐటీయూ ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ.. ప్రశ్నించే శక్తులు బలహీనపడిన దురదృష్టకర వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సంపద ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారే కానీ, ఏరకంగా సంపాదించారని చర్చించడం లేదన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రస్తుత అభ్యర్థులు వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

టీటీడీ పాలక మండలి సభ్యులు ఓ.వీ. రమణ మాట్లాడుతూ.. సిద్ధాంతాలున్నాయని తాను బీజేపీలో చేరానని ప్రధాని మోడీ.. ఆంధ్రపదేశ్‌లో ఉన్నప్పుడు అమరావతే రాజధాని అని, ఢిల్లీ వెళ్ళగానే మూడు రాజధానులని ఎలా అంటారని ఒక పత్రికలో రాస్తే తనను ఆ పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ఇలాంటి వారు పారిశ్రామిక విధానం, ఆర్థిక సరళీకరణ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రశ్నించే గొంతులంటే ఈ సమాజానికి పనికి రారని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎర్ర జెండా నీడన నా అనుభవాలు' పుస్తకావిష్కరణ సభ లో ఆహుతులు

లహరి ఆహ్వానం పలికిన ఈ సభలో రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు అంజయ్య, స్విమ్స్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మునస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, ఆలిండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్కిల్ కార్యదర్శి నిమ్మగడ్డ నాగేశ్వరరావు సభలో మాట్లాడారు.

Read More
Next Story