ఆంధ్రా తూర్పు తీరానా అంతులేని విషాదం
కుటుంబాలను ఛిద్రం చేసిన ‘ఎసైన్షియా' - బాధితుల కళ్లల్లో కన్నీటి సుడులు
(బొల్లం కోటేశ్వరరావు- విశాఖపట్నం)
త్వరలోనే పెళ్లి కావలసిన వారు.. ఇటీవలే తండ్రి అయిన వారు.. కొద్దిరోజుల్లో తండ్రి కాబోతున్న వారు.. అనతికాలంలోనే ఓ ఇంటి వారు కాబోతున్న వారు.. ఇలా ఎన్నో కలలు కంటూ ఎంతో ఆనందంతో సాగిపోతున్న ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఎసైన్సియా అనే కంపెనీలో సంభవించిన పేలుడు వారి కలలన్నిటినీ కల్లలు చేసింది. తీవ్ర కల్లోలాన్ని సృష్టించింది. మృతుల శరీరాల మాదిరిగానే వారిపై ఆధారపడ్డ కుటుంబాలను ఛిద్రం చేసేసింది. ఈ దుర్ఘటనలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ప్రమాదంలో అశువులు బాసిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ వ్యధ! మాటలకందని మహా విషాద గాధ!!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో బుధవారం నాటి ఎసైన్సియా పరిశ్రమలో జరిగిన పేలుడులో 18 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తమ వారిని కోల్పోయిన వారంతా కుటుంబాలతో సహా విశాఖలోని కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) మార్చురీ వద్దకు చేరుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఆ ప్రాంతమంతా మృతుల బంధుమిత్రుల రోదనలతో మిన్నంటిపోయింది. తమ ఇంటి ఆశాదీపాలు ఆరిపోయాయంటూ రోదిస్తున్న తీరు గుండెల్ని పిండేస్తోంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే..
అనకాపల్లి జిల్లా దార్లపూడికి చెందిన జవ్వాది చిరంజీవి ఎసైన్సియాలో ఏడాదిన్నర క్రితం ఫిట్టర్గా చేరాడు. అదే ఊర్లో ఉన్న లీలాదేవి చిరంజీవి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి తొలుత పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎలాగోలా ఒప్పించి ఈ ఏడాది ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడామె ఐదో నెల గర్భిణీ. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఒకపక్క ఆనందం, ఆ వెంటనే కడుపు పండిందని మరోపక్క సంతోషంతో ఆ నవ దంపతులు రోజూ మురిసి పోతున్నారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తూ జాగ్రత్త సుమా.. అని భార్యకు చెప్పి వెళ్లాడు. ఆ సాయంత్రానికే చిరంజీవి మృత్యువాత పడ్డాడని తెలిసి ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. నా కడుపులోని బిడ్డకు నాన్న ఏడని అడిగితే ఏం చెప్పాలి? అంటూ లీలాదేవి రోదిస్తుంటే అక్కడి వారికి కన్నీళ్లు ఆగలేదు.
20 ఏళ్లకే భర్తను కోల్పోయి..
కోనసీమ జిల్లా పాసర్లపూడిలంకకు చెందిన మరిశెట్టి సతీష్ తో సాయిశ్రీ (20)కి రెండేళ్ల క్రితమే వివాహమైంది. ఎసైన్సియాలో నెలన్నర క్రితం సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా చేరిన సతీష్ భార్యతో కలిసి అగనంపూడిలో ఉంటున్నాడు. బుధవారం ఉదయం షిప్టులో డ్యూటీకి వెళ్లి ప్రమాదంలో స్లాబ్ కూలి దుర్మరణం పాలయ్యాడు. తన భర్త బతికే ఉన్నాడని కేజీహెచ్కి తీసుకొచ్చారని, తీరా ఇక్కడకొచ్చాక చనిపోయినట్టు చెప్పారని, ఇప్పుడు తన బతుకేం కావాలి? అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. 'మధ్యాహ్నం రెండు గంటలకు మేమిద్దరం కలిసి భోజనం చేశాం. అనంతరం సతీష్ ఆఫీసులోకి వెళ్లిన ఒక్క నిమిషానికే పేలుడు సంభవించింది. ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లినా నా ఫ్రెండ్ బతికే వాడు’ అంటూ సతీష్ స్నేహితుడు నరేష్ గద్గద స్వరంతో చెప్పాడు.
వెంటాడిన మృత్యువు..
పైడి రాజశేఖర్ (22) స్కూలు, కాలేజీలో టాపర్. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చేసిన రాజశేఖర్ క్యాంపస్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఈలోగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్ ఉద్యోగాలకూ సెలక్టయ్యాడు. ఈ రెండు ఉద్యోగాలకు ఇంకా పిలుపు రాకపోవడంతో రెండు నెలల క్రితమే ఎసైన్సియాలో ప్రాసెస్ ఇంజినీర్గా చేరాడు. తమ ఏకైక కొడుకు 22 ఏళ్లకే ఉద్యోగంలో చేరాడని త్వరలో పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రులు ఆనంద పరవశులవుతున్నారు. మూడు రోజుల క్రితం చెల్లెలికి రాఖీ కూడా కట్టి వెళ్లాడు. వాస్తవానికి రాజశేఖర్ బుధవారం మధ్యాహ్నం షిఫ్ట్క వెళ్లాల్సి ఉంది. కానీ రాత్రికి స్నేహితుడి పెళ్లి ఉండడంతో దానిని ఉదయానికి మార్చుకుని వెళ్లాడు. అంతేకాదు.. పరిశ్రమలో ఏదో సమస్య తలెత్తిందని పిలుపు రావడంతో తనకు సంబంధం లేకపోయినా అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో పేలుడు సంభవించి దుర్మరణం పాలయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
గృహ ప్రవేశం కోరిక తీరకుండానే..
ఎసైన్సియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన హంస ప్రశాంత్ (34)కు ఇద్దరు అమ్మాయిలు. రెండో అమ్మాయి వయసు మూడు నెలలే. ఎంతో ముచ్చటపడి తమ ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. అది దాదాపు పూర్తి కావచ్చింది. అచ్యుతాపురంలో భార్యా పిల్లలతో ఉన్న ఉంటున్న ఆయన నాలుగు రోజుల క్రితమే ఆ ఇంటి పనులెంత వరకు అయ్యాయో చూడటానికి వెళ్లాడు. త్వరలోనే గృహప్రవేశం చేస్తానని, అందరూ రావాలని ఎంతో సంతోషంగా చెప్పి వచ్చాడు. గృహప్రవేశ కోరిక తీరకుండానే పేలుడులో అశువులు బాశాడని ప్రశాంత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
అక్టోబర్లో పెళ్లి.. అంతలోనే మృత్యు ఒడికి..
పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీలకు చెందిన జె. పార్థసారధి ఐటీఐ చేసి ఎసైన్సియాలో ఫిట్టర్గా రెండేళ్ల నుంచి పని చేస్తున్నాడు. ఈయనకు తల్లిదండ్రులు, ఒక అన్న, చెల్లి ఉన్నారు. ఇటీవల సీతానగరం మండలం కామందొరవలసకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. అక్టోబర్ 5న పెళ్లి నిశ్చయమైంది. పార్థసారధి కుటుంబ సభ్యులంతా ఆ పనుల్లో ఉన్నారు. ఇంతలో పెళ్లి కొడుకు మరణ వార్త విని తల్లడిల్లిపోతున్నారు. మరో నెలన్నరలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట ఇలా చావు బాజాలు మోగించాల్సి వస్తోందంటూ పార్థసారధి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
అన్నకు రాఖీ కట్టి వెళ్లి..
కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన చల్లపల్లి హారిక (22) ఎసైన్సియాలో ఏడాది క్రితమే చేరింది. రాఖీ పండగకు తన పెదనాన్న కొడుక్కి రాఖీ కట్టడానికి సోమవారం సర్పవరం వచ్చింది. రాఖీ కట్టి అన్న, కుటుంబ సభ్యులతో సరదాగా గడపింది. రెండ్రోజులు ఉండాలని వారంతా పట్టుబట్టినా సెలవు లేదంటూ బుధవారం ఉదయమే బయల్దేరింది. విధుల్లో ఉండగా పరిశ్రమలో జరిగిన పేలుడులో హారిక దుర్మరణం పాలైంది. ఈ దుర్ఘటన వార్త విన్న ఆమె తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, రాఖీ కట్టించుకున్న అన్న తీవ్ర విషాదంలో మునిగిపోయారు. త్వరలో హారికకు పెళ్లి చేయాలనుకుంటున్న తరుణంలో భగవంతుడు ఇలా చేశాడంటూ విలపిస్తున్నారు.
ఒక్కగానొక్క కొడుకూ..
కొప్పర్తి గణేష్ కాకినాడ జిల్లా బిక్కవోలు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఎసైన్సియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆయనకు నాలుగేళ్ల కొడుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం రెండో షిఫ్టు (మధ్యాహ్నం ఈ గంటల)కు వెళ్లాడు. ప్రమాద ఘటన బిక్కవోలులో ఉంటున్న కుటుంబ సభ్యులకు గాని, భార్యకు గాని రాత్రి పది గంటల వరకు తెలియలేదు. ప్రమాదంలో గణేష్ ఉన్నాడని ఆయన స్నేహితులు చెప్పడంతో రోదిస్తూ విశాఖ చేరుకున్నారు. 'డ్యూటీకి వెళ్తూ వెళ్తూ జాగ్రత్త చెప్పాడని, అవే ఆయన ఆఖరి మాటలని భార్య అరుణకుమారి కన్నీటి పర్యంతమవుతోంది.