
చంద్రగ్రహణంలో కూడా శ్రీకాళహస్తిలో దర్శనం ఆగదు...
తిరుమలతో సహా మధ్యాహ్నం నుంచి 12 గంటలు అన్ని ఆలయాలు మూత.
చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలోని వాయులింగ క్షేత్రం మినహా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వైష్ణవ, శైవాలయాల ద్వారాలు ఆదివారం మధ్యాహ్నం నుంచి 12 గంటల పాటు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం వల్ల ఆలయాల మూత వేయనున్నారు. శ్రీకాళహస్తిలోని ఆలయం మాత్రం యథావిధిగా తెరిచే ఉంచుతారు. యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు.
"చంద్రగ్రహణ సమయంలో మధ్యకాలంలో అంటే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో శివలింగానికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు" అని శ్రీకాళహస్తీశ్వర ఆలయ పురోహితుడు అర్ధగిరి ప్రసాద శర్మ చెప్పారు.
చంద్రగ్రహణ ప్రభావం ఆదివారం రాత్రి 9.50 గంటల నుంచి ఎనిమిదో తేదీ వేకువజామున 1.31 గంటల వరకు ఉంటుందని టీటీడీ వేదపండితులు ప్రకటించారు. గ్రహణానికి ఆరుగంటల ముందే అంటే తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలన్నీ మధ్యాహ్నం 2.15 గంటలకు మూసేవేస్తారు. తిరిగి ఎనిమిదో తేదీ సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికుల కోసం తిరుమలలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
టీటీడీ ఆధీనంలోని అమరావతిలో ఉన్న ఎస్వీ ఆలయం, నారాయణవనం, కార్వేటినగరం, కడప, ఒంటిమిట్ట తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేసి, 8వ తేదీ సోమవారం ఉదయం 3.00 గంటలకు తెరుస్తారు.
శ్రీకాళహస్తిలో ఎందుకు మూయరు
సాధారణంగా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సమయంలో చాలా ఆలయాలు మూసివేస్తారు. శ్రీకాళహస్తి ఆలయం గ్రహణాల సమయంలో కూడా తెరిచి ఉంటుంది, అంతేకాక ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. దీనికి ముఖ్య కారణాలు ఉన్నాయి. దీనిపై శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రధాన అర్చకుడు సంబంధం గురుకుల్ పక్షాన ఆలయ పురోహితుడు అర్ధగిరి ప్రసాద్ శర్మ ఆ ప్రత్యేకతలను వివరించారు.
" శ్రీకాళహస్తిని రాహు-కేతు క్షేత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, గ్రహణాలకు కారణమైన రాహు, కేతువులు ఇక్కడి శివలింగాన్ని పూజించిన కారణంగా ఇక్కడ వారి ప్రభావం ఉండదని నమ్ముతారు. రాహు, కేతువులే ఇక్కడ పూజలు చేయించుకుంటారు. అందువల్ల గ్రహణ దోషాలు ఈ ఆలయాన్ని ప్రభావితం చేయవు" అని ప్రసాదశర్మ వివరించారు.
శ్రీకాళహస్తి ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటైన వాయు లింగం. ఇక్కడ స్వామివారు వాయు రూపంలో ఉంటారని విశ్వసిస్తారు. అందుకే గ్రహణాల ప్రభావం ఇక్కడ ఉండదని శాస్త్రాలు అభివర్ణించాని అర్చకుడు ప్రసాదశర్మ చెప్పారు.
"శ్రీకాళహస్తీశ్వరుని విగ్రహంపై నవగ్రహ కవచం ఉంటుంది. దీనివల్ల గ్రహాలన్నీ శివుని నియంత్రణలో ఉంటాయి. అందువల్ల గ్రహణాల వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఈ ఆలయంపై పడవని నమ్ముతారు" అని ఆయన వివరించారు.
ఈ కారణాల నేపథ్యంలో గ్రహణాల సమయంలో కూడా శ్రీకాళహస్తి ఆలయం భక్తులకు దర్శనం కోసం తెరిచే ఉంటుంది. ఈ సమయంలో రాహు-కేతు దోష నివారణ పూజలు చేయించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
దోష నివారణ పూజలు
ఎలాంటి గ్రహణాలైనా శ్రీకాళహస్తి ఆలయంలో నిత్యం యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రధానంగా చంద్రగ్రహం ఏర్పడే ఆదివారం రాత్రి మాత్రం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పురోహితుడు అర్ధగిరి ప్రసాదశర్మ కథనం మేరకు..
"గ్రహణ కాల సమయం రాత్రి 9.50 గంటల నుంచి సోమవారం వేకువజామున 1.25 గంటల వరకు ఉంటుంది. గ్రహణ మధ్య కాలంలో అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే రాత్రి 11.40 గంటల సమయంలో మధ్యకాలంగా పరిగణిస్తారు. ఆ సమయంలో కలశాభిషేకం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహ వచనం శాంతి సంకల్ప పూజలు నిర్వహిస్తారు" అని ప్రసాద్ శర్మ వివరించారు. శాంతిసంకల్పం చెప్పిన తరువాత అమ్మవారికి, తరువాత స్వామివారి శివలింగానికి అభిషేకం తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఇవన్నీ రాత్రి 12.30 గంటలకు జరుగుతాయని ప్రసాద్ శర్మ వివరించారు. ఆ తరువాత ఆలయాన్ని మూసివేసి, ప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య పూజల అనంతరం మళ్ళీ యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారని ప్రసాద్ శర్మ చెప్పారు.
తిరుమలలో ఏర్పాట్లు
తిరుమలలో శ్రీవారి ఆలయం ఆదివారం మధ్యాహ్నం 3.30 నుంచి సోమవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు సుమారు 12గం పాటు ఆలయం మూసివేస్తారు. ఎనిమిదో తేదీ ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం ఆరు గంటలకు శ్రీవారి దర్శనం పునః ప్రారంభవుతుంది.
చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ఆదివారం సాయంత్రం గంటల నుంచి అన్నప్రసాదాల వితరణ ఉండదని టీటీడీ ప్రకటించింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాదాల వితరణ జరుగుతుందని తెలిపారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఆహార పొట్లాలు ముందుగానే పంపిణీకి సిద్ధం చేశారు.
Next Story