ముహూర్తం ముంచుకొచ్చినా చంద్రబాబు తేల్చడేం?
మరో 48 గంటల్లో ఎన్నికల నామినేషన్ల సమయం ముంచుకొస్తున్నా ఈ 47 రాజకీయ అనుభవ నేత ఇప్పటికీ కొన్ని సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు.
ఏదైనా విషయాన్ని నాన్చడంలో దిట్టని తెలుసుగాని మరీ ఇంతలా కాదంటున్నారు తెలుగుదేశం నేతలు. మరో 48 గంటల్లో ఎన్నికల నామినేషన్ల సమయం ముంచుకొస్తున్నా ఈ 47 రాజకీయ అనుభవ నేత ఇప్పటికీ కొన్ని సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు. మూడు పార్టీలతో పొత్తు ఓ కారణమైతే ఎవర్ని నొప్పిస్తే ఏమి ముప్పు వస్తుందోనన్నది మరో కారణంగా చెబుతున్నారు.
జనసేన, బీజేపీకి ఇస్తున్న 31 సీట్లు పోను మిగతా 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తోంది. బీజేపీకి, జనసేనకి ఇచ్చిన సీట్లలోనూ టీడీపీతో ఏదో ఒక సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధైర్యంగా ముందడుగు వేయలేకపోవడం, అభ్యర్థులు ఎవరో తేల్చకపోవడం వల్ల పలు నియోజకవర్గాలలో టిడిపి క్యాడర్ అసహనంతో ఉంది. ప్రధానంగా నర్సాపురం ఎంపీ సీటుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించడంలో చంద్రబాబు ఇంకా తడబడుతూనే ఉన్నారని అనిపిస్తుంది. అక్కడ వైసీపీ నుంచి వచ్చిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణం రాజుకు సీటు ఇస్తారో లేదో అనేది తేల్చకపోవడం, రఘురామకృష్ణం రాజుకూడా ఉండి నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండడంతో ఎవరు అభ్యర్థో తెలియక తికమకపడుతున్నారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు ఇచ్చేందుకు బిజెపి నిరాకరించింది.
ఆయన తన బాధ్యతనంత చంద్రబాబుపైనే నెట్టడంతో చంద్రబాబు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టిడిపిలో చేరిపోయి తనకు సిటీ ఇవ్వాల్సిందని ఒత్తిడి తెచ్చారు. నరసాపురం ఎంపీ లేదా ఉండి ఎమ్మెల్యే స్థానాల్లో ఏదో ఒకటి ఆయనకు కట్టబెట్టేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉండి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఇప్పటికే రామరాజును ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయనను తప్పించి ఉండి సీటును రఘురామకి ఇస్తే ఇబ్బందులు తప్పవనేది క్షేత్రస్థాయి నివేదిక. అయినప్పటికీ రఘురామ కృష్ణం రాజు చంద్రబాబుపై వత్తిడి చేయడం మానలేదు. చంద్రబాబు కూడా తేల్చిచెప్పడం లేదు. దీంతో అక్కడ అయోమయం నెలకొంది.