ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నికలు ప్రారంభమైన మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయని పార్లమెంట్ నియోజకకవర్గాలు ఐదు ఉన్నాయి.
మహిళలకు సమాజంలో సగం అంటున్న రాజకీయ పార్టీలు నేటికీ ఆమె సగం కాదని నిరూపిస్తున్నాయి. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా పోటీ చేసేందుకు ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఒక్క మహిళా నాయకురాలు కూడా పార్టీలకు కనిపించలేదా? అనేది ప్రశ్న. పూర్వం మహిళలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుకు వచ్చారు. స్థానిక సంస్థల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు పార్టీలు పాటిస్తున్నాయి. అయితే చట్టసభలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. బిజెపి వారు ఈ దఫా పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు ఆమోదం తెలిపినా ఈ ఎన్నికల్లో కాకుండా రానున్న 2029 ఎన్నికల్లో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని వెల్లడించారు.
మహిళా నాయకురాళ్లు ఎంతో తెలివైన వారు ఎంతో మంది ఉన్నారు. అయినా పురుషులు వారికి అవకాశం ఇవ్వలేదు. పైగా పార్టీల పెద్దలు ఆ వైపుగా అసలు చూడనేలేదు. 1952లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు అవకాశం రాని నియోజకవర్గాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అయినా ఇది నిజం.
అనంతపురం, గుంటూరు, హిందూపురం, నంద్యాల, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మహిళ ప్రాతినిద్యం లేదు. అనంతపురం నియోజకవర్గంలో ఎక్కువసార్లు రెడ్లు గెలిచారు. ఓడిన వారిలో ఎక్కువ సార్లు చౌదర్లు ఉండటం విశేషం. పార్లమెంట్ నియోజకవర్గం ఎక్కువసార్లు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌కు అవకాశం కల్పించింది. బీసీలకు తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు అవకాశం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినా మొదటి దశకాల్లో తప్ప నూతన దశకాల్లో కల్పించలేదు.
హిందూపురం నియోకవర్గం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ సార్లు గెలిచారు. ఐదు సార్లు టీడీపీ గెలవగా మొదటిసారిగా గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. ఇక్కడి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం వారికే ఓటర్లు పెద్దపీట వేశారు. ఇక గుంటూరు నియోజకవర్గంలోనూ మహిళలకు పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీలు కూడా ఇక్కడి నుంచి మహిళలకు అవకాశం ఇవ్వలేదు. ఎంతో మంది మేధావులైన మహిళలు గుంటూరు జిల్లాలో ఉన్నారు. రాజకీయ చైతన్యానికి గుంటూరు మారుపేరు. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంట్‌లో తమ వాణి వినిపించారు. నంద్యాల నియోజకవర్గంలోనూ రెడ్ల హవానే కొనసాగింది. పెండేకంటి వెంకటసుబ్బయ్య, పీవీ నరసింహారావు లాంటి ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. పివి నరసింహారావు భారత ప్రధాన మంత్రిగా పనిచేశారు. అయితే మహిళకు మాత్రం ఈ నియోజకవర్గం నుంచి అవకాశం రాలేదు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 1952 నుంచి ఎన్నికలు జరిగుతున్నా ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించలేకపోయిందా? పాలకులు మహిళలను చిన్న చూపు చూశారా అనేది నియోజకవర్గంలోని మేదావులు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. కృష్ణా జిల్లా చైతన్యానికి పెట్టింది. పేరు ఎంతో మంది బ్రిటీష్ వారిని గడగడలాడించిన పట్టణం. ఇక్కడి నుంచి సముద్ర మార్గంలో వచ్చిన బ్రిటీష్ వారితో పోరాటాన్ని కొనసాగించిన పట్టణం. అటువంటి పోరాటాలకు పుట్టినిల్లయిన పార్లమెంట్ నుంచి ఒక్క మహిళ కూడా ఎన్నికల్లో సీటు సంపాదించుకోలేకపోవడం, పార్టీలు కూడా మహిళకు సీటు ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అక్కడి నాయకులు అంటున్నారు.