75 ఏళ్ల వయసులోనూ ఎవర్ గ్రీన్ ఇంజినీర్స్ వీళ్లు!
x

75 ఏళ్ల వయసులోనూ 'ఎవర్ గ్రీన్ ఇంజినీర్స్' వీళ్లు!

వారి ఇంజినీరింగ్ స్నేహానికి షష్టి పూర్తి. దేశ, విదేశాల నుంచి ఉరకలేస్తూ విశాఖకు రాక. మూడు రోజులు ప్రకృతి ఒడిలో పరవశం


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

వారి వయసు ఏడున్నర పదుల పైనే. వారి స్నేహానికీ ఆరు పదుల వయసు. అయితేనేమి? వీరంతా తమ వయసును మరిచిపోయారు. నవ యువకుల్లా మారిపోయారు. ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఒంట్లో లేని ఓపికను తెచ్చుకున్నారు. అనారోగ్యాన్ని సైతం డోంట్ కేర్ అన్నారు. దేశ విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి వాలిన వీరు ఆరు దశాబ్దాల క్రితం నాటి ముచ్చట్లను మరోసారి ముచ్చటించుకున్నారు. మూడు రోజుల పాటు ప్రకృతి ఒడిలో సేద తీరుతూ సరదా సరదాగా గడిపారు. వీరంతా పదేళ్లు, ఇరవై ఏళ్ల క్రితం నాటి స్నేహితులు కాదు.. సరిగ్గా అరవై ఏళ్ల కిందట ఇంజినీరింగ్లో ముడిపడ్డ మైత్రీ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తమ స్నేహానికి షష్టి పూర్తి చేసుకున్నారు. పేరుకు తగ్గట్టే 'ఎవర్గ్రీన్ ఇంజినీర్స్' గా కొనసాగుతున్నారు.

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీలో 1964-69 బ్యాచ్ ఇంజినీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు విద్యను పూర్తి చేసుకుని బయటకొచ్చారు. వీరిలో చాలామంది వివిధ ఉద్యోగాల్లో చేరారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అప్పట్లో ఇప్పట్లో మాదిరిగా ఫోన్లు, సెల్ఫోన్లు లేవు. ఉత్తరాలతోనే స్నేహాన్ని కొనసాగించారు. పాతికేళ్ల క్రితం నుంచి సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక వీరి స్నేహ బంధం మరింత వేళ్లూనుకుంది. ఎక్కడెక్కడ ఉన్న వారూ ఒక్కటయ్యారు. అప్పట్నుంచి వీరు ఏటా ఎక్కడో చోట కలుసుకుంటున్నారు.

అలనాటి ముచ్చట్లను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. ఇలానే ఈ ఏడాది విశాఖను ఎంచుకున్నారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో విశాఖకు 42 కిలోమీటర్ల దూరంలోని ఈ బ్యాచ్లో ఒకరైన మెరైన్ ఇంజినీర్ సబ్బి త్రినాథరావుకు చెందిన పొలాన్ని వేడుకలకు వేదికగా చేసుకున్నారు. ఈ అపూర్వ' కలయిక కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు.. ఇటలీ, అమెరికా తదితర దేశాల నుంచి పూర్వ ఇంజినీర్లు తరలి వచ్చారు. తమ భాగస్వాములతో వచ్చిన వారూ ఉన్నారు. వయసు సహకరించని వారు ఊత కర్రలతో, సహకరించిన వారు అవి లేకుండా వచ్చారు.

మూడు రోజులు ప్రకృతి ఒడిలో..

తొలిరోజు ఆహ్లాదకరంగా ఉండే ఆ తోటలో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. రాత్రి సాంస్కృతక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజు తాము ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడ తమ తరగతి గదులను ఒకసారి కలియదిరిగారు. అధ్యాపకులు, విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. తమ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. వీరంతా గతంలో రూ.4 కోట్లను విరాళంగా సమకూర్చిన ఏయూ హాస్టల్నూ సందర్శించారు. మూడో రోజు తోటలో ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా ఊయల్లోను, ఊగుడు బల్లపైనా ఊగారు. ఈ మూడు రోజులు తమ పిల్లలు, మనవలు, మనవరాళ్ల స్థితిగతులు, తమ ఆరోగ్య బాగోగులు, అలనాటి అనుభూతులు, ఇప్పటి కాలమాన పరిస్థితులు.. ఇలా ఒకటేమిటి అన్నిటినీ చర్చించుకున్నారు.

సెల్ఫీలు, గ్రూపు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అన్నిటినీ మరిచిపోయి హాయిగా గడిపారు. కాలక్రమంలో వయసు మీరడంతో వీరి సంఖ్య తగ్గుతూ వస్తోందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చే ఏడాది అంతా ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో కలుసుకోవాలని ప్రతినబూనారు. తోటలో తలో మొక్కను నాటారు. అనంతరం ఎవరి ఊళ్ల (దేశాల)కు వాళ్లు తీపి జ్ఞాపకాలతో పయనమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఏడున్నర పదుల వయసు దాటిన అత్యంత పురాతన పూర్వ విద్యార్థులుగా, లేటు వయసులోనూ ఘాటు స్నేహితులుగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు తమ అనుభూతులు, అనుభవాలను, నాటి, నేటి విద్యారంగంలో పరిస్థితులను 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో ఇలా పంచుకున్నారు.

నాడు కులాల ప్రస్తావన ఉండేది కాదు..

'మేం చదువుకునే రోజుల్లో కులాల ప్రస్తావన ఉండేది కాదు. పక్కనున్న విద్యార్థి, చదువు చెప్పే అధ్యాపకుడి కులమేంటో తెలిసేది కాదు. అత్యంత ప్రావీణ్యులే యూనివర్సిటీ వీసీలయ్యే వారు. అధ్యాపకుల్లోనూ మంచి నైపుణ్యం ఉండేది. అప్పట్లో ఎంసెట్ లేదు. ఇంజనీరింగ్ ఐదేళ్ల కోర్సుండేది. సమర్థవంతమైన నాయకులూ ఉండేవారు' అని 77 ఏళ్ల కెమికల్ ఇంజినీరింగ్ నిపుణుడు శొంఠి రామకృష్ణ చెప్పారు.

వాహ్ వైజాగ్.. ఎంత అందంగా ఉందో?

మేం చదువుకునే రోజుల్లో వైజాగ్ ఇంత అందంగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనంతో మెరిసిపోతోంది. అప్పట్లో 10, 17, 19 నంబర్ల బస్సులే నగరంలో ఉండేవి. ఎంతో అభివృద్ధి చెందింది. వైజాగ్ ఇండియాలో ద బెస్ట్ సిటీ. మా పూర్వ విద్యార్థుల కలయికకు క్రమం తప్పకుండా వస్తున్నాం' అని అమెరికా నుంచి వచ్చిన రిటైర్డ్ మెరైన్ ఛీఫ్ ఇంజినీర్ జంగాలపల్లి రామ్మోహనరావు వివరించారు.

కలిసినప్పుడు చిన్నపిల్లలై పోతున్నాం..

మేం కలిసినప్పుడల్లా వయసు మరిచిపోయి చిన్నపిల్లలై పోతున్నాం. సరదాగా అడిపాడుతున్నాం. మా అపూర్వ కలయికకు విదేశాల్లో స్థిరపడిన వారు, ఆరోగ్యం, వయసు సహకరించిన వారూ స్టిక్స్ పట్టుకుని మరీ వస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లాక ఎంతో శక్తి వస్తుందన్న అనుభూతి పొందుతున్నాం' అని హైదరాబాద్లో స్థిరపడ్డ టి.వెంకటేశ్వరరావు వివరించారు.

టెక్నాలజీ పెరిగింది.. నాలెడ్జి తగ్గింది.

ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది. కానీ విద్యార్థుల్లో నాలెడ్జితో పాటు క్రమశిక్షణ తగ్గింది. మా హయాంలో ఎక్కాలు, లెక్కలు గుక్కతిప్పుకోకుండా చెప్పేసే వాళ్లం. ఈ తరం కాలిక్యులేటర్లపై ఆధారపడుతున్నారు. గతంలో పాఠాలు కంఠతా పట్టేవారు. కానీ ఇప్పుడు కంఠతా అంటేనే తెలియదు. వైద్యులు సైతం గూగుల్పైనే ఆధారపడుతున్న పరిస్థితి' అని రాజమండ్రికి ఆర్అండ్ బీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అంబళ్ల రామకృష్ణ చెప్పారు.

మధురానుభూతిని పొందుతున్నాం..

మా పూర్వ విద్యార్థుల కలయికతో మధురానుభూతిని పొందుతున్నాం. ఈ ఏడాది నేను ఇక్కడ మా ఫాం హౌస్ లో ఆతిథ్యం ఇచ్చాను. దేశ విదేశాల నుంచి 70 మందికి పైగా వచ్చారు. మూడు రోజులు కల్చరల్ ఈవెంట్స్, ప్రకృతి రమణీయత మధ్య ఆనందంగా గడిపారు. రెండో రోజు మేం చదువుకున్న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లి విద్యార్థుల తో ముచ్చటించాం. మా బ్యాచ్్మట్లు అంతా కలిసి ఇచ్చిన రూ.4 కోట్లతో కట్టిన గదులను పరిశీలించాం. అక్కడ హాస్టల్లో భోంచేశాం' అని రిటైర్డ్ మెరైన ఛీఫ్ ఇంజినీర్ సబ్బి త్రినాథరావు చెప్పారు.

ఆనాటి జ్ఞాపకాలతో పునరుత్తేజం..

మా స్నేహానికి అరవై ఏళ్లు. మా వయసులు 77 ఏళ్లు దాటాయి. ఇరవై ఏళ్ల నుంచి మేమంతా ఏటా ఎక్కడో చోట కలుస్తున్నాం. కలిసినప్పుడల్లా అలనాటి జ్ఞాపకాలతో మళ్లీ పునరుత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నాం. నేను నూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ చక్రలో తొలి చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి 2000లో రిటైర్ అయ్యాను. అప్పట్నుంచి మా గెట్ టుగెదర్కు క్రమం తప్పకుండా హాజరవుతున్నా' అని బుద్ధరాజు రామరాజు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు.

Read More
Next Story