ఆంధ్రప్రదేశ్ లో ఆ కుటుంబానికి రాజకీయాల్లో తిరుగులేదు. ఐదుగురు అన్నాదమ్ములు అందరూ ఎమ్మెల్యేలే. ఎవరిదా కుటుంబం. వారు ఏ పార్టీలో ఉన్నారు.


ఆ కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు. అందరూ ఎమ్మెల్యేలే. రాజకీయాల్లో వారిని మించిన వారు లేరని నిరూపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం అందరూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు. వ్యాపారాల్లోనూ వారిది అందెవేసిన చేయి. రాజకీయాల్లో వారికి ఉన్న క్రేజ్ వేరేవారికి లేదంటే ఎవరైనా అంగీకరించాల్సిందే.

ఉరవకొండ నుంచి రాజకీయాల్లోకి భీమిరెడ్డి

వారిది కుటుంబం సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి యల్లారెడ్డిగారి భీమిరెడ్డి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం కొనకొండ. అప్పట్లో ఆయనకు ఎన్టీ రామారావుతో సంబంధాలు ఉండేవి. ఎన్టీఆర్ మద్రాస్ లో ఉండగా పరిచయాలు ఏర్పడ్డాయి. ఉరవకొండలో ల్యాండ్ మార్ట్ గేజ్ బ్యాంక్ కు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అనంతపురం జిల్లా టీడీపీ కన్వీనర్ గా పనిచేశారు. ఎన్టీ రామారావు భీమిరెడ్డి సేవలను గుర్తించి ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చారు. అలా మొదటి సారిగా భీమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా వ్యాప్తంగా భీమిరెడ్డికి మంచి పేరు వచ్చింది.

కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలే...

అప్పటికే పిల్లలు పెద్దవారయ్యారు. భీమిరెడ్డి తన కుమారులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కుమారుల్లో పెద్దవాడు యల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి. ఈయన ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండో కొడుకు జయరామిరెడ్డి (లేట్), మూడో కుమారుడు శివరామిరెడ్డి. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగో వ్యక్తి వెంకట్రామిరెడ్డి. బిఏ చదువుకున్నాడు. 2014లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో గుంతకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదోవాడు సాయిప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పీయూసీ వరకు చదువుకున్నారు. ఇక ఆరోవాడు బాలనాగిరెడ్డి. ప్రస్తుతం మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదట 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2014, 2019లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

మూడు ప్రాంతాల్లో ఆస్తులు...

తండ్రి భీమిరెడ్డికి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, బెంగుళూరులో ఆస్తులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో భీమిరెడ్డికి జేజమ్మ ఆస్తులు ఇల్లరికం పోవడం వల్ల వచ్చాయి. దీంతో కొందరు కర్నూలు జిల్లాలో స్థిరపడ్డారు. అలా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎవరికి వారు స్థిరపడ్డారు. రెండు జిల్లాల్లోనూ రాజకీయాల్లో రాణించారు. వైఎస్సార్సీపీలో సీట్లు సాధించి గెలుపొందారు. ఆరుగురు అన్నా తమ్ముళ్లలో రెండో వారు చనిపోగా ప్రస్తుతం ఉన్న ఐదుగ్గురిలో నలుగురు ఎమ్మెల్యేలుగా ఉండగా ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిలో అందరికంటే పెద్ద మహాలక్ష్మి ఆమె రాజకీయాల్లో లేరు. మిగిలిన ఐదుగురూ రాజకీయాల్లో రాణించడమే కాకుండా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.

సర్పంచ్ గా లలితమ్మ

వీరి తల్లి యల్లారెడ్డిగారి లలితమ్మ, మంత్రాలయం నియోజకవర్గంలోని కాచాపురం పంచాయతీకి సర్పంచ్ గా పనిచేశారు. ఈమె కూడా రాజకీయాల్లో నలుగురి మన్ననలు పొందారు. ఈనెల 13న అనారోగ్యంతో లలితమ్మ చనిపోయారు. ఈమె పార్థివ దేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లి నివాళులర్పించారు.

కుటుంబమంతా రాజకీయాల్లో..

రాష్ట్రంలో కుటుంబమంతా రాజకీయాల్లో ఉన్న అతి తక్కువ కుటుంబాల్లో ఒకటి. యల్లారెడ్డిగారి భీమిరెడ్డి కుటుంబమంటే తెలియని వారు ఉండరంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ప్రస్తుతం కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు, అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు, ఒకరు టీటీడీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Next Story