అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లలో తెలుగుకు ప్రాధాన్యతనిచ్చి సభ్యుల గౌరవానికి పాత్రుడయ్యారు.


అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు, ప్రశ్నోత్తరావుల, జీరో అవర్‌ ప్రస్తావనలు, లఘు చర్చలు పక్కన పెడితే తక్కిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ అన్నీ అధికంగా ఇంగ్లీషులోనే జరుగుతాయి. బిల్లులు ఆమోదించడం, కానీ, బిల్లులు ప్రవేశపెట్టడం కానీ ఇంగ్లీషులోనే జరుగుతుంటాయి. తీర్మానాలు ఆమోదింప చేసే సమయంలో కూడా స్పీకర్‌ ఇంగ్లీషులోనే ప్రొసీడింగ్స్‌ను ఫాలో అవుతుంటారు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇంగ్లీషుకు బదులుగా తెలుగుకు ప్రాధాన్యతనిచ్చారు. దీంతో సభలోని సభ్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అందరి అభిమానాన్ని చొరగొన్న స్పీకర్‌గా ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ రెండో రోజైన మంగళవారం జరిగింది. దీనిపై పలువురు సభ్యులు, మంత్రులు పొల్గొని ప్రసంగించారు. చివరిగా సభా నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించిన తర్వాత తీర్మానాన్ని ఆమోదింప చేశారు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు. ఆమోదింప చేస్తున్న సమయంలో తీర్మానానికి అనుకూలంగా ఉన్న వారు అవును అనాలని కోరగా సభ్యులందరూ అవును అంటూ తమ సమ్మతిని తెలిపారు. అనుకూలంగా లేని వారు కాదు అనాలని కోరారు. తీర్మానాన్ని వ్యతిరేకించే వారు ఎవ్వరూ లేకపోవడంతో, ఈ సభలో అవును అనే వాళ్లే ఈ సభలో ఉన్నారని, కాదు అనే వాళ్లు సభలో లేరని, దీంతో ఈ తీర్మానాన్ని ఆమోదింస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు తెలుగులో ప్రకటించి ప్రత్యేకతను చాటుకున్నారు.
గతంలో తీర్మానాన్ని ఆమోదించే సమయంలో స్పీకర్‌ ఇంగ్లీషు పదాలను ఉపయోగించడం పరిపాటి. ఎప్పటి నుంచో ఇది వస్తోంది. తీర్మానాన్ని సమ్మతించే వారందరూ యస్‌ అని చెప్పాలని, వ్యతిరేకించే వారందరూ నో చెప్పాలని అని అడిగేవారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌లుగా వ్యవహరించిన వారందరూ ఇదే కొనసాగించారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా వ్యవహరించిన తమ్మినేని సీతారామ్‌ కూడా అదే పద్దతిని అనుసరించారు. ఆంగ్ల పదాలను ఉపయోగించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం ఆంగ్ల పదాల వాడకానికి బదులు తెలుగు పదాలను వాడి సభ్యులందరి గౌరవ మన్ననలకు పాత్రుడయ్యారు. తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేసే సందర్భంలో కూడా ఆంగ్లపదాలను ఉపయోగిస్తారు. కానీ స్పీకర్‌ అయ్యన్న మాత్రం బుధవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు తెలుగులోనే ప్రకటించి సభ్యుల అభిమానానికి పాత్రుడయ్యారు. తెలుగుకు ప్రాధాన్యతనివ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుని ప్రశంసించారు.
Next Story