అక్కడ అందరూ ఆయన శిష్యులే...
ఆయన అక్కడ రాజకీయ భీష్ముడు. ప్రస్తుతం అక్కడ ఉన్న నేతలంతా ఆయన శిశ్యులే. ఇది చరిత్ర. ఇప్పుడిది అడ్డం తిరిగింది.

CK Babu, ex MLA
వైఎస్సార్ హయాంలో ఎదురులేని నాయకుడు
వైఎస్సార్ మరణానంతరం పార్టీలు మారాడు
ఏపార్టీలోనూ ఆయన ఇమేజ్ పెరగలేదు
టీడీపీలో నేనున్నానని తెరపైకి ఒక్కసారిగా వచ్చారు.
రాజు కింకరుడగున్.. కింకరుడు రాజగున్.. సరిగ్గా ఈ పథ్యం ఈయనకు వర్తిస్తుంది. కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన నాయకుడాయన. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కనుమరుగయ్యాడు. ఒక విధంగా అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పొచ్చు. అటువంటి వ్యక్తి నేనున్నానని ఒక్కసారిగా రాజకీయ తెరపై కనిపించారు. ఆయనే సీకే బాబు. చిత్తూరు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేకస్థానం. ఆయన ప్రస్తావన లేకుండా ఆ జిల్లా రాజకీయాలు మాట్లాడుకోలేం.
సీకే బాబు రాజకీయ నేపథ్యం..
సీకే బాబు నాలుగు సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండలి చైర్మన్‌గా కొంతకాలం పనిచేశారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1999 ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా మూడుసార్లు చిత్తూరు విజేతగా నిలిచారు. 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ టిక్కెట్ సాధించి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2014 నుంచి పోటీకి దూరం..
2014 ,2019 ఎన్నికల్లో సీకే బాబు పోటీకి దూరంగా ఉండిపోయారు. రాష్ట్ర విభజన తరువాత మొదట బీజేపీలో చేరారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పార్టీల నుంచి పెద్దగా ఆయనకు మద్దతు లభించలేదు. దీంతో ఇప్పటి వరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనకుండా ఉండిపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపాడని చెప్పొచ్చు. రాజకీయంగా తెరపై ఉంటే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావించిన సీకె బాబు టీడీపీలో అంటీముట్టనట్లు ఉన్నారు. తిరిగి ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి ప్రచార కార్యక్రమంలో అడుగు పెట్టారు. దీంతో చిత్తూరు రాజకీయాలు కాస్త వేడెక్కాయని చెప్పొచ్చు.
పోల్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట
సీకే బాబు పోల్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట. ఈయన పట్టుబట్టి పనిచేస్తే ఎన్నికల్లో ఆయన బలపరిచిన వ్యక్తే గెలవడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. తన అనుచరులను బూతుల్లో నియమించుకోవడం దగ్గర నుంచి ఓట్లు వేయించుకునే వరకు సీకే బాబును మించిన వారు లేరని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. వైఎస్సార్ ఉన్నప్పుడు సీకే బాబు నిప్పు కణికలా వ్యవహరించారని, ఆయన మరణానంతరం సీకే బాబు రాజకీయ జీవితం సుడిగుండంలో పడిందనేది రాజకీయ నాయకులు చెబుతున్న మాట.
టీడీపీ, వైఎస్సార్‌సీపీలో వర్గపోరు
తెలుగుదేశం పార్టీలోనూ రెండు వర్గాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వారు బయటకు వచ్చి వివాదాలకు దిగిన సందర్బాలులేవు. వైఎస్సార్‌సీపీలో వర్గపోరు బహిరంగమైంది. టీజీ వెంకటేశ్ అలియాస్ బుల్లెట్ సురేష్ (మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్), ఆర్ చంధ్రశేఖర్ (డిప్యూటీ మేయర్), రాహుల్ రాజారెడ్డి (చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్), పురుషోత్తమ్‌రెడ్డి (చిత్తూరు డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్)లు విజయానందరెడ్డికి వ్యతిరేక వర్గంగా ఉన్నారు. చిత్తూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, ఆయన అనుచరులు మరికొందరు కలిసి విజయానందరెడ్డి వర్గంగా ఉన్నారు. కార్పొరేషన్‌లో నలుగురు టీడీపీ కార్పొరేటర్లుగా ఉండగా 45 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇందులో 35 మంది ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ బలప్రయోగం ద్వారా ఏకగ్రీవమైన వారేననే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేటర్లు కూడా రెండు వర్గాలుగా ఉన్నారు.
ఇద్దరూ బలమైన అభ్యర్థులే..
చిత్తూరులో వైఎస్సార్‌సీపీ బలమైన అభ్యర్థిగా ఎంసీ విజయనందా రెడ్డిని బరిలోకి దింపింది. టీడీపీ నుంచి గురజాల జగన్ మోహన్ అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ రెడ్డి సామాజిక వర్గాన్ని రంగంలోకి దించగా టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దించింది. ఇద్దరూ ఆర్థికంగా బలమైన వారే. రానున్న ఎన్నికల్లో డబ్బు విచ్చల విడిగా ఖర్చుపెట్టే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Next Story